ఒకే స్కూల్లో 28 జంటల కవలలు | Sakshi
Sakshi News home page

ఒకే స్కూల్లో 28 జంటల కవలలు

Published Fri, Apr 29 2016 8:08 PM

ఒకే స్కూల్లో 28 జంటల కవలలు - Sakshi

చిత్తూరు: ఎక్కడైనా కవల పిల్లలు పుట్టడమే అరుదు. పుట్టినా ఇరువురు అచ్చు గుద్దినట్లు ఒకే పోలికలతో ఉండడం మరీ అరుదు. అలాంటి అరుదైన కవలలు ఒకే పాఠశాలలో చదవడం మరీ మరీ అరుదు. అలాంటి అరుదైన అద్భుతాన్ని ఆవిష్కరించింది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులోని కామ్‌ఫర్డ్‌ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌. ఈ పాఠశాలలో ఏకంగా 28 కవల పిల్లల జంటలు చదువుతున్నారు. వారిలో పది బాలిక జంటలుకాగా, 12 బాలుర జంటలు. ఆరు జంటలు మాత్రం మిక్స్‌డ్‌ జెండర్‌ కలిగిన వాళ్లు.

మొత్తం 28 జంట కవలల్లో ఎక్కువ మంది కవలల మధ్య అచ్చుగుద్దిన పోలికలున్నాయి. కొన్ని జంటల్లో పోలికలు తక్కువగా ఉన్నాయి. పోలికలు గల జంటల్లో ఎవరు, ఎవరనే విషయాన్ని గుర్తించేందుకు టీచర్లు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. ఒకరనుకొని ఒకరికి హోంవర్క్‌ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న ఈ కవలల వయస్సు నాలుగేళ్ల నుంచి 16 ఏళ్ల వరకు ఉంటుందని స్కూల్‌ యాజమాన్యం మీడియాకు తెలిపింది. తమ పాఠశాలలో మొత్తం 1070 మంది విద్యార్థులు చదువుతుండగా, వారిలో 28 జంటలు, అంటే 56 మంది విద్యార్థినీ విద్యార్థులు కవలలు కావడం చెప్పలేనంత విశేషమని స్కూల్‌ యాజమాన్యం వ్యాఖ్యానించింది.

అందుకనే స్కూల్‌ యాజమాన్యం కవల పిల్లల కోసం స్కూల్లో ఇటీవల ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఓ వేడుకగా జరుపుకున్న ఈ కార్యక్రమానికి కవల పిల్లలంతా ఆకర్షణీయమైన ముదురు రంగు దుస్తులు ధరించి హాజరయ్యారు. ప్రతి కవల జంట ఒకే తీరు డ్రెస్సులతో వేడుకల్లో పాల్గొన్నారు. తాము కవల పిల్లలకు ఎలాంటి ప్రోత్సాహం కల్పించడం లేదని, ఇంత మంది కవల పిల్లలు తమ పాఠశాలలో చదవడం కేవలం యాదృచ్ఛికం మాత్రమేనని స్కూల్‌ యాజమాన్యం చెప్పింది. కొన్నేళ్ల క్రితం తాము మొదటి సారిగా 16 కవలల జంటలను గుర్తించామని, ఇప్పుడు వారి సంఖ్య 28 జంటల వరకు వెళ్లిందని తెలిపింది.

కవలల్లో అందరూ చిత్తూరు పట్టణానికి చెందినవారే కాకుండా పరిసర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇంగ్లీషు మీడియంలో తమ పిల్లలను చదివించాలనుకుంటున్న తల్లిదండ్రులందరూ ఎక్కువగా ఈ పాఠశాలనే ఆశ్రయిస్తుండడం కూడా ఒకే స్కూల్లో కవలలు ఎక్కువగా ఉండేందుకు కారణం అవుతోంది.

Advertisement
Advertisement