ఇక కావాల్సినంత ‘కిక్' | Sakshi
Sakshi News home page

ఇక కావాల్సినంత ‘కిక్'

Published Sun, Oct 12 2014 1:25 AM

ఇక కావాల్సినంత ‘కిక్' - Sakshi

కోల్‌కతా: భారత్‌లో క్రికెటేతర క్రీడలకు ఉనికి లేదనే ఆరోపణలకు సమాధానమా అన్నట్టు ఇటీవలి కాలంలో అన్ని క్రీడల్లో లీగ్‌లు దూసుకొస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్‌కు పోటీగా బ్యాడ్మింటన్, హాకీ, కబడ్డీ విభాగాల్లో టోర్నీలు అభిమానులను ఆకట్టుకోగా తాజాగా నేటి (ఆదివారం) నుంచి భారత క్రీడాభిమానులను మరో రసవత్తర లీగ్ కనువిందు చేయనుంది. అదే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్).

దేశంలో ఫుట్‌బాల్ క్రీడకు మరింత ఆదరణ తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఈ సరికొత్త టోర్నీ రూపుదిద్దుకుంది. దీంతో ఇక సాకర్ ప్రియులకు కావాల్సినంత ‘కిక్’. దేశంలోని సినీ, పారిశ్రామిక, క్రీడా దిగ్గజాలైన అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్, జాన్ అబ్రహాం, సచిన్, కోహ్లి, ధోని, గంగూలీలతో పాటు యూరోపియన్ క్లబ్స్ కూడా ఇందులోని జట్లను కొనుగోలు చేయడంతో ఈ లీగ్‌పై ఆసక్తి నెలకొంది. ఆదివారం సాల్ట్ లేక్ సిటీ స్టేడియంలో ఆరంభ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.

లక్షా 10 వేల మంది అభిమానులు దీనికి హాజరయ్యే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌కు ముందు నేటి సాయంత్రం 6గంటలకు అంతా బాలీవుడ్ స్టయిల్‌లో జరిగే ఈ వేడుకులకు సచిన్, గంగూలీ, అమితాబ్ బచ్చన్, అభిషేక్, రణబీర్, జాన్ అబ్రహాం రానున్నారు. ఎంఎస్ ధోని, కోహ్లి రాక అనుమానమే. ప్రియాంక చోప్రా, వరుణ్ ధావన్ తమ డ్యాన్స్‌తో ఉర్రూతలూగించనున్నారు. ఈ లీగ్ విజయవంతమ వుతుందా? లేదా అనే అంశంపై భారత్‌తో పాటు పలు దేశాల ఫుట్‌బాల్ సమాఖ్యలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Advertisement
Advertisement