చిత్తూరు రోడ్డు ప్రమాదంలో తప్పెవరిది ? | Sakshi
Sakshi News home page

చిత్తూరు రోడ్డు ప్రమాదంలో తప్పెవరిది ?

Published Fri, Mar 6 2015 2:11 AM

చిత్తూరు రోడ్డు ప్రమాదంలో తప్పెవరిది ? - Sakshi

చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసుశాఖ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు హంస, అజయ్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వాహనం నడిపిన పురుషోత్తంపైనే నెపం మొత్తం నెట్టేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి. గంగాధరనెల్లూరు పోలీసు స్టేషన్‌లో సీజ్ చేసిన వాహనాన్ని ఎవరి అనుమతి లేకుండానే పురుషోత్తం చిత్తూరుకు తీసుకురావడం అసాధ్యం. పోలీసు స్టేషన్‌లో అధికారులు పురమాయించిన పనులను చేయడానికే పురుషోత్తం సీజ్ చేసిన వాహనాన్ని చిత్తూరుకు తీసుకొచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక్కడ పని పూర్తి చేసుకుని పోలీసు స్టేషన్‌కు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన వాహనం చాలా నెలల క్రితమే గంగాధరనెల్లూరు పోలీసు స్టేషన్‌లో సీజ్ చేసి ఉంచారు. ఫలితంగా వాహనం కండీషన్‌లో లేకుండా పోయింది.

ఇలాంటి వాహనాన్ని స్టేషన్ అధికారులు పనిపై పంపితేనే పురుషోత్తం చిత్తూరుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే పురుషోత్తంతో పాటు వ్యానులో మరో ఇద్దరు యూనిఫామ్‌లో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్రమాదానికి వీరద్దరూ కారణం కాకపోయినప్పటికీ పైఅధికారులు చెప్పిన పనిచేయడానికి స్టేషన్‌లో ఉన్న వాహనాన్ని తీసుకొచ్చినట్లు నిర్ధారణ అవుతోంది. వాహనం స్టేషన్ నుంచి ఎలా బయటకు వచ్చిందనే విషయాలపై దర్యాప్తు అధికారిగా ఉన్న చిత్తూరు ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డికి గంగాధరనెల్లూరు స్టేషన్‌లో పనిచేస్తున్న కొందరు పోలీసులు ఈ వివరాలు చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసు శాఖ ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement