ప్రజాసమస్యలపై రాజీలేని పోరు: తమ్మినేని | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యలపై రాజీలేని పోరు: తమ్మినేని

Published Sun, Oct 23 2016 2:30 AM

ప్రజాసమస్యలపై రాజీలేని పోరు: తమ్మినేని - Sakshi

మంచాల/ఇబ్రహీంపట్నం: ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహాజన పాదయాత్ర శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పిన కేసీఆర్ నేడు ప్రజాసమస్యలపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. సామాజికవర్గాల అభివృద్ధిని పక్కన పెట్టి బడా పెట్టుబడిదారులు, ఉన్నతవర్గాల అభ్యున్నతి కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాల ఊసే లేదన్నారు. కొత్త, కొత్త హామీలు ఇవ్వడం తప్ప, ఇచ్చినవి అమలుపర్చడంలేదని ఎద్దేవా చేశారు. పేదలు కేసీఆర్ పాలనపై తీవ్రస్థారుులో విసుగెత్తిపోయారని తెలిపారు.

ప్రభుత్వ తీరును ప్రశ్నించేవారి గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. కమ్యూనిస్టులు కష్టజీవుల పక్షాన నిలబడేవారు, ఎవరికీ భయపడరనే విషయం తెలుసుకోవాలన్నారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం మహాజన పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘పల్లెల్లోకి వస్తే ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుస్తారుు. ఏసీ గదుల్లో కూర్చుంటే ఎలా తెలుస్తారుు?’’ అని వీరభద్రం అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్, పొల్కంపల్లిల్లో ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూం, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, దళితులకు మూడెకరాల భూమి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ‘‘ఇక్కడి ఆడబిడ్డల బతుకు పరిస్థితి ఏందో చెప్పమ్మా’’ అంటూ ఎంపీ కవితను వీరభద్రం ప్రశ్నించారు. బతుకమ్మ, బతుకమ్మ అంటూ కూతురు కవితను బతికించేందుకు కోట్ల రూపాయలను కేసీఆర్ కుమ్మరిస్తున్నారని మండిపడ్డారు.

 ‘కృష్ణా’పై కేంద్రం జోక్యానికి ఒత్తిడి తేవాలి
 సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వెంటనే స్పందించి రెండు రాష్ట్రాలకు సక్రమంగా కేటాయింపులు జరిగేలా కేంద్రం జోక్యానికి ఒత్తిడి తేవాలని సీపీఎం సూచించింది. దీనిపై వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

 రేషన్ కార్డుల సమస్య పరిష్కరించాలి
 రేషన్ కార్డుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌కు రాసిన లేఖలో తమ్మినేని కోరారు. తెల్ల రేషన్ కార్డులను తొలగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ జరిపి కార్డులు కోల్పోయిన అర్హులకు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement