సిగ్గు, లజ్జ, దమ్మూ, ధైర్యం ఉంటే.. వారితో రాజీనామా చేయించు | Sakshi
Sakshi News home page

సిగ్గు, లజ్జ, దమ్మూ, ధైర్యం ఉంటే.. వారితో రాజీనామా చేయించు

Published Fri, Feb 26 2016 2:51 AM

సిగ్గు, లజ్జ, దమ్మూ, ధైర్యం ఉంటే.. వారితో రాజీనామా చేయించు - Sakshi

 రా.. ఎన్నికలకు వెళ్దాం.. ప్రజాతీర్పునే రెఫరెండంగా  స్వీకరిద్దాం: చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్
 
 సాక్షి ప్రతినిధి, కడప: ‘‘చంద్రబాబూ! మీకు సవాల్ విసురుతున్నా. మీకు సిగ్గూ లజ్జ, దమ్మూ ధైర్యం ఉంటే మీ పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి. మళ్లీ ఎన్నికలకు వెళ్దాం. ప్రజలు ఎవరికి ఓటేస్తారో దాన్నే రిఫరెండంగా తీసుకుందాం. చంద్రబాబు తీరును గమనిస్తే ఆయన మనిషేనా అనిపిస్తుంది. అలాంటి మనిషి రాక్షసుడిగా పుట్టాల్సిన మనిషి’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు రాజకీయ జీవితమంతా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమేనని ధ్వజమెత్తారు. ఆయనకు దొడ్డిదారి రాజకీయాలు అలవాటేనని మండిపడ్డారు. వైఎస్ జగన్ గురువారం వైఎస్సార్  జిల్లాలోని మైదుకూరు, బద్వేల్, కడప నియోజకవర్గాలల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బద్వే ల్, కడపలో మీడియాతో మాట్లాడారు. ఒకరి పునాదులను కదపడం అనేది ప్రజలు, దేవుడి చేతుల్లోనే ఉం టుందే తప్ప పెదబాబు, చినబాబు చేతుల్లో ఉండదని స్పష్టం చేశారు. జగన్ ఇంకా ఏం చెప్పారంటే..

 నీతిమాలిన రాజకీయాలా? సిగ్గుండాలి
 ‘‘కడపలో మా కార్పొరేటర్లను కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. 50 మంది కాార్పొరేటర్లలో టీడీపీ గెలిచింది 8 మాత్రమే. వైఎస్సార్‌సీపీ 42 సీట్లు గెలిచింది. జిల్లాకు చినబాబు వస్తున్నారని కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకోవడం కోసం ఎన్నో ప్రలోభాలు పెట్టినా.. చివరకు వెళ్లింది ముగ్గురే. నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు.. సిగ్గుండాలి.  ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ టికెట్‌పై గెలిచారు. ప్రజలు ఎవరికి ఓటేశారు. గెలిచినవారు ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారన్న జ్ఞానం కాస్తోకూస్తో ఉండాలి. ఇవాళ ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే చంద్రబాబు ప్రస్తుతం గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదు. రుణాలను మాఫీ చేస్తానన్నారు. చివరకు వడ్డీ కూడా మాఫీ కాలేదు. బాబు సీఎం అయితే బ్యాంకు లో ఉన్న బంగారం బయటకు వస్తుందన్నారు. ఇవాళ ఆ బంగారాన్ని వేలం వేస్తున్నారు. గతంలో  వడ్డీ లేని రుణాలు వచ్చేవి. చంద్రబాబు పుణ్యాన ఇప్పుడు రూ.2 వడ్డీ కట్టాల్సి వస్తోంది, చంద్రబాబు మోసగాడు అని డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు తిడుతున్నారు.  జాబు కావాలంటే బాబు రావాలి అన్నారు. జాబు ఇవ్వకుంటే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తావు బాబూ! అని రాష్ట్రంలో 1.75 కోట్ల కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి.  

 కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి
 చంద్రబాబు ముఖ్యమంత్రై 22 నెలలైపోయింది. ఇప్పటివరకు ఒక్క కొత్త ఇల్లు కట్టకపోగా, కనీసం పాత ఇళ్లకు కూడా బిల్లులు రావడం లేదు. చంద్రబాబు సీఎం కాకముందు కరెంటు బిల్లు రూ.200 వస్తే ఇవాళ రూ.600 వస్తోంది. నిత్యావసరాల ధరలు తారస్థాయికి చేరాయి. మున్సిపాలిటీల్లో పెరిగిన పన్నులను చెల్లించలేక జనం ధర్నాలు చేస్తున్నారు. ప్రతిచోటా జనం చంద్రబాబును తిడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల బాధలు వినిపించకూడదు, బయటకు కనిపించకూడదు అని వారి గొంతు నొక్కే కార్యక్రమం చేస్తున్నారు’’

 పార్టీ పెట్టినప్పుడు మేమిద్దరమే...
 చంద్రబాబుకు ఒక్కటే చెబుతున్నా. మళ్లీ పదవిలోకి రావాలంటే చిట్కా ఎదుటి పార్టీలోని ఎమ్మెల్యేలను లాక్కోవడం కాదు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడమే ఆ చిట్కా. దానికి కావాల్సింది ప్రజలకు మంచి చేయడం. మేము మొదట పార్టీ పెట్టినప్పుడు నేను, మా అమ్మ.. ఇద్దరమే. తర్వాత మా సంఖ్య 18కి పెరిగింది. అనంతరం 67కు చేరింది. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటే ఎవరిని నిలబెట్టినా వారు ఓటేస్తారని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. అసలు వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడం ఏమిటి? తీసుకున్న వారితో రాజీనామా చేయించరట! అనర్హులను చేయరట! చంద్రబాబు ఒక పథకం ప్రకారం సాగిస్తున్నాడు. దానికి కొన్ని టీవీ చానళ్లు సైతం వంతపాడుతున్నాయి. మీడియా రాయడం, మా వాళ్లంతా ఖండన ఇవ్వడం. ఇలా ఎన్నిరోజులండీ. ఖండన ఇచ్చినా అదే పద్ధతి. ఒకరోజు గమ్మునుంటారు, రెండు రోజులు గమ్మునుంటారు. మూడో రోజు మళ్లీ మొదలు. ఏమిటిదీ?

 బాబును ప్రశ్నించరేం?
 ముఖ్యమంత్రికి నిజంగా ఎమ్మెల్యేలందరినీ లాక్కొనే సామర్థ్యం, సత్తా ఉంటే ఇప్పటిదాకా ఐదుగురితో ఎందుకు ఆగారు? ఎప్పుడో అయిపోయేది. చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. చంద్రబాబు చేస్తున్న అనైతిక పనులకు మీడియా మద్దతు ఇవ్వడం ఎంతవరకు ధర్మం? మీ మనస్సాక్షిని మీరు అడగండి. మీరు రాయడం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఫోన్లు రావడం. వాళ్లు ఏం పాపం చేశారు. ఎమ్మెల్యేలు నిజంగా వెళ్తే.. వెళ్లినప్పుడు రాయండి. వెళ్లకముందే బండలేయడం భావ్యమా? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చంద్రబాబు ను మీడియా ఎందుకు అడగడం లేదు? బ్లాక్‌మనీ ఎక్కడి నుంచి వచ్చిందని ఎందుకు ప్రశ్నించడం లే దు? తెలంగాణలో బ్లాక్‌మనీతో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ దొరికిపోయారు. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఏపీలో ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయి. పోలవరం, పట్టిసీమ, గాలేరు-నగరి, ఇసుక, మద్యం, జెన్‌కో, పుష్కరాలు, తాత్కాలిక నిర్మాణాలు.. ఇలా అన్నింటిలో స్కామ్‌లు చోటుచేసుకుంటున్నాయి. రాజధానిలో టీడీపీ వాళ్ల  భూములను తీసుకోవడం లేదు. రైతుల భూములనే లాక్కుం టున్నారు. ఎస్సీ, ఎస్టీల భూములను కూడా వదలడం లేదు. ఆ స్కామ్‌ల్లో సంపాదించిన డబ్బుతో రూ.30 కోట్లు ఇచ్చి నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలను కొనేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న సిగ్గుమాలిన పనులను ఎందుకు తప్పుపట్టడం లేదు? ఇది బాబుకు ప్రజల తో జరుగుతున్న పోరాటం. ప్రజల గొంతును చంద్రబాబు నొక్కలేరు. దేవుడు దీవిస్తాడు, ప్రజలు ఆశీర్వదిస్తారు. నియోజకవర్గాల్లో ఎవరు వెళ్లినా అక్కడ వారి కంటే మంచి నాయకుడిని తయారు చేసుకుంటాం.

 బంగాళాఖాతంలోకే..
 ఉంగరం లేదు, వాచీ లేదు, జేబులో డబ్బు లేదు అంటాడు. అలాంటప్పుడు ఒక్కో ఎమ్మెల్యేను కొనడానికి రూ.30 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదంతా అందరికీ తెలుస్తూనే ఉంది. అయినా ఏం చేస్తున్నాం? చంద్రబాబును ప్రశ్నించడం లేదు.  తన ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందన్న నమ్మకం చంద్రబాబుకు ఉంటే ఎన్నికలకు వెళ్లేవాడు. ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు కాబట్టే.. లాక్కున్న ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి చంద్రబాబుది. ప్రజలు ఓటేస్తారో లేదోననే భయంతో ఆయన వెనుకాడుతున్నారు. రిగ్గింగ్, డబ్బు, పోలీసుల సాయంతో రాజకీయాలు చేయలేం. ప్రజలు ఒక్కసారి తిరగబడితే చంద్రబాబు బంగాళాఖాతంలో కలవడం ఖాయం.

 ఆ ఎమ్మెల్యేలు క్యూ కడతారు
 ప్రజలు నాకు భరోసా ఇస్తున్నారు. నీతోనే ఉంటాం అంటున్నారు. నేను ఏనాడూ దొడ్డిదారిన ముఖ్యమంత్రి పదవో, మరొకటో చేపట్టాలనుకోలేదు. మేము నిఖార్సయిన, నీతితో కూడిన రాజకీయాలు చేస్తున్నాం. ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యాయి. మూడో సంవత్సరంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మావైపు క్యూ కడతారు. క్యూ కట్టినప్పుడు వాళ్ల మద్దతు తీసుకొని నేను ముఖ్యమంత్రి కాను. వాళ్ల మద్దతుతో ప్రభుత్వాన్ని పడగొట్టి ఎన్నికలకు వెళ్తాను. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిగా వస్తాను తప్ప చంద్రబాబు మాదిరిగా దొడ్డిదారిన కుర్చీలో కూర్చోను’’ అని జగన్ స్పష్టం చేశారు. జగన్ వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ గూడూరు రవి, ఎమ్మెల్యేలు అంజాద్‌బాషా, శ్రీనివాసులు, రఘురామిరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథరెడ్డి ఉన్నారు.
 
 సిగ్గులేకుండా నల్లధనంలో రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబుకు ఇంత డబ్బు ఎక్కడినుంచి వస్తోంది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు, రూ.30 కోట్ల చొప్పున ఆఫర్ చేస్తున్నారు. మంత్రి పదవులు ఎర చూపుతున్నారు. నాకు తప్ప మిగిలిన 66 మంది ఎమ్మెల్యేలకు రోజూ ఫోన్లు చేస్తున్నారు. పనీపాట లేనివాళ్లతో రోజూ మాట్లాడిస్తున్నారు. దానికితోడు పచ్చ చొక్కాలేసుకున్న టీవీ చానళ్లు.. వాళ్లు పోతున్నారు, వీళ్లు పోతున్నారు అని ప్రసారం చేస్తున్నాయి. ఇంతవరకు ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్లారండి. కేవలం ఐదుగురు. అది కూడా మంత్రి పదవుల కోసం, డబ్బు కోసం. అదేదో గొప్ప విషయంలా మాట్లాడుతున్నారు. ఇంతింత డబ్బు ఆఫర్ చేస్తున్నా అధికార పార్టీకి లొంగని 61 మంది ఎమ్మెల్యేలకు హ్యాట్సాఫ్ చెబుతున్నా. వారు ప్రలోభాలకు లొంగకుండా ప్రజల తరఫున నిలబడుతున్నారు.
ప్రజల పక్షాల పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
 
 పెద్దదర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
 కడపలోని అమీన్ పీర్ (పెద్ద దర్గా) దర్గా ఉర్సు సందర్భంగా జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పీరుల్లామాలిక్ మజార్ వద్ద, దర్గా ఆవరణలోని ఇతర గురువుల మజార్ల వద్ద ఫాతెహా నిర్వహించి ప్రసాదం స్వీకరించారు. పెద్దదర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా మహమ్మద్ మొహమ్మదుల్ ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆశీర్వాదం తీసుకున్నారు.

Advertisement
Advertisement