ఈ నేతలు తమకు తాము ఓటేసుకోలేరు | Sakshi
Sakshi News home page

ఈ నేతలు తమకు తాము ఓటేసుకోలేరు

Published Mon, Apr 21 2014 3:01 PM

ఈ నేతలు తమకు తాము ఓటేసుకోలేరు - Sakshi

వారంతా ఎంఎల్ ఏ, ఎంపీ అభ్యర్ధులు. కానీ తమకు తాము ఓటు వేసుకోలేరు. అంతే కాదు. వారి కుటుంబాలు కూడా వారికి ఓటేయవు. ఎందుకంటే వారి ఇళ్లు వారు పోటీ చేసే నియోజకవర్గాల్లో లేవు. ఈ వింత పరిస్థితి ఎక్కువగా హైదరాబాద్ రాజకీయవేత్తలకే ఎదురవుతోంది.


సికింద్రాబాద్ పార్లమెంటరీ స్ధానానికి పోటీ చేస్తున్న అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ఉండేది పురానాపూల్‌. కానీ పోటీ చేసేది మాత్రం సికింద్రాబాద్. ఆయన ఓటు చార్మినార్ నియోజకవర్గంలో ఉంది. అంటే అంజన్న, ఆయన కుటుంబం ఆయనకు ఓటు వేయలేవు. సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్న నటి జయసుధ ఉండేది శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి ప్రాంతం. ఆమె ఓటు కూడా శేరిలింగంపల్లిలోనే ఉంది. ఆమె పోటీ చేస్తోంది సికింద్రాబాద్ నుంచి.

పాతబస్తీ బాద్షా అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేసేది పాతబస్తీలో. కానీ ఉండేది మాత్రం కొత్తబస్తీలో.ఇక ఆల్‌ఇండియా మజ్లీస్‌ నుంచి పోటీ చేస్తున్న అసదుద్ధీన్‌ ఒవైసీ నివాసం హైదర్‌గూడ కావడంతో ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఉండేది బంజారా హిల్స్ లో. కానీ పోటీ చేస్తున్నది చంద్రాయణ గుట్ట నుంచి.

టిడిపి నుంచి సనత్ నగర్ అసెంబ్లీకి పోటీ చేస్తున్న మరో అభ్యర్ధి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ నివాసం సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో ఉంది. ఇక ఇదే సనత్ నగర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ గా పోటీ చేస్తు న్న మర్రిశశిధర్‌ రెడ్డి నివాసం లాలాగూడలో. అది సికింద్రాబాద్‌ నియోజక వర్గంలోకి వస్తుంది. కానీ తను పోటీ చేసేది మాత్రం సనత్‌ నగర్‌ నియోజక వర్గం. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈ పరిస్థితి ఉన్నా, హైదరాబాద్ లో మరీ ఎక్కువగా ఉండటం విశేషం.

 

అభ్యర్థి ఓటున్న చోటు పోటీ చేస్తున్న చోటు
అంజన్ కుమార్ యాదవ్ చార్మినార్ సికింద్రాబాద్
అసదుద్దీన్ ఒవైసీ ఖైరతాబాద్ హైదరాబాద్
తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ సనత్ నగర్
మర్రి శశిధర్ రెడ్డి లాలాగుడా సనత్ నగర్
అక్బరుద్దీన్ ఒవైసీ జూబ్లీ హిల్స్ చాంద్రాయణ గుట్ట
జయసుధ శేరిలింగంపల్లి సికింద్రాబాద్

 

Advertisement
Advertisement