బియ్యం భోక్తలు | Sakshi
Sakshi News home page

బియ్యం భోక్తలు

Published Mon, Aug 3 2015 4:47 AM

బియ్యం భోక్తలు - Sakshi

మార్కాపురం : పేదలకు దక్కాల్సిన సబ్సిడీ బియ్యం నల్లబజారుకు తరలిపోతున్నాయి. కొందరు డీలర్లకు అక్రమ ఆదాయానికి మార్గంగా మారాయి. కిలో రూపాయి ప్రకారం ఒక వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యాన్ని సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందిస్తుంది. వాస్తవానికి ప్రభుత్వం బయట సుమారు రూ.22 చెల్లించి కొనుగోలు చేస్తుంది.

 పట్టణాల్లో మాత్రమే ఈ-పాస్ విధానం అమలవుతుండగా..గ్రామీణ ప్రాంతాల్లో డీలర్లు రేషన్‌కార్డుల ద్వారా అందిస్తున్నారు. దీంతో పశ్చిమ ప్రకాశంలో పేదలకు చెందాల్సిన బియ్యం లారీల ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి. మార్కాపురం నుంచి నంద్యాల మీదుగా అనంతపురం, యర్రగొండపాలెం నుంచి కోస్తా జిల్లాలకు బియ్యం అక్రమ రవాణా అవుతున్నాయి. మొత్తం మీద నెలకు 800 నుంచి వెయ్యి బస్తాల బియ్యం అక్రమంగా తరలి వెళ్తున్నాయి. పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం,గిద్దలూరు, కంభం, యర్రగొండపాలెంలలో పౌరసరఫరా శాఖ గోడౌన్లు ఉన్నాయి.

మార్కాపురం గోడౌన్ ద్వారా మార్కాపురం పట్టణ, రూరల్, పెద్దారవీడు, పెద్దదోర్నాల, తర్లుపాడు మండలాల్లోని రేషన్ దుకాణాలకు ప్రతినెలా దాదాపు 980 టన్నుల బియ్యం గిద్దలూరు గోడౌన్ నుంచి గిద్దలూరు, కొమరోలు, రాచర్ల మండలాలకు 700 టన్నుల బియ్యం, కంభం గోడౌన్ నుంచి కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాలకు 530 టన్నులు, యర్రగొండపాలెం గోడౌన్ ద్వారా యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాలకు 750 టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి స్టేజ్ 1 కాంట్రాక్టర్లు సివిల్ సప్లయ్ గోడౌన్లకు చేరుస్తారు.

అక్కడి నుంచి స్టేజ్ 2 కాంట్రాక్టర్లు ఆయా గ్రామాల్లోని రేషన్‌షాపులకు తరలిస్తారు. పశ్చిమ ప్రకాశంలోని త్రిపురాంతకం, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, కంభం, అర్ధవీడు, గిద్దలూరు, రాచర్ల, పెద్దారవీడు, పెద్దదోర్నాల, తర్లుపాడు మండలాల్లో కొంత మంది డీలర్లు రేషన్ బియ్యాన్ని దుకాణాలకు చేర్చకుండానే అక్రమంగా బియ్యాన్ని కొనుగోలు చేసే వ్యాపారులకు కిలో రూ.5 నుంచి రూ.7 ప్రకారం అమ్ముతున్నారు. ఈ బియ్యాన్ని రైసు మిల్లుల ద్వారా లెవీ రూపంలో మళ్లీ ప్రభుత్వానికి సుమారు కేజీ రూ.22 ప్రకారం అమ్ముతున్నారు. మరి కొంత మంది వ్యాపారులు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, ద్వారకా తిరుమల దేవస్థానాల్లోని కాంట్రాక్టర్లకు నిత్యాన్నదానానికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. బయటి మార్కెట్‌లో వంద కిలోల బియ్యం బస్తా రూ.3500 నుంచి రూ.4 వేల మధ్య ఉండటంతో సబ్సిడీ బియ్యానికి డిమాండ్.

 అక్రమాలు ఇలా...
 మున్సిపాలిటీల్లో మాత్రమే ఈ-పాస్ విధానం అమలవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో డీలర్లు రేషన్‌కార్డుదారులకు ఇవ్వాలి. కొంత మంది కార్డుదారులు బియ్యం నాణ్యత లేకపోవటంతో తీసుకోకపోగా, మరి కొంత మందికి డీలర్లు ఇవ్వటం లేదు. దీంతో ప్రతి మండలం నుంచి సుమారు 50 బస్తాల బియ్యం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తోంది. ఈ విషయంపై పలువురు డీలర్లు కూడా తాము అధికారులకు ఇస్తున్న లంచాల గురించి బహిరంగంగానే చెబుతున్నారు.

ప్రతి నెలా తహశీల్దార్‌కు రూ.500, డిప్యూటీ తహశీల్దార్‌కు రూ.500, ఆర్.ఐ.కి రూ.500, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెట్ డీటీకి కలిపి రూ.500, సేల్స్ రిజిష్టర్‌కు రూ.300, అటెండర్‌కు రూ.100, లారీ డ్రైవర్‌కు రూ.100, ఒక బస్తా దించినందుకు కూలి రూ.5 మామూళ్ల రూపంలో చెల్లిస్తున్నామని తెలిపారు. గోడౌన్ నుంచి వచ్చే బియ్యంలో కిలో గోతం, 500 గ్రాముల బియ్యం తరుగుగా వస్తుందని, 100 బస్తాల బియ్యం వస్తే 150 కిలోల తరుగు పోతుందని అంటున్నారు. ఇటీవల త్రిపురాంతకం మండలంలో ఒక రెవెన్యూ అధికారి కారు కొనుగోలు చేసేందుకు ప్రతి డీలర్ వద్ద నుంచి రూ.2,500 అదనంగా వసూలు చేయగా, సీఎం జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ప్రతి డీలర్‌కు దాదాపు అదనపు ఖర్చు వస్తుందని తెలిపారు. ఇలాంటప్పుడు సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టడంలో ఆశ్చర్యమేమిటని అంటున్నారు.

 ఎక్కడ నుంచి ఎక్కడకు...
 మార్కాపురం ప్రాంతంలో కొనుగోలు చేసిన బియ్యాన్ని మార్కాపురం, తర్లుపాడు, కంభం, గిద్దలూరు రైల్వేస్టేషన్‌లలో రైళ్ల ద్వారా నంద్యాల, అనంతపురానికి చేరుస్తున్నారు. యర్రగొండపాలెం ప్రాంతంలో సేకరించిన సబ్సిడీ బియ్యాన్ని కోస్తా జిల్లాలకు చేర్చి అక్కడి నుంచి పోర్టులకు తరలించి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు. గత నెలలో మార్కాపురంలో అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఇటీవల రైల్వేస్టేషన్‌లో కూడా అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న 20 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నారు. ప్రతి నెలా గోడౌన్ నుంచి బియ్యం షాపులకు తరలించే సమయంలో రూట్ ఆఫీసర్ ఉండాలి. పలు మండలాల్లో రూట్ ఆఫీసర్లు లేకపోవటంతో మార్గ మధ్యంలోనే బియ్యం బస్తాలు పక్కదారి పడుతున్నాయి.
 
 క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
 సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై 6ఏతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. జిల్లాలో ఇటీవలే టంగుటూరు, సంతనూతలపాడు, ఉలవపాడులలో అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీలను పట్టుకుని కేసులు నమోదు చేశాం. ముగ్గురు ఏఎస్‌ఓలను నియమించి వారికి సిబ్బందిని కేటాయించి వాహనాలను సమకూర్చాం. నేనే స్వయంగా మార్కాపురం డివిజన్‌పై దృష్టి సారించి సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటాం. సివిల్ సప్లయ్ గోడౌన్లలో బియ్యం తూకం తక్కువ రాకుండా ఉండేం దుకు తూకాల మిషన్లను ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని చోట్ల 10 టన్నుల కాటాను ఏర్పాటు చేశాం.
 - ఎస్.వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఒంగోలు

Advertisement
Advertisement