అంతటా అసమ్మతి జ్వాలలు | Sakshi
Sakshi News home page

అంతటా అసమ్మతి జ్వాలలు

Published Thu, Apr 24 2014 3:27 AM

అంతటా అసమ్మతి జ్వాలలు - Sakshi

 చివరి ఆశలు నీరుగారాయి. ఆ రెండు నియోజక వర్గాల్లో రెబల్ అభ్యర్థులను ఎలాగైనా పోటీ నుంచి తప్పించాలని యత్నించిన జిల్లా టీడీపీ నేతలకు నిరాశే మిగిలింది. జయరాజ్‌కు పదవులు ఎరవేసేందుకు, కెంబూరి రామ్మోహనరావు వద్ద ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామాను రక్తికట్టించేందుకు తీవ్రంగా యత్నించా రు. ఆ యత్నాలు ఫలించకపోగా వారు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. పదవులను ఎరవేసి, కుటుంబ సభ్యులతో ఒత్తిడి పెంచాలని చూస్తే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించినట్టు తెలిసింది. కురుపాం, చీపురుపల్లి నియోజక వర్గాల్లో అసంతృప్తి బయటకు వ్యక్తం కాగా, మిగతా ఏడు నియోజకవర్గాల్లో  నాయకుల మధ్య విభేదాలు, టిక్కెట్ల కేటాయింపులో అసంతృప్తులు లోలోన రాజుకుంటూ అక్కడి టీడీపీ అభ్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీ జిల్లాలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొం టోంది. ఒకవైపు రెబల్స్, మరోవైపు అసంతృప్తి వాదులు వెరసి ఆ పార్టీ అల్లాడిపోతోంది. ప్రతికూల పరిణామాలతో జిల్లా వ్యాప్తంగా ఎదురీదుతోంది. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ గెలిచే ధీమా కన్పించడం లేదు. ప్రధాన ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ ప్రజాదరణతో ప్రచారంలో దూసుకుపోతుంటే సమస్యలతో టీడీపీ సతమతమవుతోంది. అసమ్మతి, అసంతృప్తి వాదులను బుజ్జగింపుకోవడానికే సమయమంతా సరిపోతోంది. ఇంత చేసినా ఫలితమొస్తుందంటే అదీ లేదు. ఎక్కడా చూసినా అసమ్మతి బుసకొడుతూనే ఉంది. చీపురుపల్లి, కురుపాంలో రెబల్స్ పోటీలోనే ఉన్నారు. 
 
 టీడీపీ ఆఫర్లను తిరస్కరించిన నిమ్మక
 టీడీపీ  రెబల్స్‌గా కురుపాం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన నిమ్మక జయరాజ్‌కు  ఆపార్టీ నేతలు ఆఫర్ చేసిన పదవులను, ఇతర ప్రయోజనాలను ఆయన నిర్ద్వందంగా తోసిపుచ్చారు.  20 ఏళ్లుగా పార్టీలో పనిచేసినప్పుడు ఇవ్వని ఎమ్మెల్సీ, నామినేటేడ్ పదవులు ఇప్పుడిచ్చేస్తారా? చంద్రబాబును ఇంకా నమ్మాలా? వాడుకుని వదిలేసిన, పార్టీలో విధేయుడిగా కొనసాగాలా? ఆ ఆఫర్లకు లొంగిపోయే తత్వమనుకుంటున్నారా? కార్యకర్తల మనోభావాల మేరకు నడిచిన నాయకుడిని అంటూ టీడీపీ నేతల ప్రయత్నాలను నిమ్మక జయరాజ్ తిప్పికొట్టారు. నామినేషన్ ఉపసంహరించుకునేది లేదని తెగేసి చెప్పేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో టీడీపీకి గట్టి దెబ్బ తగిలినట్టయింది. టీడీపీ కేడర్ అంతా దాదాపుగా జయరాజ్ వెంటే ఉండటంతో ఆ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఈ పరిణామాలతో వైఎస్సార్ సీపీ విజయం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు.
 
  బెడిసికొట్టిన ఫ్యామిలీ రాయబారం..
 చీపురుపల్లిలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహనరావును బుజ్జగించేందుకు టీడీపీ నాయకత్వం అనుసరించిన వ్యూహం బెడిసికొట్టింది. ఆయన్ను దారికి తెచ్చుకునేందుకు వారి ఫ్యామిలీ అంతటినీ రంగంలోకి దించి ఇంటికి పంపించినా ఫలితం లేకపోయింది. ఆయన మరింత ఆగ్రహావేశాలకు లోనయ్యారు. రాయబేరాలకు లొంగిపోయే మనిషిని కాదంటూ  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితిలో విరమించుకునేది లేదని, పోటీలో కొనసాగుతానని తెగేసి చెప్పడంతో రాయబేరానికి వెళ్లి ఫ్యామిలీ సభ్యులంతా  వెనుదిరిగారు. దీంతో చీపురుపల్లిలో టీడీపీకి తీవ్ర ప్రతికూలత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పార్టీ అభ్యర్థి మృణాళినికి స్థానికంగా పట్టులేకపోవడం, స్థానికేతర నేతగా వ్యతిరేకత రావడంతో పరిస్థితి అయోమయంగా తయారైంది. దీనికి తోడు మరో రెబల్ అభ్యర్థి త్రిమూర్తులరాజు తన నామినేషన్ ఉపసంహరించుకున్నా ఆయన అనుచరులు మాత్రం తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. అవమానాన్ని భరించలేక ఆ పార్టీని వదిలేసి వైఎస్సార్ సీపీలోకి చేరిపోతున్నారు.  
 
 పార్వతీపురం, ఎస్.కోటలలోలోపాయికారీ దెబ్బలు 
 పార్వతీపురంలో తాము సూచించిన వ్యక్తులకు టిక్కెట్ ఇవ్వలేదన్న అక్కసుతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ అనుచరులు ఉన్నారు. ఎర్రా అన్నపూర్ణ విధేయునిగా ఉన్న బొబ్బిలి చిరంజీవులకు టిక్కెట్ ఇవ్వడానికి జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల మాదిరిగానే దెబ్బకొట్టే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఎస్.కోటలో కూడా అదే పరిస్థితి చోటు చేసుకుంది.   లలితకుమారికి టిక్కెట్ ఇవ్వడంపై మరో వర్గం తీవ్రంగా మండిపడుతోంది. ఆమెను గెలిపిస్తే ఏకు మేకై కూర్చొంటారని ఆలోచనతో ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపుతామంటూ పరోక్షంగా వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గట్టిగా ఎదుర్కోలేకపోతున్నారు. 
 
 గజపతినగరంలో టీడీపీకి గట్టి దెబ్బే
 గజపతినగరంలో కూడా టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. తనకు టిక్కెట్ ఇవ్వలేదు సరికదా అడుగడుగునా అవమానానికి గురి చేశారన్న ఆవేదనతో పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పడాల అరుణ ప్రభావం ఆ పార్టీపై తీవ్రంగా పడింది. ఆమె అనుచరులంతా ఇప్పుడు   వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్నారు. టీడీపీ అభ్యర్థి కొండపల్లి అప్పలనాయుడికి అనుకూలంగా ఎట్టి పరిస్థితుల్లో పనిచేసేది లేదని అరుణ వర్గీయులు తెగేసి చెప్పేస్తున్నారు. ఇక్కడ ఉన్న మరో నేత కరణం శివరామకృష్ణ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈయన ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. ఆ పార్టీ అభ్యర్థి అప్పలనాయుడికి ముఖం చాటేశారు. దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ పరిణామాలతో ఆ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా తయారైంది. పోటీలో ప్రభావం చూపించలేకపోతోంది. 
 
 విజయనగరం, సాలూరులలో అభ్యర్థులపై వ్యతిరేకత
 విజయనగరం, సాలూరు అసెంబ్లీ అభ్యర్థులైన మీసాల గీత, ఆర్.పి.భంజ్‌దేవ్‌పై ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేసిన వారికి కాకుండా కొత్తగా వచ్చిన నేతకు టిక్కెట్ ఇవ్వడమేంటన్న ఆవేదనతో విజయనగరం నాయకులు ఉండగా, గత ఐదేళ్లుగా పనిచేసిన నేతను పక్కన పెట్టి, కుల వివాదం నుంచి బయటపడ్డ నాయకుడికి టిక్కెట్ ఇచ్చేస్తే ఎలా పనిచేయగలమని సాలూరు నాయకులు అసమ్మతి రాగాన్ని ఆలపిస్తున్నారు. బయటకు పార్టీ కోసం పనిచేస్తున్నట్టు నటిసూ, అంతర్గతంగా పనులు చక్కబెడుతున్నారు. లోపాయికారిగా ఏం చేసినా అడ్డు ఉండదని, బయట ఉండి పనిచేయకపోతే ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనన్న ఉద్దేశంతో ‘గుంపులో గోవిందం’ పాత్రను పోషిస్తున్నారు. దీంతో ఆ పార్టీ నేతలకే ఫలితమెలా ఉంటుందో క్లారిటీ వచ్చేసింది. ఇక, నెల్లిమర్ల, బొబ్బిలి నియోజకవర్గాల్లో అసంతృప్తి వాదులు చాపకింద నీరులా పనిచేస్తున్నారు. 
 
 

Advertisement
Advertisement