ఆ కిక్కుతో మెదడు గుల్ల | Sakshi
Sakshi News home page

ఆ కిక్కుతో మెదడు గుల్ల

Published Fri, Nov 27 2015 3:35 PM

ఆ కిక్కుతో మెదడు గుల్ల

లండన్: కిక్కు కోసం వాడే గంజాయి మెదడుపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ముఖ్యంగా మెదడులోని రెండు అర్థగోళాలకు మధ్య సమన్వయం నిర్వహించే భాగంపై పనిచేయడం వలన తీవ్రమైన హానిని కలుగజేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. బ్రిటన్లో ఈ తరహా మత్తు పదార్థాల వాడకం అధికంగా ఉంది. ఒక దశాబ్థ క్రితం నాటి గంజాయితో పోలిస్తే.. ప్రస్తుతం వాడుతున్నటువంటి ఎక్కువ గాడతగల గంజాయిలో టెట్రా హైడ్రో కనాబినల్(టీహెచ్సీ) మోతాదు అధికంగా ఉండటం వలన దీని దుష్పరిణామాలు మరింత పెరుగుతున్నట్లు లండన్ లోని కింగ్స్ కాలేజీ పరిశోధకుల బృందం తెలిపింది.

మెదడు పనితీరులో కీలకపాత్ర పోషించే కార్పస్ కెల్లోసమ్ అనే భాగంపై టీహెచ్సీ నేరుగా ప్రభావం చూపడంతో అనేక మానసిక రుగ్మతలు ఏర్పడుతాయి.  పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు గంజాయిని తీసుకోని వారి మెదడుతో పోల్చినప్పుడు తీసుకునే వారి మెదడులో విపరీతమైన మార్పులు గమనించారు. కార్సస్ కెల్లోసమ్లోని నాడీకణాల ఆక్సాన్లు టీహెచ్సీని ఎక్కువమోతాదులో గ్రహించే లక్షణం కలిగి ఉండటం కూడా దీనికి ఒక కారణంగా చెబుతున్నారు. ఎమ్ఆర్ఐ ద్వారా పరిశీలించినప్పుడు గంజాయి బాధితుల మెదడులో తెలుపు భాగం తీవ్రంగా ప్రభావితమై ఉన్నట్లు తేలింది. వీరిలో అనేక మానసిక వ్యాధులకు గంజాయి వాడడం కారణంగా తెలిపారు.

Advertisement
Advertisement