రానున్న ఎన్నికల్లో 90స్థానాలు ఖాయం | Sakshi
Sakshi News home page

రానున్న ఎన్నికల్లో 90స్థానాలు ఖాయం

Published Thu, Feb 16 2017 1:03 AM

90 seats in the coming elections would be

కుక్కడం (మాడుగులపల్లి) : 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 90 స్థానాల్లో గెలుపొందడం ఖాయమని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు. బుధవారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ దిమ్మె జెండా ఆవిష్కరించారు. తొలుత కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించడం ఖాయమన్నారు. దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ పెరుగుతుందని, మోదీ, కేసీఆర్‌ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసుగు చెందారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ భారీ ఆధిక్యతతో అధికారంలోకి వస్తుందన్నారు.

 తెలంగాణ కోసం తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మొట్ట మొదటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నేనేనన్నారు. తెలంగాణకు ద్రోహం, వెన్నుపోటుదారులకు కేసీఆర్‌ మంత్రి పదవులు కట్టబెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు. దళితులకు మూడు ఎకరాలు ఇస్తానన్న కేసీఆర్‌ ఇప్పటి వరకు మూడు గుం టల జాగా కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీనేనని, ప్రజలంతా సోనియాగాంధీకి రుణపడి ఉండాలన్నారు.

 రైతులకు దఫాలుగా రుణమాఫీ చేస్తానని ఇప్పటి వరకు మాఫీ చేయకుండా కొత్త రుణాలు పొందలేక రైతున్నలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తెలంగాణ వస్తే నిరుద్యోగులు ఉండరని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌ నిరుద్యోగ సమస్యతో యువకులు అల్లాడుతున్నప్పటికీ భర్తీ చేయడంలో తాత్సారం చేస్తున్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త సైనికుల్లా ప్రజల్లోకి వెళ్లి గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గడ్డం వేణుగోపాల్‌ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ పాశం సంపత్‌రెడ్డి, ఎంపీటీసీ పుట్ట పద్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి మునుగోటి యాదగిరి, పుల్లెంల సైదులు, దామిడి గోపాల్‌ రెడ్డి, చింతకుంట్ల వెంకటరెడ్డి, నాంపల్లి జగన్, గడ్డమీది సైదులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement