అమ్మ... మన మలుపు గెలుపు! | Sakshi
Sakshi News home page

అమ్మ... మన మలుపు గెలుపు!

Published Sun, Aug 21 2016 4:19 PM

అమ్మ... మన మలుపు గెలుపు! - Sakshi

పాటతత్వం
 అమ్మ.. మన అడుగు
 అమ్మ.. మన వెలుగు
 అమ్మ.. మన మలుపు
 అమ్మ.. మన గెలుపు
ఏమని చెప్పాలి... ఎంతని చెప్పాలి... అమ్మ గురించి చెప్పడానికి పదాలు చాలవు. ఈ సృష్టిలో అమ్మే లేకుంటే మనం లేము. అమ్మ గొప్పతనం వర్ణించడానికి ఎన్ని పాటలైనా సరిపోవు. గతంలో అమ్మపై చాలా పాటలొచ్చాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ‘లోఫర్’లో అమ్మపై ఓ పాట చేసే అవకాశం నాకు లభించింది.

చిత్రంలో సందర్భం ఏంటంటే... ఊహ తెలియని వయసులోనే తల్లి నుంచి బిడ్డను దూరం చేసేస్తాడు ఓ తండ్రి. ఊహ వచ్చిన తర్వాత ‘నాన్నా.. అమ్మ ఏది?’ అని బిడ్డ అడిగిన ప్రతిసారీ మరణించిందని చెబుతాడు. అమ్మ బతికుందని తెలిసిన తర్వాత ఆ బిడ్డ మనసు పడే వేదనే ఈ పాట. సుద్దాల అశోక్ తేజగారు చాలా గొప్పగా రాశారు. జానపద శైలిలో పాటను స్వరపరచడం వలన ప్రేక్షకులకు సులభంగా చేరువైంది. పాట విన్న ప్రతిసారీ నా కళ్లు చెమర్చుతాయి. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎటువంటి సందర్భం ఎదురైనా...  అమ్మ ఎంత ముఖ్యం అనేది పాటలో వివరించారు.
 
సువ్వీ సువ్వాలమ్మా ఎట్టా సెప్పేదమ్మా
 నువ్వే గీసిందమ్మా మాటాడే ఈ బొమ్మ
 నా తలపై సెయ్యే పెట్టి.. నీ కడుపులో పేగును అడుగు
 మన ఇద్దరి నడుమున ముడి ఏందో.. అది గొంతెత్తి సెప్పుతాది వినుకోవే
 దునియాతో నాకేంటమ్మా.. నీతో ఉంటే చాలమ్మా...
 బ్రహ్మ గీసిన బొమ్మలే మనుషులంతా. ఆయనే మన తలరాత రాస్తాడని అంటుంటారు. కానీ, ఈ భూమ్మీద మనిషి బొమ్మను గీసేది మాత్రం అమ్మేనండీ. నవమాసాలూ మోసి జన్మనిచ్చిన తర్వాత ఓ వ్యక్తిగా, ఓ మనిషిగా మనల్ని తీర్చిదిద్దడంలో, అడుగులు వేయించడంలోనూ అమ్మ పాత్ర అనిర్వచనీయం. ప్రపంచంతో, పరిస్థితులతో పనిలేదు. అమ్మ ఉంటే చాలు. మంచి మనిషిగా ఎదుగుతాం. చిన్నారి బాధ ఏంటో? అమ్మ పేగుకి తెలుస్తుందంటారు కదా. దాన్ని, ‘నీతో ఉంటే చాలమ్మా..’ తర్వాత ‘ఎలో.. ఎలో.. నీ ఊగింది. ఒడి ఊయలలోనే’ అని సన్నివేశానికి అనుగుణంగా చెప్పారు.  
 కాళ్ల మీద బజ్జొబెట్టి లాలపోసినావు ఏమో..
 మళ్ళీ కాళ్ళు మొక్కుతాను గుర్తొకొస్తనేమో సూడు
 యెండి గిన్నెల్లో ఉగ్గుపాలు పోసి.. నింగి చందమామను నువ్వు పిల్వలేదా
 
అవునో కాదంటే నువ్వు అడగవమ్మా.. మబ్బు సినుకై సెప్పుతాది యెన్నెలమ్మ
 దునియాతో నాకేంటమ్మా.. నీతో ఉంటే చాలమ్మా..!
 ఈ చరణంలో తనను గుర్తుపట్టని తల్లిని ‘లాలి’ ‘కాళ్ళు మొక్కుతాను’ ‘ఉగ్గుపాలు’ అని గుర్తుచేసే ప్రయత్నం చేస్తాడు హీరో. మనం ఒక్కసారి గమనిస్తే.. లాలిపోయడం దగ్గర్నుంచి బిడ్డ క్షేమం కోసం ఓ తల్లి ఎంత తపన పడుతుందండీ. ఉగ్గుపాలు పట్టించడంతో పాటు ఊహ తెలిసిన తర్వాత మంచీ చెడూ అన్నీ నేర్పే తొలి గురువు అమ్మే. బిడ్డ జీవితంలో వెలుగులు నింపుతుంది.
 తల్లి కోడిపిల్లనొచ్చి తన్నుకెల్లే గద్దలెక్క
 ఎత్తుకెల్లినోడు నన్ను పెంచలేదు మనిషిలెక్క
 సెడ్డదారుల్లో నేను ఎల్లినాక.. సెంపదెబ్బ కొట్టెసి మార్చే తల్లిలేక..
 
ఎట్టాపడితేను అట్టా బతికినానే.. ఇప్పుడు ఇట్టా వస్తే తలుపు మూయబోకే..     
 దునియాతో నాకేంటమ్మా.. నీతో ఉంటే చాలమ్మా..!
 ‘నాన్న నన్ను సరిగ్గా పెంచకపోవడంతోనే చెడ్డదారుల్లో ప్రయాణించాను. చెంపదెబ్బ కొట్టి నన్ను మార్చే తల్లి లేదు. ఎలా పడితే అలా బతికాను’ అంటూ ఆ కొడుకు ఆవేదన వ్యక్తం చేస్తాడు. బిడ్డ తప్పుడు దారిలో ప్రయాణిస్తే.. తల్లి మనసు విలవిల లాడుతుందనే కదా అర్థం. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలపై శ్రద్ధ పెట్టడం కొందరు తల్లిదండ్రులకు కుదరడం లేదు. అందువల్ల పిల్లలకు సరైన గెడైన్స్ దొరకడం లేదు. ఆ గెడైన్స్ ఉంటే చెడ్డదారుల్లో వెళ్లే పిల్లల జీవితాలు మంచి మలుపు తీసుకుంటాయి. మంచి మనిషిగా విజయం సాధిస్తారు.
 
నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండే అద్భుతమైన పాట ఇది.
  ‘చాలా మంచి పాట చేశావ్ రా’ అని మా అమ్మానాన్నలు పాట విన్న ప్రతిసారీ చెప్తుంటారు. ప్రేక్షకులు, పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించారు. ఇటువంటి పాట చేసే సందర్భం కల్పించిన పూరిగారికి, పాట రాసిన సుద్దాల అశోక్ తేజగారికి హ్యాట్సాఫ్.
 సేకరణ: సత్య పులగం
 
సుద్దాల అశోక్ తేజ, గీత రచయిత
సునీల్ కశ్యప్, మ్యూజిక్ డెరైక్టర్

Advertisement
Advertisement