అచ్చ తెలుగు సరస్సు జీవనం కొల్లేటి జాడలు... | Sakshi
Sakshi News home page

అచ్చ తెలుగు సరస్సు జీవనం కొల్లేటి జాడలు...

Published Sat, Mar 15 2014 12:33 AM

అచ్చ తెలుగు సరస్సు జీవనం కొల్లేటి జాడలు... - Sakshi

అందరికీ కాకపోయినా చాలా మందికి బాల్యం ఒక మధురస్మృతి. అక్కినేని కుటుంబరావు ‘కొల్లేటి జాడలు’ నవల- కూడా ఒక బాల్య మధురస్మృతే. ఇది ఒక  సరస్సు సృష్టించిన వ్యవస్థ నడుమ విరిసిన బాల్య స్మృతుల మాధుర్యం. మట్టీ నీరూ, ఏరూ లంకా, వానా వరదా, చెట్టూ చేనూ, చేపలూ పక్షులూ, బర్రెలూ జలగలూ- సరస్సు జీవనంలో అనివార్యమైన వీటి చుట్టూ విహరించే కథనం. ఒకనాటి కొల్లేటి భౌగోళిక నిర్దిష్టతను, అది సృష్టించి నడిపించిన జీవనాన్నీ ఈ నవల మన కళ్లకు కడుతుంది.
 
 అయితే అంతటితో ఆగిపోదు. వర్తమాన విధ్వంసాన్ని వివరిస్తుంది. ఈ నవలకు కేంద్రమైన పులపర్రు గ్రామంలో మనకు నేరుగా, సరస్సు జీవనంతో అత్యంత సరళంగా ప్రత్యక్షంగా వ్యవహరించే లేదా తలపడే రెండే కులాలు కనిపిస్తాయి. ఒకటి వ్యవసాయం చేసే కమ్మదొరల కులమూ, రెండోది చేపలు పట్టే వడ్డి రాజుల కులమూ.
 
 కొల్లేరు తీరం వెంబడి ఉండిన అటువంటి గ్రామాలన్నిటా- సహజంగానే- వీరి వంటా తిండీ, పనీ పాలూ, గొడ్డూ గోదా, సంబరం వినోదం, అలవాట్లూ ఆచారాలూ ఇవన్నీ అక్కడ దొరికే చేపల చుట్టూ, పండే పంటల చుట్టూ పరిభ్రమిస్తూ వచ్చాయి. ఆ మేరకు ప్రకృతితో, స్థానిక భౌగోళిక నిర్దిష్టతలతో పెనవేసుకుపోయాయి. ఈ సహజ సంబంధాన్ని ‘కొల్లేటి జాడలు’ మనోహరంగా చిత్రిస్తుంది. ఇవేవీ తెలియని పాఠకులకు ఒక ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.
 
 ఈ నవలలో చిత్రించినదాన్ని బట్టి చూస్తే ఆ ప్రాంతంలో ఫ్యూడల్ ఇనుపచట్రం మరీ బిగుతుగా లేదనిపిస్తుంది. ఇందుకు కారణం ఇక్కడి శ్రమ ప్రకృతితో ప్రత్యక్షంగా తలపడేదిగానూ శ్రమదోపిడీ అతి తక్కువగానూ ఉండడం కావచ్చు. ఆ మేరకు నవలలోని సమాజం బాగా ‘అభివృద్ధి’ చెందిన మైదాన ప్రాంతాల కన్నా ‘వెనుకబడిన’ గిరిజన సమాజానికి దగ్గరలో ఉన్నట్టుగా కనిపిస్తుంది.
 
 
 అయితే కొల్లేటి ప్రకృతికి మరో పార్శ్వం కూడా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలు, తత్ఫలితంగా కొల్లేటిలో కలిసే వాగుల ఉద్ధృతి, అంతిమంగా సరస్సు సృష్టించగల విధ్వంసం- వీటి మధ్య నిత్య ప్రశ్నార్థకంగా మిగిలే ‘కొల్లేటి వ్యవసాయం’- ఈ లింకుల్నీ, వాటి చుట్టూతా జరిగే నిరంతర పోరాటాన్ని కూడా మన కళ్లకు కడుతుందీ నవల. ఒక దశలో ‘మన పూర్వీకులు ఇలాంటి చోటుకొచ్చి స్థిరపడ్డారెందుకా’ అని గ్రామస్తులు తలలు పట్టుకుంటారు. అలాగని నిరాశలో కూరుకు పోకుండా తమవంతు కృషి చేసి గీతాబోధనను ఆచరణలో పెడతారు.
 
 కొల్లేరులో రైతుల పరిస్థితితో పోలిస్తే చేపలు పట్టి అమ్ముకునే వడ్డిరాజుల పరిస్థితి కాస్త మెరుగ్గా, అంటే కొంత నిలకడగా ఉన్నట్టు తోస్తుంది. ఇందుకు ప్రధాన కారణం- అప్పట్లో కొల్లేరులో నిత్యం పుష్కలంగా దొరికే చేపలు. అప్పటికి పెట్టుబడి పెట్టి చేపల్నీ రొయ్యల్నీ ‘పండించే’ ప్రయత్నం ఇంకా మొదలు కాలేదు కనుక జీవితం ప్రశాంతంగానే ఉంది. అయితే నవల చివరిలో- అంటే ఒక తరం గడిచేక- ఈ ప్రశాంతత పోయింది.
 
 ఊరూరా తిరిగి చేపల్ని అమ్ముకొనే సరళ వాణిజ్య స్థానంలో భారీ పెట్టుబడీ, దూరప్రాంతాలకు ఎగుమతీ చోటు చేసుకొని అంతకు ముందు లేని రిస్కులను, సంక్ష్లిష్టతనూ సృష్టిస్తాయి. అంతేకాదు ప్రకృతిలో ఉండిన సమతుల్యాన్ని ధ్వంసం చేస్తాయి. దీనికి పట్టణాల పెరుగుదల, అవి సృష్టించే మార్కెట్, ఎగువ ప్రాంతాల పారిశ్రామికీకరణ, దాని వెంట వచ్చే కాలుష్యం తోడవుతాయి. తీవ్రగతిన వినాశనం విస్తరిస్తుంది. రచయిత చెప్పించిన మాటల్లో- ‘వాళ్ల తప్పు వాళ్లకు తెలిసిందిగానీ చాలా ఆలస్యంగా తెలిసింది’
 
 అయితే బాహ్యశక్తుల ప్రభావం కేవలం విధ్వంసానికే పరిమితమైందనుకోవడం కూడా సరికాదు. కొద్దిమందైనా చదువుకొని పట్నాలకు పోవడం, తిరిగి వచ్చి,  సాహిత్యం సినిమాల వల్ల వచ్చిన చైతన్యంతో గ్రామాల్లో కొత్త ప్రశ్నలు లేవదీసి స్తబ్దతను వదల గొట్టడమూ కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఈ నవలా రచయిత కుటుంబరావు జీవితానుభవం, సృజనాత్మక కృషి కూడా ఇలాంటి ప్రభావం వల్ల సంభవించినవే. అందువల్ల ఈ క్రమాన్ని కూడా ‘కొల్లేటి జాడలు’ సృజనాత్మకంగా, సాధికారంగా నమోదు చేస్తుంది. ఏమైనా వ్యక్తులకు చైతన్యం కలిగి సమష్టిగా ఏదైనా చేసేలోపే ఆసియా ఖండపు అతిపెద్ద మంచినీటి సరస్సు సమూలంగా నాశనమైన తీరును ఈ నవల ప్రధానంగా మనముందుంచుతుంది.
 
 ఈ నవల చదవడం పూర్తయేసరికి ‘అయ్యో ఇలా ఎందుకు జరిగింది? ఇలా జరగకూడదు’ అనిపిస్తుంది. ఎందుకిలా జరిగిందనే ప్రశ్నకు నవలలోనే సమాధానం దొరుకుతుంది. మిగతా చోట్ల కూడా ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలనే ప్రశ్నను ఈ రచన పాఠకులకు విడిచిపెడుతుంది. ఇందుకుగాను శ్రమిస్తున్న వాళ్లతో చేతులు కలపాలనే ఆలోచనను కలిగిస్తుంది.  అలాగని ఉత్తుత్తి ఆశావాదపు భ్రమని కలిగించదు. అందుచేత ‘కొల్లేటి జాడలు’ నవల ఒక వ్యక్తి ఎప్పటికీ తిరిగిరాని తన బాల్యం గురించి రాసుకున్న కథ మాత్రమే కాదు. అంతకన్నా ముఖ్యంగా- ఒక సమాజం చేజేతులా నాశనం చేసుకున్న తిరిగిరాని జీవనం గురించి మోగించిన ప్రమాద ఘంటిక. తుది హెచ్చరిక.
 - సుధాకర్ ఉణుదుర్తి

Advertisement
Advertisement