20 వేల కోట్లతో ముద్ర బ్యాంక్ | Sakshi
Sakshi News home page

20 వేల కోట్లతో ముద్ర బ్యాంక్

Published Sun, Mar 1 2015 5:52 AM

loan facility for ST and ST Industrialists

- ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రుణసౌకర్యం

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను ప్రోత్సహించడానికి ప్రాథమికంగా రూ. 20 వేలకోట్ల కార్పస్ నిధితో ముద్ర బ్యాంక్ (మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ)ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ఈ బడ్జెట్‌లో ప్రకటించింది. ఇందులో రూ.3వేల కోట్ల మేర కార్పస్ నిధిని క్రెడిట్ గ్యారంటీకింద కేటాయిస్తారు. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ఈ ఆర్థిక సంస్థద్వారా మైక్రోఫైనాన్స్ సంస్థలకు రీఫైనాన్స్ చేస్తారు. వాటి ద్వారా ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలకు రుణసౌకర్యం కల్పిస్తారు.
 
రుణాల మంజూరులో చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు నడిపే ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలకే మొదటి ప్రాధాన్యం ఉంటుంది. దేశంలో 5.77 కోట్ల చిన్నతరహా వ్యాపార యూనిట్లు ఉన్నట్లు గుర్తించామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వీటిలో సుమారు 62 శాతం మేర ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల చేతిలోనే ఉన్నాయని, అందులోనూ వ్యక్తిగతంగా నడిపేవే ఎక్కువని తెలిపారు. అయితే వీరు తమ వ్యాపార అవసరాలకోసం డబ్బు కొరత ఎదుర్కొంటున్నారని, ఇతర మార్గాలను ఆశ్రయించి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీరిని ఆదుకునేందుకే ముద్ర బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు.

 

Advertisement
Advertisement