టీడీపీ నేత ‘కందికుంట’కు ఏడేళ్ల జైలు | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత ‘కందికుంట’కు ఏడేళ్ల జైలు

Published Wed, Jun 1 2016 2:16 AM

టీడీపీ నేత ‘కందికుంట’కు ఏడేళ్ల జైలు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు బ్రాంచీని మోసం చేసి రూ.8.29 కోట్లు కొల్లగొట్టిన కేసులో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, బ్యాంకు ఉద్యోగి చెరుకు ఉదయ్‌ కుమార్‌లకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. బ్యాంకు మేనేజర్‌ మద్దూరు చెన్నారెడ్డి, మాజీమంత్రి ఎం.డి. షాకీర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. వెంకటప్రసాద్, ఉదయ్‌కుమార్‌లకు రూ.13 లక్షల చొప్పున, చెన్నారెడ్డికి రూ.3 లక్షలు, షాకీర్‌కు రూ.లక్ష జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది. తీర్పు అనంతరం పోలీసులు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.

ఎలా కొల్లగొట్టారంటే...
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు చెందిన 100 ఖాళీ డిమాండ్‌ డ్రాఫ్ట్‌(డీడీ)లను 1998లో మేనేజర్‌ చెన్నారెడ్డి దొంగలించి నిందితులతో కుమ్మక్కయ్యారు. పలువురి పేర్లతో రూ.500 చొప్పున డీడీలను తీశారు. ఈ డీడీ నంబర్‌ను తాము దొంగిలించిన ఖాళీ డీడీల్లో వేసి రూ.500 స్థలంలో రూ.9 లక్షలు వేసుకుని నగదు డ్రా చేసుకునేవారు. ఇలా రూ.8.29 కోట్లు కొల్లగొట్టారు. ఈ డబ్బుతో ఆస్తులు, బంగారం కొనుగోలు చేశారు. దీన్ని గుర్తించిన బ్యాంకు ఉన్నతాధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి చార్జిషీట్‌ దాఖలు చేసింది. కేసు విచారణలో ఉండగానే  నిందితులుగా ఉన్న దినేశ్‌ దయాల్‌దాస్‌ అనే వ్యక్తి చనిపోగా కుంచం భూపాల్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆరు, ఎనిమిదో నిందితులుగా ఉన్న కాసుల నరేంద్ర సునీల్‌కుమార్, ఉమేష్‌ జగన్నాథ్‌ అనోకర్‌లు పరారీలో ఉన్నారు.

Advertisement
Advertisement