ఐవీఆర్‌ఎస్..అంతా గ్యాస్ | Sakshi
Sakshi News home page

ఐవీఆర్‌ఎస్..అంతా గ్యాస్

Published Tue, Apr 22 2014 1:39 AM

ఐవీఆర్‌ఎస్..అంతా గ్యాస్ - Sakshi

వీరవాసరం, న్యూస్‌లైన్:టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన పార్టీలోని నాయకులు, కార్యకర్తలనే కాదు ప్రజల అభిప్రాయాలనూ కరివేపాకులా తీసిపారేశారు. అత్యాధునిక ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్)తో మీ నియోజకవర్గ అభ్యర్థిని మీరే నిర్ణయించుకోండంటూ హడావుడి చేసిన చంద్రబాబు.. సీట్ల కేటాయింపులో చివరికి తను అనుకున్నవారికే ఇచ్చారు. జిల్లా టీడీపీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. స్వయంగా టీడీపీ నేతలే అధినేత వైఖరిని తప్పుపడుతున్నారు.
 
 నియోజకవర్గాల్లోని ఓటర్లతో ఫోన్‌లో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకుని, ఎక్కువ మంది ఎవరి పేరు చెబితే వారికే టికెట్ ఇస్తామని డాంబికాలు పలికిన బాబు చివరకు ఎప్పటిలా తన రెండు నాల్కల ధోరణిలాగే సీట్లను కేటాయించాలని ఆ పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. జిల్లాలో ఐవీఆర్‌ఎస్ ద్వారా ఎవరిని ఎంపిక చేశారా అని పరిశీలిస్తే ఒక్కరు కూడా లేరట. మేం సూచించిన అభ్యర్థులకు కాకుండా పార్టీ పెద్దలు అనుకున్న వాళ్లకే టికెట్లు కేటాయించడం జరిగిందని వాపోతున్నారు. ఐవీఆర్‌ఎస్ విధానం అంటూ మాయమాటలు చెప్పి పార్టీ నాయకులను మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి  మొదట్లో మెంటే పార్థసారథి, పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), పోలిశెట్టి సత్యనారాయణ (దాస్)ల పేర్లను ఫోన్ల ద్వారా వినిపించారు. తర్వాత చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పులపర్తి రామాంజనేయులు పేర్లతో ఫోన్ రింగ్ మోగించారు. వీరిలో ఒకరి పేరు సూచించమని అడిగితే ఎక్కువ మంది మెంటే పార్థసారథి పేరు సూచించారు. ఆ తర్వాత పోలిశెట్టి దాస్ పేరును కార్యకర్తలు, ఓటర్లు సూచించారట. తీరా భీమవరం టీడీపీ అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులుకు కేటాయించడంతో తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. అధినేత తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణ(బాబ్జి), నిమ్మల రామానాయుడు పేర్లను ఐవీఆర్‌ఎస్ ద్వారా వినిపించగా అత్యధికంగా బాబ్జీ పేరును సూచించారట. చివరకు సీటు మాత్రం రామానాయుడుకు చంద్రబాబు కట్టబెట్టారు.
 
 నరసాపురంలో కోటిపల్లి సురేష్, చినిమిల్లి సత్యనారాయణ, భూపతి నరేష్‌ల పేర్లు వినిపించగా టికెట్ విషయానికి వచ్చేసరికి వారెవరినీ కాదని ఐవీఆర్‌ఎస్ జాబితాలో లేని బండారు మాధవనాయుడికి కట్టబెట్టడం విశేషం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ, ఈలి నాని, యర్రా నారాయణస్వామి కుమారుడు నవీన్ పేర్లను ఐవీఆర్‌ఎస్ ద్వారా వినిపించారు. తీరా ఈ సీటు బీజేపీకి కేటాయించారు. చింతలపూడి, కొవ్వూరు నియోజకవర్గాల్లో కూడా ఐవీఆర్‌ఎస్ జాబితాలో లేని వారికే సీట్లను కట్టబెట్టారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజలు, కార్యకర్తలు సూచించిన వారికి కాకుండా ఇతరులకు టికెట్లు ఇచ్చారు. ప్రజల నిర్ణయాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు కలరింగ్ ఇవ్వడానికే చంద్రబాబు ఐవీఆర్‌ఎస్‌ను తీసుకొచ్చారని, తన వర్గం మీడియాతో కావాల్సినంత ప్రచారం జరిపించుకున్న తర్వాత తన నిర్ణయాలనే ప్రజలపై రుద్దారని టీడీపీ నేతలు బాహాటంగా తెలుపుతున్నారు. ప్రజలను మభ్యపెట్టడంలో మా ‘బాబు’ ఎవరికీ అందరంటూ తమ్ముళ్లే విమర్శిస్తున్నారు.  
 

Advertisement
Advertisement