ఐఐటీల్లో ఫీజుల భారం.. ఉపశమన మార్గాలివిగో!! | Sakshi
Sakshi News home page

ఐఐటీల్లో ఫీజుల భారం.. ఉపశమన మార్గాలివిగో!!

Published Thu, May 26 2016 12:54 AM

ఐఐటీల్లో ఫీజుల భారం.. ఉపశమన మార్గాలివిగో!!

ఇంజనీరింగ్ స్పెషల్
ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ ముగిసింది.. త్వరలోనే ఫలితాలు.. ఆ తర్వాత అడ్మిషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. మరోవైపు విద్యార్థులు, తల్లిదండ్రులను కలవరపరుస్తున్న అంశం.. ఐఐటీల్లో ఫీజుల పెంపు! ఐఐటీల్లో బీటెక్ ఫీజులు రెట్టింపు చేస్తూ గత నెలలో కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయం తీసుకుంది. గతేడాది వరకు రూ.90 వేలుగా ఉన్న వార్షిక ఫీజును రూ.రెండు లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఐఐటీల్లో ఫీజుల భారం నుంచి ఉపశమనం పొందేలా విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఆర్థిక ప్రోత్సాహకాలపై విశ్లేషణ...

 
స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఐఐటీ కౌన్సిల్ సిఫార్సుల మేరకు గత నెలలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఐఐటీల్లో బీటెక్ ఫీజులను రూ.90 వేల నుంచి రూ. రెండు లక్షలకు పెంచింది. వాస్తవానికి ఫీజును రూ. మూడు లక్షలకు పెంచాలని కమిటీ సిఫార్సు చేసినా.. రూ. రెండు లక్షలకు పెంచడం మధ్యతరగతి వర్గాలకు కాస్తలో కాస్త ఊరట.
 
ఫీజుల పెంపునకు కారణాలు
ఐఐటీల్లో ఫీజుల పెంపు ప్రతిపాదనపై గతేడాది కాలంగా కసరత్తు జరుగుతోంది. ఐఐటీ -చెన్నై, కాన్పూర్, ఢిల్లీ, హైదరాబాద్ డెరైక్టర్ల నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఐఐటీ కౌన్సిల్ ఫీజుల పెంపుపై పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. రూ.3లక్షలకు పెంచాలని సిఫార్సు చేసింది. ఐఐటీలు ఏటా ఒక్కో విద్యార్థిపై వెచ్చిస్తున్న వ్యయాన్ని, ఇతర నిర్వహణ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఫీజులు పెంచినట్లు కేంద్ర హెచ్‌ఆర్‌డీ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఫీజుల పెంపుపై విద్యార్థులు ఆందోళన చెందక్కర్లేదని, ఐఐటీ చదువులు ఆర్థిక భారమనే ఒత్తిడికి లోనవనక్కర్లేదని కేంద్రం పేర్కొనడం విశేషం.
 
70 శాతం మందికి మినహాయింపు!
* ఎస్‌సీ, ఎస్టీలు, అంగవైకల్యం ఉన్నవారికి ఫీజు నుంచి పూర్తి రాయితీ.
* కుటుంబ వార్షికాదాయం రూ. లక్షలోపు ఉన్న విద్యార్థులకు వారి సామాజికవర్గంతో నిమిత్తం లేకుండా పూర్తి ఫీజు రాయితీ సౌకర్యం కల్పిస్తారు.
* కుటుంబ వార్షికాదాయం రూ. 5 లక్షలలోపు ఉంటే ఫీజులో మూడింట రెండొంతుల మేరకు (66 శాతం) మినహాయింపు ఉంటుంది.
* ఇలా పలు విధానాలను పరిశీలిస్తే దాదాపు 70 శాతం మందికి ఫీజు నుంచి పూర్తి స్థాయిలో మినహాయింపు లేదా రాయితీ లభిస్తుంది.
 
విద్యాలక్ష్మి పథకం
ఫీజుల భారం నేరుగా భరించే విద్యార్థుల కోసం తాజా ప్రతిపాదన విద్యాలక్ష్మి   పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం. దీని ద్వారా ఐఐటీల్లో ప్రవేశం ఖరారై ఇన్‌స్టిట్యూట్‌లో అడుగుపెట్టిన రోజే వడ్డీ రహిత స్కాలర్‌షిప్ అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అదేవిధంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో చర్చించి బ్యాంకుల సహకారంతో తక్కువ వడ్డీకి రుణాలు సైతం అందించేందుకు చర్యలు చేపడుతోంది.
 
రీసెర్చ్, టీచింగ్ అసిస్టెన్స్‌షిప్
ఐఐటీల్లో బీటెక్ కోర్సులు చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూతనిచ్చేవి.. రీసెర్చ్ అసిస్టెన్స్‌షిప్, టీచింగ్ అసిస్టెన్స్‌షిప్. ఈ రెండింటి ద్వారా విద్యార్థులు అప్పటికే సదరు ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చ్ చేస్తున్న వారికి సహాయకులుగా వ్యవహరిస్తూ అటు అకడమిక్ నైపుణ్యాలు పెంచుకోవడంతోపాటు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు రీసెర్చ్, టీచింగ్ అసిస్టెన్స్‌షిప్ అందుకోవచ్చు.
 
కేంద్ర ప్రభుత్వ పథకాలు
ఐఐటీల్లో బీటెక్ విద్యార్థులకు దాదాపు 23 స్కాలర్‌షిప్ పథకాలు వేర్వేరుగా అమలవుతున్నాయి. వీటి కోసం విద్యార్థులు తమ అడ్మిషన్ ఆఫర్ లెటర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకోసం https://scholarships.gov.in చూడొచ్చు.
 
రెండు వేల కోట్లతో ప్రత్యేక ఎన్‌బీఎఫ్‌సీ

స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఐఐటీ కౌన్సిల్ రూ.రెండు వేల కోట్ల కార్పస్‌తో ప్రత్యేక ఎన్‌బీఎఫ్‌సీ(న్యాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్) వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. దీని ద్వారా ఐఐటీల్లో పరిశోధనలు, మౌలిక సదుపాయాలు, ఇతర నిర్వహణ వ్యయాలకు వడ్డీ రహిత రుణాలు అందించాలని సూచించింది. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని, కేబినెట్ ఆమోదం లాంఛనమేనని తెలుస్తోంది.
 
విదేశీ విద్యార్థులకు సైతం పెరిగిన ఫీజులు
ఐఐటీల్లో అడ్మిషన్ ఫర్ ఫారెన్ నేషనల్స్ పేరుతో మొత్తం సీట్లకు అదనంగా పది శాతానికి మించకుండా విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. వీరికి ప్రస్తుతం 4 వేల యూఎస్ డాలర్లుగా ఉన్న వార్షిక ఫీజును పది వేల డాలర్లకు పెంచారు.
 
ఇతర ఖర్చులకు సిద్ధంగా ఉండాలి
ఫీజుల విషయంలో రాయితీలు పొందే విద్యార్థులు ఇతర ఖర్చుల విషయంలో మాత్రం స్వయంగా వనరులు సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఇన్‌స్టిట్యూట్ లో ప్రవేశించే సమయంలో లైబ్రరీ ఫీజు, అడ్మిషన్ ఫీజు, వన్ టైం కాషన్ డిపాజిట్ వంటి వాటికోసం నగదును దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా హాస్టల్ అకామడేషన్ ఫీజు పరంగానూ సొంత నిధులు సమకూర్చుకోవాలి. ఈ ఇతర వ్యయాలు పరిగణనలోకి తీసుకుంటే ఐఐటీల్లో ప్రతి సెమిస్టర్‌కు విద్యార్థులకు అవుతున్న వ్యయం రూ. 30 వేల వరకు ఉంటోంది. ఆ మేరకు నగదు సిద్ధంగా ఉంచుకోవాలి.
 
స్వయం ప్రతిపత్తికి ప్రాధాన్యం
ఐఐటీల్లో ఫీజుల పెంపుపై విద్యార్థులు ఆందోళన చెందక్కర్లేదు. వీరికి ఎన్నో రకాల ఆర్థిక ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి. ఫీజుల పెంపునకు కారణం ఐఐటీలకు ఆర్థికంగా స్వయం ప్రతిపత్తి కల్పించడమే. అంతేకానీ విద్యార్థులపై భారం మోపడం ఉద్దేశం కాదు. పెంచే ఫీజుల వల్ల ఆయా ఐఐటీల్లో నిర్వహణ వ్యయం లభిస్తుంది. తద్వారా పలు అనవసర జాప్యాలను నివారించొచ్చు.
- ప్రొఫెసర్. కె.ఎన్. సత్యనారాయణ, ఐఐటీ-తిరుపతి క్యాంపస్ ఇన్‌ఛార్జ్.

Advertisement
Advertisement