గల్ఫ్ పేరిట టోకరా | Sakshi
Sakshi News home page

గల్ఫ్ పేరిట టోకరా

Published Thu, Apr 2 2015 3:49 AM

Narasapuram in the Gulf fraud

 నరసాపురం అర్బన్ : నరసాపురం ప్రాంతంలో గల్ఫ్ మోసాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. మొగల్తూరుకు చెందిన 10మంది మహిళలు గల్ఫ్ ఏజెంట్ తిమోతి చేతిలో మోసపోయి అతికష్టం మీద స్వదేశానికి ఇటీవల తిరిగి వచ్చారు. నరసాపురం పట్టణంలోని కృష్ణబాబు కాలనీకి చెందిన తల్లీకూతుళ్లు విజిటింగ్ వీసాతో మోసపోయి గల్ప్ వెళ్లి నానాఇబ్బందులు పడి ఎట్టకేలకు సొంత గూటికి చేరుకున్నారు. ఈ రెండు ఘటనలు గత నెలలో జరిగినవే. వీటిని మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. మొగల్తూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 42 మం దికి ఇరాక్‌లో భారీగా ఆదాయం వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఓ ఏజెంట్ పెద్దమొత్తంలో సొమ్ములు వసూలు చేసి మొహం చాటేశాడు. అతడి చేతిలో రామన్నపాలెం, కొత్తోట చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 42 మంది మోసపోయారు. ఒక్కొక్కరు ఏజెం ట్‌కు రూ.80 వేల చొప్పున చెల్లించారు. ఇరాక్ వెళ్లడానికి ముంబై చేరుకున్న 42 మంది, తాము మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. చివరకు ముం బైలోని ఆంధ్రా అసోసియేషన్‌ను ఆశ్రయించి న్యాయం కోసం ప్రయత్నిస్తున్నారు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నరసాపురం ప్రాంతంలో సంచలనం కలిగించింది.
 
 మోసగించిందిలా..
 మొగల్తూరు మండలం రామన్నపాలెంకు చెందిన గుత్తుల త్రిమూర్తులు కొంతకాలం క్రితం కూలి పనికోసం ఇరాక్ వెళ్లాడు. అక్కడ కరీంనగర్‌కు చెందిన భూమేష్ అనే వ్యక్తి అతడికి పరిచమయ్యాడు. భూమేష్, త్రిమూర్తులు ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేసేవారు. త్రిమూర్తులుకు ఆరోగ్యం బాగుండకపోవడంతో కొద్దినెలల క్రితం స్వగ్రామం వచ్చేశాడు. ఈ నేపథ్యంలో సొమ్ములు దండుకోవడానికి పథకం పన్నిన భూమేష్ రెండు నెలల క్రితం త్రిమూర్తులుకు ఫోన్ చేశాడు. ఇరాక్‌లో డ్రైవర్లు, ఇతర ఉద్యోగాలకు చాలా డిమాండ్ వచ్చిందని, తెలిసిన వారు ఎవరైనా ఉంటే పంపించమని సలహా ఇచ్చాడు.
 
 భూమేష్ మాటలు నమ్మిన త్రిమూర్తులు రామన్నపాలెం చుట్టుపక్కల గ్రామాలకు చెం దిన 42 మందిని ఇరాక్ వెళ్లాల్సిందిగా ప్రోత్సహించాడు. ఒక్కొక్కరి నుంచి రూ.80 వేల చొప్పున రూ.40 లక్షలకు పైగా వసూలు చేశా డు. 15 రోజల క్రితం రామన్నపాలెం వచ్చిన భూమేష్ ఆ సొమ్మును, వారి పాస్‌పోర్టులను తీసుకుని అందరినీ ముంబై రమ్మన్నాడు. అక్కడినుంచి విమానంలో ఇరాక్ పంపిస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ముంబై వెళ్లిన 42 మందికి భూమేష్ సమాచారం దొరకకపోవడం, ఫోన్‌లో కూడా అందుబాటులో లేకపోవడంతో కంగుతిని మోసపోయామని తెలుసుకున్నారు. బుధవారం ముంబైలోని ఆంధ్రా అసోసియేషన్ ద్వారా పోలీసులను ఆశ్రయించారు.
 
 చర్యలేవీ..
 డెల్టా ప్రాంతంలో ఈ తరహా మోసాలకు అంతే లేకుండాపోతోంది. మోసాల నిరోధానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ తరహా ఘటనలు తరచూ పునరావృతం అవుతున్నాయి. నరసాపురం, పాలకొల్లు, భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధికొక గల్ఫ్ ఏజెంట్ ఉన్నాడంటే అతిశయోక్తి లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏజెంట్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. స్థాని కంగా ఉపాధి అవకాశాలు లేకపోవడం, బయట దేశాలకు వెళితే నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చన్న ఆశ పేద, మధ్య తరగతి ప్రజలను ఏజెంట్ల వలలో పడేలా చేస్తోంది. దీంతో అప్పులు చేసి సొంత మనుషులను వదిలి పరాయి దేశాలకు పయనమవుతున్నారు. ఏజెంట్లు విజిటింగ్ వీసాలు, ఇతర తప్పుడు విధానాలతో వారిని నిలువునా ముంచుతున్నారు. దీంతో ఎడారి దేశాలకు వెళ్లిన వారు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు.
 

Advertisement
Advertisement