ఊహాతీతం ఈ అమానుషత్వం | Sakshi
Sakshi News home page

ఊహాతీతం ఈ అమానుషత్వం

Published Mon, Aug 31 2015 12:57 AM

ఊహాతీతం ఈ అమానుషత్వం - Sakshi

ఈ హత్య ఎందుకు ఇంతగా మనల్ని నిర్విణ్ణులను చేసేసింది? మనమెరిగిన దురాగతాలన్నిటి అనుభవం పరిధికే కాదు, మన ఊహాశక్తికి సైతం మింగుడుపడని అమానుషత్వం ఈ హత్యలో ఉంది కాబట్టి. తల్లీ కూతుళ్ల మధ్య ఉండే అత్యంత పవిత్రమైన నైతిక జీవిత నిబంధనావళిని ఇది నమ్మశక్యం కానివిధంగా మొద్దుబారిపోయేట్టు చేసింది. దురాశతో జీవించేవారు డబ్బుతో రక్షణను కొనుక్కోగలమని విశ్వసిస్తారు. వారి విశ్వాసం నిరాధారమైనది కాదు. ఇంద్రాణి దాదాపుగా తప్పించుకోగలిగిందని ఎన్నటికీ మరవొద్దు.
 
 పరిపూర్ణమైన దుష్ట బుద్ధితో చేసిన హత్యకు వశీకరణ శక్తి ఉంటుంది. అంతులేని ఆసక్తితో గత్యంతరం లేనట్టు, అదో వెర్రిలాగా మనం అటే దృష్టి సారిస్తాం. మనోవైజ్ఞానిక విశ్లేషకులే అందుకు కారణాలేమిటో చెప్పగలుగుతారు. నేను మాత్రం నా పరిశీలన గురించే చెప్పగలను.  దుష్టత్వం ఎప్పుడూ ఆప్యాయతానురాగాలకు తావేలేని అమానుషత్వంగానే ఉంటుంది. లెక్కలేనన్ని వంచన ల పొరలలో చుట్టేసిన ఉద్వేగ రహితమైన లెక్కలపైనే ఆధారపడి ఉంటుంది. పలుకుబడి కలిగిన హంతకురాలికి కుతంత్రాలు చేయగల సామాజిక బృందాల రక్షణ దొరికితే... ప్రతి అబద్ధమూ సిద్ధాంతంగా చలామణీ అవుతూ ఆధారాల కోసం అన్వేషించే పోలీసు బలగాన్ని తప్పు దారి పట్టిస్తుంది. అంతేకాదు భయానక వినోదం పట్ల  ప్రజలలో అంతులేని దుర్దాహాన్ని సైతం ప్రేరే పించి గందరగోళాన్ని సృష్టిస్తుంది. షీనా బోరా హత్య పరిపూర్ణ దుష్టత్వపు ప్రతిరూపం.  

 మీడియాను అతి సులువుగా బురిడీ కొట్టించగలిగినప్పుడూ, పోలీసులు ఘోరంగా రాజీపడిపోయినప్పుడూ తప్ప అబద్ధం ఎంతో కాలం మన జాలదు. మన మీడియాలో తప్పులుంటే ఉండొచ్చు. కానీ దాన్ని వంచించడం అంత తేలికేం కాదు. అది బంతిని తిరిగి అవతలి కోర్టులోకి తోసేయనూ గలదు, గట్టిగా తిప్పి కొట్టనూగలదు. తన సవతి తండ్రి ఉపేంద్ర బోరా తనపై అత్యాచారం చేయడం వల్లనే షీనా పుట్టిందంటూ ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా ప్రచారంలోకి తెచ్చిన తాజా కథనాన్నే తీసుకోండి. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ దీన్ని ప్రధాన ప్రాముఖ్యాన్ని ఇవ్వదగిన విషయంగా పరిగణించింది. అయితే అదే పత్రిక అదే రోజున, ఆగస్టు 29న ఆ ఆరోపణను ఖండిస్తూ... షీనా టీనేజీ వయసు లోనే ఇంద్రాణి పెళ్లాడిన సిద్ధార్థ దాస్‌కు పుట్టిన కూతురని బోరా చెప్పిన కథనాన్ని (లోపల 17వ పేజీలోనే అయినా) కూడా ఇచ్చింది . ఇక ఈ విషయం తేలిగ్గానే డీఎన్‌ఏ పరీక్షలతో తేలిపోతుంది.

దుమ్మూ ధూళిపై ఓ కథనం తయారవ్వాలంటే గాలిలో దుమారాలు రేగాలి. మీడియాను తప్పు పట్టడం తేలికే. కానీ ప్రజలు దాన్ని ఎంత వరకు తీసుకుపోతే అంతవరకూ అది కూడా పోతుంది. పాఠకులు లేకపోతే కథనమే ఉండదు. ఈ హత్య ఎందుకు మనల్ని ఇంతగా మ్రాన్పడిపోయేలా చేసింది? ఎందుకు నిర్విణ్ణులను చేసేసింది? ఇది కేవలం ఇంకో హత్య మాత్రమే కాదు కాబట్టి. మనమెరిగిన దురాగతాలన్నిటి అనుభవం పరిధికే కాదు, మన ఊహాశక్తికి సైతం ఎంత మాత్రమూ మింగుడుపడనంతటి అమానుషత్వం ఈ హత్యలో ఉంది కాబట్టి. తల్లీ-కూతురు బంధానికి సంబంధించి మానవులలోనైనా లేదా జంతువులలోనైనా ఉండే అత్యంత పవిత్ర నైతిక జీవిత నిబంధనావళిని ఇది నమ్మశక్యం కానంతగా మొద్దుబారిపోయేట్టు చేసింది.  

 హత్యా కథనం బట్టబయలయ్యేసరికి అనుకోకుండా నేను ‘గోల్డెన్ ఏజ్ ఆఫ్ మర్డర్’ అనే చక్కటి పుస్తకాన్ని చదువుతున్నాను. జీకే చెస్టర్‌స్టన్ నుంచి ఇంగ్లిష్ సాహిత్యానికి అంతుపట్టని హత్యల కాల్పనిక సాహిత్యాన్ని సృష్టించి ఇచ్చిన అగాథా క్రిస్టీ వరకు ఉన్న ఉత్తేజకరమైన బ్రిటిష్ రచయితల తరం గురించి రాసిన పుస్తకమది.  క్రిస్టీ నవలల్లోని హ ంతకుడు ఎప్పుడూ  ‘‘మనలో ఒకడు’’గా అతి సాధారణంగా ఉండి, అనుమానించడానికి తావేలేని వాడై ఉంటాడు. అసాధారణంగా ప్రవర్తించే ఓ అపరాధ పరిశోధకుడు చివరకు న్యాయం చేస్తాడు.

బ్రిటిష్ హంతకులంత ఉపాయంగా వేరెవరూ హత్య చేయలేరు. (వారితో పోల్చదగినదేదీ భారతీయుల్లో లేదు. మన దేశంలో హత్యలు జరగకపోవడం అందుకు కారణం కాదు. హత్యా రహస్యాన్ని ఛేదించగలరనే విషయంలో మనకు నమ్మకం లేకపోవడమే కారణం కావచ్చు.) సామూహిక మారణకాండలో అమెరికన్లను మించినవారు లేరు. అయితే అది భిన్నమైన కథ. క్రిస్టీ రాసిన అంతుబట్టని హత్యల్లో చాలావరకు బ్రిటన్‌లో వాస్తవంగా జరిగిన ఘటనలపై ఆధారపడి రాసినవేనని తెలిసి ఆశ్చర్యపోయాను. విస్తృతమైన ఆ అపరాధ పరిశోధనా సాహిత్యంలో ఎక్కడా తల్లే తన కడుపున పుట్టిన కూతురిని హత్య చేసిన పుస్తకం లేదు. హఠాత్తుగా ఏదో కోపావేశం కారణంగా చేసిన హత్య కాదు గదా... ఇంద్రాణి చేసిందని ఆరోపిస్తున్నట్టుగా అంత ప్రశాంతంగా, క్రూరంగా కన్నకూతురు షీనాకు ముందుగా మత్తు మందిచ్చి, గొంతు పిసికేసి చంపడం ఎక్కడా కనబడదు. షీనా సోదరుడు మైఖేల్ కూడా ఆమె హిట్ లిస్ట్‌లో ఉన్నట్టనిపిస్తోంది.  మొదటి హత్య నైతికపరమైన నిబంధనావళి నుంచి ఎంతటి స్వేచ్ఛను ప్రసాదిస్తుం దంటే, అనివార్యంగా రెండో హత్యకు దారి తీస్తుంటుందనే సత్యాన్ని క్రిస్టీ నిర్ధారించారు. ఇది ఆ సత్యానికి రుజువుగా కూడా సరిపోతుంది.  

 హత్యలకు వెనుక ఉండే అతి పెద్ద కారణం దురాశ. భయం దాని తర్వాత స్థానంలో నిలుస్తుంది. దురాశతో జీవించేవారు డబ్బుతో రక్షణను కొనుక్కోగలమని విశ్వసిస్తారు. వారి  ఆత్మవిశ్వాసానికి కార ణం ఉంది. ఇంద్రాణి దాదాపుగా హత్యా నేరం నుంచి తప్పించుకోగ లిగిందని ఎన్నటికీ మర వొద్దు. మూడేళ్ల క్రితమే ఈ కేసు వెలుగులోకి రావలసింది. శవాన్ని కాల్చేసి వదిలేసిన ప్రాంతానికి సంబంధించిన పోలీసు అధికారికి ఓ ఆదివాసీ గ్రామీణుడు ఆ సమాచారం అందించినా ఆయన పరిశోధించ నిరాకరించారు. ఎందుకు? ఆయన కేమైనా డబ్బు ముట్టజెప్పారా? డబ్బు ఇచ్చివుంటే వారెవరు? రాహుల్ ముఖర్జియా మూడేళ్ల క్రితం ఇచ్చిన ఫిర్యాదును ముంబై పోలీసులు ఎందుకు తేలిగ్గా తీసుకున్నారు?

 హఠాత్తుగా సంబంధితులందరినీ మౌనం ఆవహించడం నిజంగానే నివ్వెరపోయేలా చేస్తోంది. ఒక అడ్రస్‌గానీ లేదా ఓ మొబైల్ నంబర్‌గానీ లేని అమెరికాలోని ఏదో ప్రదేశానికి షీనా  వెళ్లడం వల్లే కనబడటం లేదనే చెత్తవాగుడును నమ్మానని సంపన్నవంతుడైన ఇంద్రాణీ భర్త పీటర్ అంటున్నారు. ఈ మూడేళ్లలో ఆయన అమెరికాకు వెళ్లివచ్చే ఉంటారు. ఆమె ఎలా ఉందో కనుక్కునేపాటి ఆసక్తిని సైతం ఆయన కోల్పోయారా? ఇది మింగుడుపడేదేమీ కాదు.

 షీనా గొంతు నులమడానికి సహాయపడ్డ ఇంద్రాణి రెండో భర్త సంజీవ్  ఖన్నా మౌనం తేలికగానే అర్థం చేసుకోగలిగేది. ఆయన్ను కొనేశారు. ఒకప్పుడు చిన్న వ్యాపారియైన అతగాడు హఠాత్తుగా సంపన్నుడైపోయాడు. డబ్బు దేన్నయినా కొనగలదు, హత్యతో సహా.
 బహుశా ఈ కేసు కూడా, కొంతకాలం తర్వాతే అయినా న్యాయం... దైవిక న్యాయం అనేది జరుగుతుందని రుజువు చేయగలుగుతుంది. ఒక విధమైన దైవిక శిక్షగా తప్ప వివరించలేని రీతిలో అనుకోకుండా జరిగిన ఘటనల్లో ఒకటి ఈ నిశ్శబ్దాన్ని ఛేదించింది. నరకాన్ని మనం మరణానంతరం భగవంతుడు విధించే శిక్షగా భావిస్తుంటాం. కానీ నరకం ఇక్కడ, ఈ భూమి మీద కూడా ఉండగలదు. ఇంద్రాణి ముఖర్జీ, సంజీవ్ ఖన్నాలు ఇప్పటికే అక్కడికి చేరిపోయారు.
 
http://img.sakshi.net/images/cms/2015-08/51440963198_Unknown.jpg
ఎంజే అక్బర్ (వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి)

Advertisement
Advertisement