మావాడు తిననే తినడు... | Sakshi
Sakshi News home page

మావాడు తిననే తినడు...

Published Thu, May 28 2015 11:07 PM

మావాడు తిననే తినడు...

చిన్నపిల్లలు అంటే పాలు తాగే పిల్లల దగ్గర్నుంచి పదీ, పన్నెండేళ్ల పిల్లల వరకూ వస్తారు. చంటిపిల్లలు పాలు తాగేసి, మళ్లీ కక్కినా పెద్దలు అంతగా బాధపడరు. ఎందుకంటే పిల్లలు అలా పాలు కక్కడం సాధారణమేననీ, ఇది మరీ అదేపనిగా జరుగుతుంటే ఆందోళన పడాలని అనుభవజ్ఞానంతో వారు చెబుతుంటారు. కానీ ఘనాహారం తీసుకుంటూ అది జీర్ణం కాకపోతేనే సమస్య. అయితే చాలామంది పిల్లల తల్లిదండ్రులది ఒకటే ఫిర్యాదు. అది... వాళ్ల చిన్నారి సరిగా ఆహారం తీసుకోడనీ, చాలా అరకొరగా తింటుంటాడని. ఈ నేపథ్యంలో ‘పిల్లలకు జీర్ణ సమస్య’ అనేది ఒకింత సంక్లిష్టమైన అంశం. అందుకే పిల్లల్లో ఆహారం జీర్ణం కాకపోతే వచ్చే సమస్యలూ, వాటి నివారణ అంశాలను తెలుసుకుందాం.

 
పిల్లల్లో ఆహారం జీర్ణం కాకపోవడం, తిన్న తర్వాత ఆహారం పైకి తన్నడం వంటి లక్షణాలు పెద్దలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే కొందరు పిల్లల్లోనూ పెద్దలలో కనిపించేలాంటి అజీర్తి సమస్యలు కనిపిస్తుంటాయి. దీని వల్ల పిల్లలూ బాధపడుతుంటారు. పెద్దల్లో కనిపించే గ్యాస్ పైకి తన్నడం, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, ఒక్కోసారి జీర్ణం కాని ఆహారం మెతుకులు గొంతులోకి రావడం వంటి సమస్యను ‘జీఈఆర్‌డీ’ (గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్)గా పేర్కొంటారు. ఇదే సమస్యతో పిల్లలకూ, పెద్దలకూ ఒకేలాంటి లక్షణాలు కనిపిస్తున్నా పిల్లలలో వైద్యచికిత్స విషయంలోనూ లేదా ఈ సమస్యను అధిగమించడానికి అనుసరించాల్సిన ప్రక్రియలోనూ తేడా ఉంటుంది.
 
పిల్లలలో అజీర్తికి కారణాలు

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు సరిగా తినడం లేదనీ, అవసరమైన మేరకు ఆహారం తీసుకోవడం లేదనే అపోహతో వారి పొట్ట సామర్థ్యానికి మించి ఆహారాన్ని బలవంతంగా కూరుతుంటారు. దాంతో వారి పొట్టలలో ఖాళీ స్థలమే లేకుండా పోతుంది. ఇది పిల్లల్లో అజీర్తికి ఒక కారణమవుతుంది.

రాత్రి వేళల్లో పిల్లలు ఆడీ ఆడీ అలసిపోయి వచ్చాక అన్నం తినిపిస్తారు తల్లిదండ్రులు. అంతగా అలసిపోవడంతో పిల్లలు తిన్న వెంటనే పడుకోవడం వల్ల కూడా తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం కాదు. దాంతో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయానికి పిల్లలు తగినంత ఆహారం తీసుకోలేరు. ఫలితంగా పిల్లలు సరిగా అన్నం తినడం లేదంటూ మళ్లీ తల్లిదండ్రుల ఫిర్యాదులు మొదలైపోతాయి.
     
ఎలాంటి ఆహారాన్నైనా జీర్ణం చేసుకోగల సామర్థ్యం సాధారణంగా పిల్లలకు ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని తల్లిదండ్రులు అవసరానికి మించిన కొవ్వుపదార్థాలు, తీపిపదార్థాల్ని వాళ్లకు పెట్టడం వల్ల అజీర్తి సమస్యతో పాటు, పిల్లల్లో స్థూలకాయానికీ ఇది కారణం కావచ్చు.
ఇక కొన్నిసార్లు పిల్లలకు ఏదైనా చిరుతిండ్లుగానీ, జంక్‌ఫుడ్ గానీ పెట్టాక అసలు భోజనం పెడతారు. అప్పుడు కూడా పిల్లల్లో అజీర్తి సమస్య ఎదురయ్యే అవకాశాలుంటాయి.

 పిల్లల అజీర్తి సమస్యల లక్షణాలు
 
పిల్లలలో అజీర్తి సమస్యలు ఎదురైనప్పుడు... పక్కమీదికి ఒరగగానే వారికి  వాంతులు కావడంతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. అవి...
 
బరువు తగ్గడం  అన్నం తినడానికి గట్టిగా నిరాకరిస్తూ ఉండటం  ఆహారం తిన్న తర్వాత తీవ్రంగా దగ్గు రావడం  గొంతుల నుంచి పిల్లికూతలు రావడం  వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల్లో కాస్తంత భిన్నంగా కనిపించే ఈ అజీర్తి లక్షణాలను గుర్తించినప్పుడు వారికి కొన్ని పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.

 పిల్లలకు చికిత్స పద్ధతులు...

 సాధారణంగా పిల్లల్లో అజీర్తి సమస్యను గమనించినప్పుడు కొందరు డాక్టర్లు వారికి సంప్రదాయ చికిత్స ప్రక్రియ అయిన ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ (పీపీఐ) మందులను రాస్తూ ఉంటారు. పెద్దలకూ, పిల్లలకూ ఒకేలా చికిత్స చేస్తుంటారు. కానీ పిల్లలకు సంప్రదాయ చికిత్సకు బదులుగా వారికి అవసరమైన చికిత్స చేయాల్సి ఉంటుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రీషియన్స్ పేర్కొంటోంది. పిల్లల విషయంలో పెద్ద పెద్ద చికిత్సలకు బదులు చిన్న చిన్న సూచనల ద్వారానే సమస్యలను దూరం చేయవచ్చని తెలియజేస్తోంది. ఆ జాగ్రత్తలివే...
     
కాస్తంత పెద్ద పిల్లల విషయానికి వస్తే... వారు కెఫీన్ పాళ్లు ఎక్కువగా ఉండే చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్ వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోకుండా చూడాలి.మసాలాలతో కూడిన ఆహారాలను ఎక్కువగా తీసుకోకుండా చూడాలి. పిల్లలు అధిక మోతాదులో చక్కెర తినకుండా చూడాలి. దానిలో భాగంగా వాళ్లకు ఏదో ఒకటి నములుతూ ఉండే అలవాటు ఉంటే... చక్కెర లేని చ్యూయింగ్ గమ్ నమిలేలా జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలకు అనేక రకాల పోషకాలు అందేలా చూడాలి. కాయగూరలు, ఆకుకూరలనే రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండేలా  అనేక రూపాల్లో (వేర్వేరు రెసిపీలుగా) వండి తినిపిస్తూ ఉండాలి. ఒకేరకమైన ఆహారం తినడాన్ని పిల్లలు అంతగా ఇష్టపడరు కాబట్టి... పోషకాలు పుష్కలంగా ఉండే అవే పదార్థాలను వేర్వేరు రీతుల్లో వండటం వల్ల పిల్లలు ఆసక్తికరంగా తింటారు. వాళ్లకు ఆరోగ్యమూ సమకూరుతుంది. అంతేగానీ పిల్లలకు పెద్దల రీతిలో పీపీఐ మందులు వాడటం, వాటితోనూ గుణం కనిపించకపోతే పెద్దలకోసం వాడే ప్రక్రియలను ఉపయోగించడం సరికాదు.పిల్లలకు ఒక పట్టాన ఆహారం జీర్ణం కాని పరిస్థితులు అదే పనిగా చాలా కాలం కొనసాగితే తప్పనిసరిగా డాక్టర్‌కు చూపించాలి.
 
పిల్లలకు అందుబాటులో చాక్లెట్లు, క్యాండీలు, జంక్‌ఫుడ్స్‌కు బదులుగా బాదంపప్పు, వాల్‌నట్స్ వంటి పోషకాహారాలు అందేలా ఉంచండి{ఫిజ్‌లో కోలా డ్రింక్స్, కూల్‌డ్రింక్స్ వంటి వాటికి బదులు మజ్జిగ, మిల్క్ షేక్స్ వంటి ఆరోగ్యకరమైన ద్రవాహారాలను పిల్లలకు అందుబాటులో ఉంచండి.
 
డాక్టర్ సేతుబాబు
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ - హెపటాలజిస్ట్
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
 
 

Advertisement
Advertisement