మూడు రైళ్లలో దొంగల బీభత్సం | Sakshi
Sakshi News home page

మూడు రైళ్లలో దొంగల బీభత్సం

Published Fri, Nov 6 2015 8:44 AM

Robbers attacked with stones on three trains, gold theft

అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో  శుక్రవారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సిగ్నల్ కోసం ఆగి ఉన్న రైళ్ల పై దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఇదే అదునుగా చేసుకొని మూడు రైళ్లలోని నాలుగు భోగీలలో చోరీలకు పాల్పడ్డారు.  వివరాలు.. నాందేడ్ నుంచి బెంగళూరు వెళ్తున్న నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి చేసిన దుండగులు అనంతరం బోగీలలోకి చొరబడి ప్రయాణికుల నుంచి సుమారు 50 తులాల బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు.

అనంతరం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ పై కూడా ఇదే విధంగా దాడి చేసిన దుండగులు 4 బోగీల్లోని దోపిడీకి పాల్పడ్డారు.  ఆ తర్వాత ముంబాయి నుంచి బెంగళూరు వెళ్తున్న ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ లో కూడా దోపిడీకి దిగారు. దీంతో బాధితులు రైల్వే పోలీసులను ఆశ్రయించారు.

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న లోకో పైలట్ భాస్కర్ దొంగలను ప్రతిఘటించడానికి ప్రయత్నించడంతో దొంగలు అతని పై దాడికి దిగారు. దీంతో భాస్కర్ తీవ్రంగా గాయపడ్డాడు. మరో ప్రయాణికుడు గాయపడ్డారు. ఈ మూడు ఘటనలలో సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. సుమారు10 మంది దుండగులు అకస్మాత్తుగా వచ్చి కత్తులతో బెదిరించి దాడి చేశారని ప్రయాణికులు చెబుతున్నారు. కాగా గతంలో కూడా ఇదే ప్రాంతంలో రెండుసార్లు ఇలాంటి ఘటనలు జరిగిన అధికారులు కళ్లు తెరవకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement