ఎంబీబీఎస్ మెరిట్‌తోనే పీజీ యాజమాన్య సీట్ల భర్తీ | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్ మెరిట్‌తోనే పీజీ యాజమాన్య సీట్ల భర్తీ

Published Mon, Feb 2 2015 3:12 AM

ఎంబీబీఎస్ మెరిట్‌తోనే పీజీ యాజమాన్య సీట్ల భర్తీ

తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు  వైద్య కళాశాలల నిర్ణయం
కర్ణాటక తరహాలో భర్తీ చేయాలని తీర్మానం
డిమాండ్‌ను బట్టి సీట్ల అమ్మకం
అభ్యర్థుల్లో సందేహాలు, ఆందోళన


సాక్షి, హైదరాబాద్: రానున్న విద్యా సంవత్సరంలో యాజమాన్య కోటాలోని పీజీ వైద్య సీట్ల భర్తీకి ఎంబీబీఎస్ మెరిట్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వైద్య కళాశాలలు నిర్ణయించాయి. ఇప్పటికే ప్రభుత్వ కళాశాలల్లోని పీజీ వైద్య సీట్లకు సంబంధించి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరంలో సీట్ల భర్తీపై ప్రైవేటు వైద్య కళాశాలలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రైవేటు కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా కింద ఉంటే, మిగతా 50 శాతం యాజమాన్య కోటాలో భర్తీ చేసుకోవచ్చు. అయితే యాజమాన్య కోటాపై ప్రతి ఏడాది వివాదం చెలరేగుతోంది.

చివరి నిమిషంలో ప్రైవేటు కళాశాలలు సీట్లను గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకుంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు ప్రభుత్వం కానీ, ఇటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కానీ పట్టించుకోకపోతుండటంతో తాము నష్ట పోతున్నామని ప్రతిభ కలిగిన విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక తరహాలో ప్రతి కళాశాల ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేసుకుని సీట్లను భర్తీ చేసుకోవాలని ప్రైవేటు వైద్య కళాశాలల సంఘాలు తీర్మానించాయి. మార్చిలో నిర్వహించే పీజీసెట్ ఫలితాలు వచ్చాక.. ప్రైవేటు కళాశాలలు విడివిడిగా ప్రకటనలు ఇచ్చి, ఎంబీబీఎస్ మార్కుల ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు.

ప్రస్తుతం కర్ణాటకలో ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారని, ఇదే విధానాన్ని తెలుగురాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని అభిప్రాయం యాజమాన్యం అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి సుమారు 1,290 పీజీ వైద్య సీట్లు ఉన్నాయి. ఇందులో 670 సీట్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా, 620 సీట్లు తెలంగాణలో ఉన్నాయి. భారతీయ వైద్య మండలి నిర్ణయం మేరకు కొన్ని అదనంగా రావడం గానీ.. కోత విధించడం గానీ జరిగే అవకాశం ఉంటుంది.

రూ. కోటిన్నర దాటితేనే సీటు
మెరిట్ ఆధారంగా అని ఒక పక్క చెబుతున్నా.. డిమాండ్ అధికంగా ఉన్న పీజీ వైద్య సీట్లకు కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల వరకూ ధర నిర్ణయించారని తెలిసింది. ముఖ్యంగా రేడియాలజీ సీట్లకైతే డిమాండ్ అధికంగా ఉంది. ఒక్కో సీటును రూ. 1.50 కోట్ల నుంచి రూ. 1.70 కోట్లకు అమ్ముతున్నట్టు తెలిసింది. ఆర్థోపెడిక్ విభాగానికి కూడా డిమాండ్ ఏర్పడింది. దీంతో పాటు ఎంఎస్ జనరల్ సర్జన్, ఎండీ జనరల్ మెడిసిన్, ఎండీ పీడియాట్రిక్, ఎండీ అనస్థీషియా విభాగాలకు అభ్యర్థుల డిమాండ్‌ను బట్టి యాజమాన్యాలు రేట్లు నిర్ణయిస్తున్నాయి.

అయితే ప్రైవేటు కళాశాలలు నోటిఫికేషన్లు ఎలా ఇస్తాయి, సీట్ల భర్తీ ఎలా, నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు లాంటి సందేహాలెన్నో అభ్యర్థులను వేధిస్తున్నాయి. గుట్టుచట్టుచప్పుడు కాకుండా నోటిఫికేషన్లు ఇచ్చి తమకు అన్యాయం చేస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రాధాన్యమున్న దినపత్రికల్లో ప్రకటనలిచ్చి, దరఖాస్తులు ఆహ్వానించి మెరిట్ ఆధారంగా యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సీట్ల భర్తీపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచిచూడాల్సి ఉంది.

Advertisement
Advertisement