విజయవాడలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు | Sakshi
Sakshi News home page

విజయవాడలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు

Published Tue, Jul 29 2014 11:36 AM

విజయవాడలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు

అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగులకు మూత్రపిండాలు ఇప్పిస్తామన్న పేరుతో.. కిడ్నీల రాకెట్ నడిపిస్తున్న ఐదుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఉమాదేవి, నాగసాయి అనే ఇద్దరు మహిళలు కూడా ఉండటం గమనార్హం. ఈ నిందితులను విజయవాడ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ మొత్తం రాకెట్కు సాయి అనే వ్యక్తి సూత్రధారి అని, అతడే ప్లాన్ తయారుచేస్తాడని తెలిపారు. అతడే కిడ్నీలు ఎరేంజ్ చేస్తాడని, అతడి ద్వారానే మొత్తం వ్యవహారం నడుస్తుందని అన్నారు. చక్రవర్తి శ్రీనివాస్, బాలాజీ సింగ్ అనే మరో ఇద్దరు కూడా ఈ రాకెట్లో ఉన్నారు. బాలాజీ సింగ్ గతంలో కూడా ఇలాంటి వ్యవహారం నడిపించాడు కాబట్టి అతడికి అనుభవం ఉందని పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్న దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి తన కిడ్నీని రెండు లక్షలకు అమ్మడానికి ముందుకు రాగా, అతడి భార్యగా నాగసాయి అనే మహిళను ప్రవేశపెట్టారు. బాలాజీ సింగ్ మధ్యవర్తిగా ఉండి వీళ్లను తీసుకురావడానికి అతడికి 15 వేల రూపాయలు ఇచ్చేవారు. దీనంతటికీ సాయి సూత్రధారి.

కిడ్నీలు దానం చేసే విషయంలో తప్పనిసరిగా రెవెన్యూ అధికారుల నుంచి కూడా ధ్రువీకరణ అవసరం కాబట్టి, ఎమ్మార్వో, ఆర్డీవోల సంతకాలను వేరువేరు వ్యక్తులు ఫోర్జరీ చేశారని, అయితే.. ఎమ్మార్వో సంతకాన్ని వాళ్లు గతంలో చూడకపోవడం వల్ల ఏదో చేతికి వచ్చినట్లు గీసేశారని చెప్పారు. ఆస్పత్రి వర్గాలు ఎందుకో అనుమానం రావడంతో ఈ పత్రాలను అటు ఎమ్మార్వోకు, ఇటు పోలీసులకు కూడా పంపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంతకం తనది కాదని ఎమ్మార్వో చెప్పడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రోగులకు ఈ వ్యవహారం అంతా తెలియదని, ఎంతో కొంత డబ్బు పెడితే కిడ్నీ దొరుకుతుందన్న విషయం తప్ప.. ఇందులో వీళ్లు ఇంత మోసాలకు పాల్పడే విషయం వారికి తెలియదని చెప్పారు. విజయవాడ కేంద్రంగా ఇంతకుముందు కూడా కిడ్నీల వ్యాపారం నడిచేది. అప్పట్లో ఒకసారి ఇది వెలుగులోకి రావడంతో కొన్నాళ్లు ఆగి, మళ్లీ మొదలైంది.

Advertisement
Advertisement