అంతా నా ఇష్టం | Sakshi
Sakshi News home page

అంతా నా ఇష్టం

Published Thu, Feb 11 2016 12:02 AM

Sand danda in tdp leaders

 నాటుబళ్లతో ఇసుక రవాణా చేస్తే కేసులు పెట్టి నానా హంగామా చేసే పోలీసులు, రెవెన్యూ అధికారులకు అధికారి పార్టీ నేత చేస్తున్న ఇసుక దందా మాత్రం కనిపించడం లేదు. పట్టపగలు తమ కళ్ల ముందే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
 
 నెల్లిమర్ల: ఆయన అధికార టీడీపీకి చెందిన మండల స్థాయి నేత. అందులోనూ ఎమ్మెల్యే పతివాడ అండదండలున్న గ్రామస్థాయి ప్రజాప్రతినిధి. ఇంకేముంది పట్టపగలే ట్రాక్టర్లతో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేసుకుంటున్నారు. అయినా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువులు, కాలువలు ఇప్పటికే తవ్వేశారు. దీనికితోడు రాత్రివేళల్లో చంపావతి నది నుంచి కూడా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు.
 
 కలెక్టర్ అనుమతి ఉందని చెబుతూ...
 నెల్లిమర్ల మండలానికి చెందిన ఈయన ఇటీవలే తమ గ్రామానికి సుమారు రూ.రెండుకోట్ల విలువైన పనులు మంజూరు చేయించుకున్నారు. ఆ నిధులతో తాజాగా పనులు ప్రారంభించారు. అయితే పనులకు ఇసుక కొరత ఏర్పడటంతో తమ గ్రామపరిధిలోనే ఉన్న చెరువు, కాలువలపై అతని కన్నుపడింది. ఇంకేముంది రాత్రికిరాత్రే పొక్లెయిన్లతో ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. ఇప్పటికే అక్కడున్న చెరువు, కాలువల్లో వందల యూనిట్ల ఇసుకను అక్రమంగా తవ్వి రవాణా చేసేశారు. ఇదేంటని కొందరు గ్రామస్తులు అడిగితే ఇసుక తవ్వకాలు అడ్డుకుంటే గ్రామాభివృద్ధి ఆగిపోతుందని నమ్మబలికారు. దీంతో గ్రామస్తులు కూడా అడ్డుజెప్పలేదు.
 
 పట్టించుకోని అధికారులు..
 రెండురోజులుగా బొప్పడాం గెడ్డ నుంచి, నెల్లిమర్ల చంపావతి నది నుంచి కూడా రాత్రివేళల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడు. ఎవరైనా అడిగితే తనకు జిల్లా కలెక్టరు అనుమతి ఉందని చెబుతున్నాడు. ఇంత వ్యవహారం జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులు కనీసం దృష్టి సారించకపోవడం గమనార్హం. ఈ విషయంలో ఎక్కడికక్కడ ముడుపులు అందజేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సదరు నేత చేపడుతున్న ఇసుక దందా ఆపకపోతే చెరువులు, కాలువలు గుల్లయ్యే ప్రమాదముందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement
Advertisement