వీడని జంట హత్యల మిస్టరీ
వీడని జంట హత్యల మిస్టరీ
Published Wed, May 10 2017 10:29 PM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM
- అనుమానితుల పేర్లు వెల్లడికి పోలీసుల నిరాకరణ
శిరివెళ్ల: గోవిందపల్లెలో జంట హత్యల కేసు మిస్టరీ ఛేదన పోలీసులకు కత్తిమీద సాము మాదిరిగా మారింది. మాజీ ఎంపీపీ ఇందూరి ప్రభాకరరెడ్డి, అతని బావమరిది మేర్వ శ్రీనివాసులరెడ్డి హత్యలో పది మంది అనుమానితులపై కేసు నమోదు చేశారు. అయితే అందులో గ్రామానికి చెందిన ఆరుగురు టీడీపీకి అనుకూలురుగా ఉండడం కాక హతులకు బంధువులు. అయితే అధికారికంగా పోలీసులు వివరాలు వెల్లడించడం లేదు. గ్రామస్తుల సహకారం లేకుండా హత్యలు జరగవని, అంతేగాక కిరాయి హంతకుల పాత్ర కూడ ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యలు జరిగిన మరుక్షణమే అన్ని నిఘా విభాగాలు రంగంలోకి దిగాయి. అయినా ఇంత వరకు కేసులో పురోగతి కనిపించలేదు. హత్యలు జరిగిన రెండో రోజు నుంచి అనుమానితుల ఇళ్లలో సోదాలు జరిగినట్లు సమాచారం.
హత్యకు ఉపయోగించిన మారణాయుధాలు వెంట తీసుకెళ్లారా.. లేక ఎక్కడైన పారి వేశారా.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం హత్య ఘటనా స్థలాన్ని దగ్గరగా ఉన్న ఓ బావిలో నీటిని బయటకు తీశారు. కాని ఆయుధాలు సమాచారం లభించ లేదు. పోలీసుజాగిలం బావి వద్ద కొద్ది సేపు ఆగి తిరిగి జాతీయ రహదారి వద్దకు పోయింది. అంతే దుండగులు హత్య అనంతరం నడుచుకుంటూ రోడ్డుపైకి వెళ్లినటు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండంగా మాజీ ఎంపీపీ ఫోన్‌కు వచ్చిన కాల్స్‌పై ఆరా తీస్తున్నట్లు సమాచారం. హత్య జరిగిన ప్రదేశానికి సమీపంలో మందుబాటిళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. హత్యలో ఓ యువకుని పాత్రపై స్పెషల్‌బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. హత్యకు గల కారణాలు అనేకంగా వినిపిస్తుండంతో సమగ్ర విచారణ చేస్తున్నారు.
Advertisement