లక్ష్యాలు సాధించాలి | Sakshi
Sakshi News home page

లక్ష్యాలు సాధించాలి

Published Wed, Aug 24 2016 11:46 PM

లక్ష్యాలు సాధించాలి

= ఎమ్మెల్యేలతో సంప్రదించి లబ్ధిదారులను ఎంపిక చేయాలి
= గృహనిర్మాణ సంస్థ అధికారులకు కలెక్టర్‌ సుజాతశర్మ ఆదేశం‡
ఒంగోలు టౌన్‌ : 
గృహ నిర్మాణంలో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన సాధించాలని కలెక్టర్‌ సుజాతశర్మ ఆదేశించారు. సంబంధిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సంప్రదించి లబ్ధిదారుల ఎంపికను సకాలంలో పూర్తిచేయాలన్నారు. ఎన్‌టీఆర్‌ గృహ నిర్మాణం, ఇందిరా ఆవాస్‌ యోజన, పాత ఇళ్ల మరమ్మతులు, బిల్లుల చెల్లింపులపై స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్‌ హాలులో బుధవారం గృహ నిర్మాణ సంస్థ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గృహ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రెండు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జీఓ నంబర్‌ 103 ప్రకారం రాష్ట్ర ప్రాయోజిత ఎన్‌టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద జిల్లాలోని ఒంగోలు నియోజకవర్గానికి 350 గృహాలు, మిగిలిన 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 900 గృహాల చొప్పున 10,250 గృహాలు మంజూరైనట్లు తెలిపారు. ఈ గృహాలు 200 చదరపు అడుగుల్లో ఉండాలన్నారు. ఒక్కో యూనిట్‌ విలువ లక్షా 50 వేల రూపాయలని పేర్కొన్నారు. ఇందులో 95 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ కాగా, మిగిలిన 55 వేల రూపాయలు ఉపాధి హామీ పథకం కింద భరించడం జరుగుతుందన్నారు. ఎన్‌టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణం కింద గతంలో నిర్ణయించిన లక్ష్యం 14,250కుగానూ 11,500 మంది లబ్ధిదారులను ఇప్పటికే గుర్తించామన్నారు. ఈ జాబితా నుంచి తాజా ఉత్తర్వుల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. అలాగే జీఓ నంబర్‌ 104 ప్రకారం కేంద్ర ప్రాయోజిక ఎన్‌టీఆర్‌ గృహ నిర్మాణం కింద జిల్లా వ్యాప్తంగా 4,102 గృహాలు మంజూరైనట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2011 సామాజిక, ఆర్థిక జనాభా లెక్కల ప్రకారం గుర్తించిన 9,785 మంది లబ్ధిదారుల జాబితాను పంపించగా, అందులో ప్రస్తుతం 4,493 మంది అర్హులున్నట్లు తేలిందన్నారు. ఈ పథకం కింద ఒక్కో యూనిట్‌ విలువ 2 లక్షల రూపాయలని, అందులో లక్షా 20 వేల రూపాయలను ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని, మిగిలిన 80 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అనుసంధానంతో భరిస్తోందని వివరించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం 4,102 గృహాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉందన్నారు. లబ్ధిదారుల ఎంపికలు సకాలంలో పూర్తిచేయకుంటే వాటిని కోల్పోయే అవకాశం ఉందన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ను విధిగా పాటించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఇందిరా ఆవాస్‌ యోజన పథకం కింద 2015–16 సంవత్సరానికి సంబంధించి జిల్లాకు మంజూరైన 4,326 గృహాలకుగానూ 1,913 గృహాలు పూర్తయ్యాయని, వివిధ దశల్లో ఉన్న 2,413 గృహాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. 
పురోగతి లేకుంటే క్రమశిక్షణ చర్యలు...
ఎన్‌టీఆర్‌ అప్‌గ్రెడేషన్‌ కింద జిల్లాకు కేటాయించిన 12 వేల పాత ఇళ్ల మరమ్మతులపై ప్రజలకు అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఇప్పటివరకు 4,956 మంది లబ్ధిదారులను గుర్తించగా, అందులో 552 గృహాలకు మంజూరు చేశారన్నారు. లబ్ధిదారులను గుర్తించడంలో పర్చూరు, సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గాల్లో మంచి పురోగతి ఉందన్నారు. ఒంగోలు, చీరాల, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాలు వెనుకంజలో ఉన్నాయన్నారు. నెలాఖరులోగా నిర్ణీత లక్ష్యాలు పూర్తిచేయకుంటే, వాటిని మిగిలిన నియోజకవర్గాలకు మళ్లించడం జరుగుతుందని స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 15వ తేదీ మరలా సమావేశం నిర్వహిస్తానని, పురోగతి సాధించకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
అర్బన్‌ హౌసింగ్‌ లక్ష్యాలు 
అధిగమించాలి...
అర్బన్‌ హౌసింగ్‌ (పట్టణ గృహ నిర్మాణ పథకం) లక్ష్యాలు అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ పథకం కింద ఒంగోలు నగరానికి 500 ఇళ్లు మంజూరైతే ఇప్పటి వరకు 320 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారని, చీరాల మున్సిపాలిటీకి 612 గృహాలు మంజూరైతే ఇంతవరకు ఒక్కరిని కూడా ఎంపిక చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించి నిర్ణీత లక్ష్యాలను మూడునెలల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్‌ పీడీ ధనుంజయుడు, ఈఈలు, డీఈలు, ఏఈలు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement