అమ్మకానికే ప్రా‘ధాన్యం’! | Sakshi
Sakshi News home page

అమ్మకానికే ప్రా‘ధాన్యం’!

Published Wed, Aug 24 2016 10:38 PM

గోదాములకు తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యం

ఇతర జిల్లాలకు ధాన్యం తరలించేస్తున్న మిల్లర్లు
సేకరించిన ధాన్యానికి సరిపడా బియ్యం ఇవ్వని వైనం
ఈ ఏడాది ఇంకా ఇవ్వాల్సిన బియ్యం 7,200 మెట్రిక్‌ టన్నులు
పీడీఎస్‌ బియ్యాన్నే రీసైక్లింగ్‌ చేసి పౌర సరఫరాలకు అప్పగింత
మిల్లుల్లో కానరాని 10,500 మెట్రిక్‌ టన్నుల ధాన్యం
 
 
విజయనగరం కంటోన్మెంట్‌:  జిల్లాలో మిల్లర్లు అటు రైతులకు... ఇటు అధికారులకు నిలువునా దగా చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్ననుంచి కొనుగోలు చేసి... ఎంచక్కా కొన్నాళ్లు నిల్వ చేసుకుని ఆనక అధిక ధరకు ఇతర ప్రాంతాలకు తరలించేసి అమ్ముకుంటున్నారు. సర్కారుకు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన బియ్యాన్ని పీడీఎస్‌ నుంచే దొంగచాటుగా కొని రీసైక్లింగ్‌ చేసి అప్పగిస్తున్నారు. తక్కువ ధరకు డీలర్ల నుంచి కొనుగోలు చేసి వాటిని రెండు రెట్ల ధరకు తిరిగి సర్కారుకే అంటగడుతున్నారు. ఇవన్నీ తెలిసినా అధికారులు చర్యలు తీసుకునేందుకు ఎందుకో వెనుకాడుతున్నారు. పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం మిల్లర్లకు రాజమార్గం ద్వారా తరలిపోతోంది. ఇది జిల్లాలోని ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ బియ్యం రీసైక్లింగ్‌ చేసి మళ్లీ ప్రజాపంపిణీకే మిల్లర్లు అంటగడుతున్నారు. పల్లెల్లో కొందరు వ్యాపారులు దీనినే ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. అక్కడక్కడా వస్తున్న ఫిర్యాదుల మేరకు అధికారులు వాటిని పట్టుకుంటున్నా... కొద్ది మొత్తంలో జేసీ కోర్టులో అపరాధ రుసుం చెల్లించి మళ్లీ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రైతులనుంచి సేకరించిన ధాన్యాన్ని మర ఆడించి సర్కారుకు ఇవ్వాల్సిన 67శాతం బియ్యం స్థానంలో రీసైక్లింగ్‌ చేసిన పీడీఎస్‌ సరకునే అందిస్తూ లాభాలార్జిస్తున్నారు. సేకరించిన ధాన్యాన్ని మాత్రం ఇతర ప్రాంతాలకు తరలించేసి సొమ్ము చేసుకుంటున్నారు. 
పర్యవేక్షణకు అధికారులున్నా...
ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం పౌరసరఫరాల సంస్థ అధికారులు కొనుగోలు చేసిన ధాన్యానికి సరిపడా బియ్యం ఇవ్వడంలో మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీనిపై జిల్లా అధికారులు 126 మంది మిల్లర్లకు నోటీసులు ఇచ్చారు. పర్యవేక్షించమని అధికారుల బందాలను పంపించారు. అయినా మిల్లర్ల తీరులో మార్పు రావట్లేదు. జిల్లాలో గతేడాది 127 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రికార్డు స్థాయిలో 3,75,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఆ ధాన్యాన్ని జిల్లాలోని 126 మిల్లులకు అందజేశారు. మిల్లర్లు అందులో 67 శాతం బియ్యంగా మరాడించి పౌరసరఫరాల సంస్థకు ఇవ్వాల్సి ఉంది. మొదట్లో రోజుకు వందలకొద్దీ టన్నుల బియ్యం అందించిన మిల్లర్లు అటు తరువాత కొంతకాలం గోడౌన్లు ఖాళీలేవన్న సాకుతో బియ్యం అందించలేదు. ఇప్పుడు అధికారులు ఒత్తిడిచేస్తే దొంగచాటుగా కొనుగోలు చేసిన పీడీఎస్‌ బియ్యాన్నే రిసైక్లింగ్‌ చేసి అప్పగించేస్తున్నారు.
ఇంకా ఇవ్వాల్సిన బియ్యం 7,200 మెట్రిక్‌ టన్నులు
పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసి ఇచ్చిన ధాన్యానికి ఇంకా 7,200 మెట్రిక్‌ టన్నుల బియ్యం మిల్లులు చెల్లించాల్సి ఉంది. అంటే 10,500 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లుల్లో ఉండాలి. కానీ చాలా మిల్లుల్లో ఒక్క ధాన్యం గింజ కూడా లేదని తెలుస్తోంది. ఆ ధాన్యం కాస్తా ఇతర ప్రాంతాలకు అధిక ధరలకు అమ్ముకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల ద్వితీయార్ధానికి పదివేల మెట్రిక్‌ టన్నుల బియ్యం బాకీ ఉన్నారు. నోటీసులు ఇచ్చాక అన్ని మిల్లులూ కలిపి ఓ 2,500 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇచ్చారు. మళ్లీ కథ మామూలే.
వారం రోజులే గడువు! 
మిల్లర్లు ప్రభుత్వానికి మరో వారం రోజుల్లో నిర్దేశించిన బియ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ వారినుంచి ఎలాంటి స్పందన కనిపించడంలేదు. జిల్లాలో 2014–45 సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్‌ బియ్యాన్ని(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) కూడా ఇంకా ఇవ్వలేదని సిబ్బంది చెబుతున్నారు. జిల్లాలోని ఆరు మిల్లులు గత బియ్యం ఇవ్వకపోయినా వారికి 2015–16 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం అప్పగించారు. ఇప్పుడు రెండేళ్లకు సంబంధించిన బియ్యం బాకీ ఉన్నా అధికారులు చూసీ చూడనట్టే వ్యవహరిస్తున్నారు. నిత్యం పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతోందని ఎవరినడిగినా చెబుతారు. 
 
 
ప్రతి మిల్లరూ ఇవ్వాలి: జె.శాంతి కుమారి, జిల్లా పౌరసరఫరాల అధికారి, విజయనగరం
జిల్లాలోని 126 రైస్‌మిల్లులకు పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ధాన్యం ఇచ్చారు. దానికి సంబంధించి ఇంకా 7,200 మెట్రిక్‌ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. ఈ నెలాఖరుకు బియ్యం ఇవ్వాలని ఆదేశించాం. మొత్తం అన్ని మిల్లులూ ఎంతో కొంత బాకీ ఉన్నాయి. అందరికీ నోటీసులు ఇచ్చాం. అధికారుల బందాలను నియమించాం. ఈ నెలాఖరుకు బియ్యం ఇచ్చేస్తారనే అనుకుంటున్నాం. 
 
 

Advertisement
Advertisement