కాంట్రాక్టర్ నుంచి దొంగగా... | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్ నుంచి దొంగగా...

Published Sun, Feb 14 2016 10:14 AM

కాంట్రాక్టర్ నుంచి దొంగగా... - Sakshi

*  పోలీసుల కళ్లుగప్పి మూడుసార్లు పరారీ
* పట్టుబడ్డ ఘరానా దొంగ శ్రీనివాస్

 సాక్షి, సిటీబ్యూరో: సివిల్ కాంట్రాక్టులు చేసి ఓ వ్యక్తి ఆర్థికంగా నష్టపోయాడు... జల్సాలకు అలవాటుపడి హంతకుడిగా మారాడు....తర్వాత చైన్ స్నాచింగ్‌లు మొదలెట్టాడు... ఈ కేసుల్లో అరెస్టయి మూడుసార్లు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. చివరకు మాదాపూర్ సీసీఎస్ పోలీసులకు చిక్కాడు.

గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో శనివారం సైబరాబాద్ క్రైమ్స్ ఓఎస్‌డీ నవీన్‌కుమార్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్‌ఆర్ కడప జిల్లా రామాపురం మండలం నల్లకుంటపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ కడపలో ఐటీఐ వరకు చదివాడు. 2006 వరకు సివిల్ కాంట్రాక్టర్ గా పని చేసి ఆర్థికంగా నష్టపోయాడు. ఇదే క్రమంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీహరితో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. శ్రీహరి ప్రోద్భలంతో అర్షద్ ఆలీ, శేఖర్, చక్రధర్, శ్రీనివాస్ రెడ్డి, దొరరెడ్డి, ప్రసన్నలక్ష్మీతో కలిసి సాయిరెడ్డి అనే వ్యక్తిని హతమార్చారు. ఈ కేసులో అరెస్టయి జైలుకెళ్లి బెయిల్‌పై వచ్చిన శ్రీనివాస్‌కి పశ్చిమగోదావరి చేబ్రోలుకు చెందిన రఘురామ్ అనే చైన్‌స్నాచర్‌తో స్నేహం ఏర్పడింది. 2007లో వీరిద్దరూ కలిసి చైన్‌స్నాచింగ్‌లు చేశారు. నిడదవోలు పోలీసులు అరెస్టు చేసి రాజమండ్రి కేంద్ర కారాగారానికి పంపారు. 2009లో బయటికొచ్చిన వీరు కాకినాడలో మళ్లీ గొలుసు చోరీలు మొదలెట్టారు.

 మూడుసార్లు పరారీ...
2013లో తాడేపల్లిగూడెం పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే నిడదవోలు ఎస్కార్ట్ పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడు. మళ్లీ రఘురాంతో కలిసి కాకినాడలో చైన్ స్నాచింగ్‌లు చేశాడు. పోలీసులకు చిక్కి 2014లో రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లాడు.  మళ్లీ రాజమండ్రి ఎస్కార్ట్ పోలీసుల నుంచి తప్పించుకొని విజయవాడ హనుమాన్ జంక్షన్ పోలీసులకు పట్టుబడ్డాడు. మళ్లీ రాజమండ్రి జైలుకు చేరిన ఇతనికి వైజాగ్‌కు చెందిన శివ(రాత్రి ఇళ్లల్లో   చోరీలు చేస్తాడు)తో స్నేహం ఏర్పడింది.

2015లో శ్రీనివాస్ రాజమండ్రి పోలీసుల నుంచి తప్పించుకొని హైదరాబాద్‌కు మకాం మార్చాడు. 2015 సెప్టెంబర్‌లో జైలు నుంచి విడుదలైన శివ శంకర్‌తో కలిసి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధితో పాటు ఆరు జిల్లాల్లో రాత్రి వేళల్లో ఇళ్లలో చోరీలు చేశాడు. సైబరాబాద్‌లో 8 దొంగతనాలకు పాల్పడ్డాడు. అలాగే ఇతనిపై అనంతపురంలో ఒకటి, చిత్తూరులో రెండు, గుంటూరులో ఒకటి, నెల్లూరులో రెండు, ప్రకాశంలో రెండు కేసులున్నాయి. అయితే మాదాపూర్ సీసీఎస్ పోలీసులు అందిన పక్కా సమాచారం మేరకు ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్ర రెడ్డి నేతృత్వంలోని బృందం కేపీహెచ్‌బీ సమీపంలోని నిజామ్‌పేటలో నిందితుడు శ్రీనివాస్‌ను శనివారం పట్టుకున్నారు. తదుపరి విచారణ కోసం కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. మరో దొంగ శివ శంకర్ పరారీలో ఉన్నాడు.

Advertisement
Advertisement