ఎర్రకోటలో పంద్రాగస్టు పండుగ.. | Sakshi
Sakshi News home page

ఎర్రకోటలో పంద్రాగస్టు పండుగ..

Published Tue, Aug 15 2017 8:44 AM

Modi flag  hoisting on Independence Day

♦ జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని


 
 
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మునికి రాజ్‌ ఘాట్‌ వద్ద నివాళుర్పించిన మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
 
అంతకు ముందు దేశ ప్రధానిగా మోదీ త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలమంది ప్రజలు ఎర్రకోటకు తరలివచ్చారు. 
 
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారందరికీ వందనాలు..
ప్రధాని హోదాలో నాలుగోసారి జాతీయ జెండాను ఎగురవేసిన మోదీ జాతీనుద్దేంచి ప్రసంగిస్తూ.. ' ప్రియమైన దేశ ప్రజలందరికీ శుభాభినందనలు. మనం స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు శ్రీకృష్ణష్టామి జరుపుకుంటున్నాము. దేశకోసం ఎం‍తోమంది ప్రాణత్యాగం చేశారు. వారందరికీ నా వందనాలు. గడిచిన రోజుల్లో చాలా ప్రాంతాల్లో సంకట పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశ వ్యాప్తంగా వరదలతో అపార నష్టం జరిగింది. ప్రకృతి వైపరీత్యాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిలో అమాయక చిన్నారులు మృతి చెందడం బాధాకరమైన విషయం. ఇలాంటి సంకట పరిస్థితుల్లో అందరూ ఐక్యంగా ఉండాలి. ఐక్య పోరాటంతోనే ఆంగ్లేయులు వెళ్లిపోయారు. నవభారత నిర్మాణానికి అందరం కృషి చేయాలి. 2022 కల్లా నవ భారతాన్ని నిర్మించాలి' అని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు.
 
♦ ఆలింగనంతో కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం...
తిట్లు, తూటాలతో కాదు ఆలింగనంతోనే కశ్మీర్‌ సమస్య తీరుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. సరిహద్దు రక్షణ కోసం మన సైనికులు రక్షణగా ఉన్నారన్నారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచంతో కలిసి పనిచేస్తున్నామని..  ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రపంచ దేశాలు సహకరిస్తున్నాయన్నారు. విశ్వంలో భారత్‌ దూసుకెళ్తుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతొందన్న మోదీ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, పోలీసుల సేవలు మరువలేనివన్నారు. ఇకనుంచి పేదలను దోచుకునేవారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తామని, నిజాయితీ పరులకు ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. జీఎస్టీతో కొత్త చరిత్ర సృష్టించామని.. కొత్త పన్ను విధానానికి అందరి మద్దతు లభిస్తోందని తెలిపారు. మధ్యతరగతి వారి సొంతింటి కలను నిజం చేస్తామని హామి ఇచ్చారు. 
 

 

Advertisement
Advertisement