మజ్జిగ లేదు.. నీళ్లు లేవు | Sakshi
Sakshi News home page

మజ్జిగ లేదు.. నీళ్లు లేవు

Published Sat, Apr 23 2016 3:42 AM

మజ్జిగ లేదు.. నీళ్లు లేవు

ఉపాధి కూలీలకు తీరని దాహం
మజ్జిగ సరఫరాకు ముందుకు రాని  పొదుపు సంఘాల మహిళలు
గ్లాస్ మజ్జిగకు రూ.3 ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం
భగ్గుమంటున్న పాల ధరలు  

 
 
బండిఆత్మకూరు: ఉపాధి కూలీలను వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగించేందుకు మజ్జిగను సరఫరా చేయాలన్న ప్రభుత్వ ఆశయానికి ఆదిలోనే హంసపాదు ఎదురవుతుంది. పొదుపు సంఘాల మహిళలు తమకు గిట్టుబాటు కాదని చేతులెత్తేశారు. దీంతో ఉపాధి కూలీలకు మజ్జిగను ఎలా సరఫరా చేయాలో తెలియక ఎంపీడీఓ కార్యాలయం అధికారులు, ఉపాధి పథకం అధికారులు తలలు పట్టుకున్నారు. ఉపాధి కూలీలకు మజ్జిగను సరఫరా చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  క్యాబినెట్‌లో తీర్మానించారు. ఇందుకు అనుగుణంగా మండల పరిషత్ అధికారులకు ఉత్తర్వులు అందాయి.  మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో దాదాపు 2వేల మందికి పైగా ఉపాధి కూలీలు ఉన్నారు. దీంతో ప్రభుత్వం వీరికి ఒక గ్లాస్ మజ్జిగను ఒక ఉపాధి కూలీకి సరఫరా చేసేందుకు రూ.3 చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడానికి ఇటీవల ఏపీఓ శ్రీకళ ఆధ్వర్యంలో ఐకేపీ సిబ్బందిచే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వివిధ గ్రామైక్య సంఘాల లీడర్లు, సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. దీంతో ఏపీఓ సిబ్బంది ప్రభుత్వం నుంచి వచ్చిన మజ్జిగ పథకం గురించి వివరించారు. ఒక్కొక్క సభ్యురాలు 50 నుంచి 100 మంది ఉపాధి కూలీలకు మజ్జిగను సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. ఒక్క గ్లాస్‌కు కేవలం రూ.3 మాత్రమే చెల్లిస్తామని చెప్పారు. దీంతో పొదుపు సంఘాల మహిళలు తాము ఇంత తక్కువ ధరకు సరఫరా చేయడం సాధ్యం కాదని చేతులెత్త్తేశారు.


 ఎందుకు గిట్టుబాటు కాదంటే..
 ప్రస్తుతం మార్కెట్‌లో లీటరు రూ.50, లీటరు పాలతో 20 గ్లాస్‌ల మజ్జిగ తయారవుతోంది. 20 గాస్ల్‌ల మజ్జిగ సరఫరా చేసేందుకు రూ.60 ఖర్చు ఉంది. ఇందుకు అదనంగా రూ.10 మాత్రం మిగులుతుంది. ఇలా 50 మందికి సరఫరా చేస్తే ప్రభుత్వం నుంచి ఒక్కో గ్లాస్‌కు (100ఎంఎల్)రూ.3 వస్తే రూ.150 చెల్లిస్తారు. అయితే ఇందులో పెట్టుబడిగా రెండున్నరల లీటర్ల పాలకు రూ.125 ఖర్చు అవుతుంది. దీంతో పెట్టుబడి పోను కేవలం రూ.25మాత్రమే వస్తుంది.   
 
 
 గ్లాస్‌కు రూ.5 ఇవ్వాలి
 ఇప్పుడున్న పరిస్థితుల్లో మజ్జిగను ఉపాధి కూలీలకు సరఫరా చేయాలంటే కనీసం గ్లాస్‌కు రూ.5 ఇవ్వాలి. ఇదే విషయమై ఇటీవల జరిగిన సమావేశంలో అధికారులకు తెలియజేశాం. అధికారులు, ప్రభుత్వం ఆ ధర ఇస్తేనే సరఫరా చేస్తాం.    - లక్ష్మి, ఈర్నపాడు
 .
 
పొదుపు మహిళలు ఒప్పుకోవడం లేదు
 ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనను తమ సంఘాల్లోని సభ్యులకు వివరించాం. అయితే మహిళా సభ్యులు ఇంత తక్కువ ధరకు సరఫరా చేయలేమని చెబుతున్నారు. పాలు, కుండలు, గ్లాస్‌లు కొని మజ్జిగను తయారు చేసి మహిళలే ఉపాధి కూలీల వద్దకు తీసుకెళ్లి పంపిణీ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నదని, రేటు పెంచాలని కోరుతున్నారు.      - నూర్జహాన్, ఏ.కోడూరు ఐక్యసంఘం లీడర్

Advertisement
Advertisement