మీ పాపాన్నిమా రైతులెందుకు మోయాలి? | Sakshi
Sakshi News home page

మీ పాపాన్నిమా రైతులెందుకు మోయాలి?

Published Fri, Feb 12 2016 10:04 AM

మీ పాపాన్నిమా రైతులెందుకు మోయాలి? - Sakshi

  •  వాతావరణ కాలుష్యం అభివృద్ధి చెందిన దేశాల చలువే
  •  స్పష్టం చేసిన వ్యవసాయ రంగ నిపుణులు 
  •  ‘పర్యావరణ మార్పులు, ఆహార బాధ్యత- నైతిక ధోరణులు’పై  అంతర్జాతీయ సదస్సు
  • సాక్షి, హైదరాబాద్: ‘అభివృద్ధి చెందిన దేశాలు చేస్తున్న వాతావరణ కాలుష్యానికి పేద, వర్ధమాన దేశాల చిన్న, సన్నకారు, మధ్యతరహా రైతులు ఎందుకు బలికావాలి? పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నందుకు పారిశ్రామికాభివృద్ధి చెందిన దేశాలు భరాయించాల్సిన వ్యయాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల రైతులెందుకు మోయాలి. ఇది నైతికత కాదు. ప్రపంచం నుంచి ఆకలి బాధను తరిమికొట్టేందుకు 2030 వరకు ప్రతి ఏటా 105 బిలియన్ డాలర్ల మొత్తాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయంపై ఖర్చు పెడతామన్న మాటకు అభివృద్ధి చెందిన దేశాలు కట్టుబడాలి’ అని పలువురు వ్యవసాయ రంగ నిపుణులు స్పష్టం చేశారు. ‘పర్యావరణ మార్పులు, ఆహార భద్రత- నైతిక ధోరణులు’ అనే అంశంపై మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సు గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
     
    అగ్రి బయోటెక్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు యూరోప్, అమెరికా, ఆసియా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రారంభ కార్యక్రమంలో ప్రపంచ ఆహార అవార్డు గ్రహీత, సన్‌హాక్ శాంతి బహుమతి విజేత డాక్టర్ ఎంవీ గుప్తా, ప్రొఫెసర్ మత్తియాస్ కైసర్ (నార్వే), ప్రొఫెసర్ థియో వాన్ డీ శాండీ (నెదర్లాండ్స్), ప్రొఫెసర్ ఇ.హరిబాబు (హైదరాబాద్ యూనివర్శిటీ మాజీ వీసీ), ప్రొఫెసర్ జి.పక్కిరెడ్డి తదితరులు ప్రసంగించారు. ప్రపంచంలో ఆర్థిక అసమానతలు, ఆహార అలవాట్లు, ఆహార దుబారా, నైతికత, 2030 నాటికి ప్రపంచం నుంచి ఆకలి, దారిద్య్రాన్ని పారదోలడం వంటి అంశాలపై వక్తలు ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకుపోతున్నా ఆకలి, పేదరికమనే రెండు ప్రధాన సవాళ్లకు పరిష్కారం కనుగొనడంలో వెనుకబడి ఉందని ఎంవీ గుప్తా పేర్కొన్నారు. వీటికి పరిష్కారం కనుగొనకపోతే ప్రపంచం అశాంతిని, అంతర్యుద్ధాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. బహుళజాతి సంస్థలు తమ సామాజిక, కార్పొరేట్ బాధ్యతను విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
     
     ఓవైపు పేదరికం, మరో వైపు అధిక బరువు...
    సహజ వనరులను అవసరాలకు మించి వినియోగిస్తున్న తీరుతో ప్రపంచంలో అసమానతలు పెరిగాయని, ఫలితంగా కొందరు తిండికి అల్లాడుతుంటే మరోవైపు అధిక బరువు(ఒబేసిటీ)తో బాధ పడుతున్నారని నార్వేలో బెర్జన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాత్తియాస్ కైసర్ చెప్పారు. వాతావరణ మార్పులకు, ఆహార భద్రతకు పరస్పర సంబంధం ఉందని నెదర్లాండ్స్‌కు చెందిన థియో వాన్ డీ శాండీ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మెజారిటీ ప్రజలు మెట్ట వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారని, వాళ్లకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. శుక్ర, శనివారాల్లో కూడా సదస్సు కొనసాగుతుందని ప్రొఫెసర్ పక్కిరెడ్డి తెలిపారు. 

Advertisement
Advertisement