సింగపూర్ కంపెనీలకు దాసోహం | Sakshi
Sakshi News home page

సింగపూర్ కంపెనీలకు దాసోహం

Published Tue, Jun 28 2016 1:13 AM

సింగపూర్ కంపెనీలకు దాసోహం - Sakshi

- ఆ సంస్థల ఆర్థిక ప్రయోజనాలకే సర్కార్ పెద్దపీట
- స్విస్ చాలెంజ్ ముసుగులో నామినేషన్‌పై కట్టపెట్టిన సీఎం
 
 సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ సంస్థలకు సాగిలపడింది. ఆ సంస్థలు పెట్టిన అడ్డగోలు షరతులన్నింటినీ సీఎం  తలూపేశారు. అమరావతి డెవలప్‌మెంట్ భాగస్వామి ఎంపిక విషయంలో సింగపూర్ సంస్థలు అసెండాస్, సెమ్బ్‌కార్ఫ్ కన్సార్టియం స్విస్ చాలెంజ్ విధానంలో ప్రతిపాదించిన రాయితీ అండ్ డెవలప్‌మెంట్, షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్లు రైతుల భూములతో పాటు రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టేలా ఉన్నా అంగీకరించారు. స్విస్ చాలెంజ్ పేరిట నామినేషన్‌పై సింగపూర్ సంస్థలకు కట్టపెట్టడానికే ప్రాధాన్యం ఇచ్చారు.

భవిష్యత్‌లో పరిహారాలు చెల్లించాల్సి వచ్చినా సింగపూర్ సంస్థలకు  సంబంధం ఉండదని, ఏపీ ప్రభుత్వానికి మాత్రం ఉంటుందనే నిబంధనతో రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టారు. ఎస్క్రో అకౌంట్ తెరిచేందుకు సింగపూర్ సంస్థలు అంగీకరించకపోయినా పట్టించుకోలేదు. నిబంధనలన్నింటినీ ఉల్లంఘిస్తూ సింగపూర్ సంస్థల ఆర్థిక ప్రయోజనాలకే పెద్దపీట వేశారని, 20 ఏళ్ల పాటు అవసరమైతే మరో ఐదేళ్ల పాటు వాణిజ్యపరంగా భూములను అభివృద్ధి చేసి విక్రయించుకునే అధికారం ఆ సంస్థలకు కట్టపెట్టారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సింగపూర్ సంస్థలు రూపొందించిన రాయితీ అండ్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ ఉద్దేశాలను, లక్ష్యాలను, బిజినెస్ ప్రణాళికలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరహాలో అమరావతి డెవలప్‌మెంట్ భాగస్వామి పనిచేయనుంది. ఆ కంపెనీల చేతిలో అమరావతి డెవలప్‌మెంట్ భాగస్వామి కీలు బొమ్మ కానుంది. ఈ వ్యవహారాలను స్వయంగా సీఎం చంద్రబాబు చూడటం గమనార్హం.

 కొండంత రాయితీలు కల్పించినా..
 చంద్రబాబు సర్కారు కొండంత రాయితీలు కల్పించినా సింగపూర్ సంస్థలు పెట్టే మూల పెట్టుబడి కేవలం రూ.306.40 కోట్లు మాత్రమే. రాజధాని భూములను తనఖా పెట్టడం ద్వారా బ్యాంకుల నుంచి రుణంగా మిగతావి సేకరిస్తాయి. ఆ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి.అంటే రాజధాని రైతుల భూములను తాకట్టు పెట్టి సింగపూర్ సంస్థలు రుణాలు తీసుకుని, ఆ డబ్బుతో రాజధాని నిర్మిస్తాయన్నమాట. ఇందుకు సీఎం చంద్రబాబు  అంగీకరించారు. భవిష్యత్‌లో సింగపూర్ సంస్థలతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తే అప్పటివరకు ఆ సంస్థలు పెట్టిన పెట్టుబడులకు పది రెట్లు పరిహారంగా చెల్లించాలనే నిబంధనకు సైతం ప్రభుత్వం అంగీకరించింది. అంటే సింగపూర్ సంస్థలు వచ్చే ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టిన తరువాత తొలగిస్తే ఆ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. పది వేల కోట్ల పరిహారం చెల్లించాలి.

సీడ్ కేపిటల్ పరిధిలో  సింగపూర్ సంస్థలు అభివృద్ధి చేసే 1691 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను సీఆర్‌డీఏ సొంత నిధులతో చేపట్టాలి.రహదారులు నిర్మాణం, మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా, ఇతర డ్రైనేజీ వంటి వసతులను సీఆర్‌డీఏనే చేపట్టాలి. వీటిని ఆరు నెలల నుంచి 12 నెలల్లోగా చేపట్టాలి.లేకుంటే సింగపూర్ సంస్థలకు పెనాల్టీని చెల్లించాలి. మౌలిక వసతుల కల్పనకు రూ.5వేల కోట్ల వ్యయం అవుతుందని సీఆర్‌డీఏ అంచనా వేసింది. అంత వ్యయం చేసి  వసతులు కల్పిస్తే సింగపూర్ సంస్థలు ప్లాట్లు వేసి మూడో పార్టీకి లీజుకు  విక్రయిస్తాయి. రైతుల భూముల్లో ప్రభుత్వ ఖర్చులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తే.. సింగపూర్ సంస్థలు వాటిని బ్యాంకుల్లో తాకట్టుపెట్టి వాణిజ్య, వ్యాపారపరమైన అభివృద్ధిని మాత్రమే చేపడతాయి.

ఇందులో రెవెన్యూ వాటా ఎంతనేది సింగపూర్ సంస్థలు సీల్డ్ కవర్‌లో రహస్యంగా ఇస్తాయి. అది ఎంతి స్తారో తెలియకపోతే ఇతర సంస్థలు ఏ విధంగా చాలెంజ్ చేస్తాయనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. స్విస్ చాలెంజ్ ముసుగు మాత్రమేనని, నామినేషన్‌పై కట్టపెట్టడమేనని అధికార వర్గాలు అంటున్నాయి. స్వయంగా సీఎం సింగపూర్ సంస్థల ప్రతినిధులతో ఫోన్‌లో మంతనాలు జరపడం,వాటి ప్రతిపాదనలన్నింటికీ అంగీకరించడం,మంత్రుల కమిటీచే అంగీకరింపచేయడం అంతా ఏకపక్షంగా సాగిపోయాయని అధికార యంత్రాంగం పేర్కొంటోంది.

Advertisement
Advertisement