ప్రత్యేక హోదా వస్తే... నవ్యాంధ్రకు వెలుగు వస్తుంది | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా వస్తే... నవ్యాంధ్రకు వెలుగు వస్తుంది

Published Sun, Apr 26 2015 9:44 PM

ప్రత్యేక హోదా వస్తే... నవ్యాంధ్రకు వెలుగు వస్తుంది - Sakshi

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

గుంటూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆదివారం గుంటూరు నగరంలోని స్థానిక స్తంభాలగరువులో ఓ ప్రైవేట్ కార్యక్రమాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

ప్రత్యేక హోదా వస్తే 90శాతం నిధులు వస్తాయని, దీంతో నవ్యాంధ్రప్రదేశ్‌కు వెలుగు వస్తుందని రాష్ట్రప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. యూపీఏ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ముందు చూపు లేకుండా రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. విభజన చట్టంలో పొందుపరచకుండా నోటి మాటగా హామీ ఇచ్చిందని, దీని వల్ల ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు.

రాజధానిలో మార్పు లేదు
రాజధానిని కృష్ణాజిల్లాకు మారుస్తున్నారా అని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ.. భూసేకరణలో భాగంగా రైతుల నుంచి 33వేల ఎకరాలు గుంటూరు జిల్లాలో సేకరించామన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలను మహానగరాలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. రాజధాని మార్పు ప్రసక్తే లేదని పుల్లారావు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement