విరాట్ 'రికార్డు' మిస్సయ్యాడు! | Sakshi
Sakshi News home page

విరాట్ 'రికార్డు' మిస్సయ్యాడు!

Published Tue, May 31 2016 3:20 PM

విరాట్ 'రికార్డు' మిస్సయ్యాడు!

బెంగళూరు:మాస్టర్ బ్లాస్టర్, భారత మాజీ క్రికెటర్  సచిన్ టెండూల్కర్ను ప్రపంచ దిగ్గజ క్రికెటర్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సర్ బ్రాడ్మన్తో పోల్చడం మనకు తెలిసిందే. అయితే సచిన్ టెండూల్కర్తో  టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని ఇప్పుడు పోలుస్తున్నారు. ఈ ముగ్గురూ మేటి క్రికెటర్లు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా, ఆనాటి బ్రాడ్మన్ రికార్డును విరాట్ కోహ్లి తృటిలో చేజార్చుకున్నాడు. అప్పుడు టెస్టు సిరీస్లో బ్రాడ్మన్ నమోదు చేసిన రికార్డును, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో విరాట్ చేజార్చుకున్నాడు.  ఈ రెండు ఫార్మాట్లకు చాలా వ్యత్యాసమే ఉన్నా, ఒక టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన రికార్డులో ఇద్దరూ వరుస స్థానాల్లో నిలిచారు.

1930లో ఇంగ్లండ్లో జరిగిన ఐదు టెస్టుల యాషెస్ సిరీస్లో బ్రాడ్మన్ 974 పరుగులు నమోదు చేశాడు. ఆ సమయంలో ఏడు టెస్టు ఇన్నింగ్స్లు ఆడిన బ్రాడ్మన్ 139.14 సగటుతో ఒక సిరీస్లో అత్యధిక పరుగులు చేశాడు. ఆ తరువాత ఇంతకాలానికి, అంటే దాదాపు 80 దశాబ్దాల తరువాత విరాట్ ఆ రికార్డును చేరే అవకాశాన్నిపరుగు తేడాతో కోల్పోయాడు.  ఐపీఎల్-9లో 16 మ్యాచ్లాడిన విరాట్  81.08  సగటుతో 973 పరుగులు నమోదు చేశాడు. అయితే బ్రాడ్మన తన క్రికెట్ కెరీర్లో ఆరు సిక్సర్లు మాత్రమే కొడితే, కోహ్లి మాత్రం ఒక  ఐపీఎల్ సీజన్లో  అత్యధిక సిక్సర్లు(38 సిక్సర్లు) కొట్టిన ఘనతను సాధించడం విశేషం.

ఇదిలాఉండగా, వన్డేల్లో ఒకే సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాత్రం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పేరిట ఉంది. 1980-81లో బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్లో  గ్రెగ్ చాపెల్ వన్డేల్లో అత్యధిక పరుగులను సాధించాడు. ఆ సిరీస్లో 14 మ్యాచ్లాడిన చాపెల్  686 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ఆ రికార్డుకు సచిన్ దగ్గరగా వచ్చినా అధిగమించలేకపోయాడు. 2002-03లో దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ కప్లో సచిన్ 61.18 సగటుతో 673 పరుగులు మాత్రమే చేసి స్వల్ప తేడాలో చాపెల్ రికార్డును మిస్సయ్యాడు.

Advertisement
Advertisement