ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యత | Sakshi
Sakshi News home page

ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యత

Published Sun, Sep 21 2014 3:20 AM

ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యత - Sakshi

  • మంత్రి కొల్లు రవీంద్ర
  • చిలకలపూడి (మచిలీపట్నం) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజా సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యత  ఇస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ పింఛన్లు, సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పని         చేస్తోందన్నారు.   గత ప్రభుత్వాలు డెల్టాఆధునికీకరణపై నిర్లక్ష్యం వహించడం వల్లే కాలువలు బలహీన పడ్డాయని తెలిపారు.  బెల్ కంపెనీ విస్తరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు.

    ఇందుకోసం కంపెనీకి 25 నుంచి 50 ఎకరాల మధ్యలో భూమి కేటాయింపు కోసం రెవెన్యూ అధికారులతో చర్చించామన్నారు.  కృష్ణా యూనివర్సిటీ భవన నిర్మాణ పనుల కోసం జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని  చెప్పారు. భవానీపురం వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున పింఛన్ల పెంపు కార్యక్రమం, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం, ఎన్టీఆర్ ఆరోగ్య కార్యక్రమాలు, జన్మభూమి - మనఊరు కార్యక్రమాలను ప్రారంభిస్తామని తెలిపారు.

    రాష్ట్ర వ్యాప్తంగా 400 మద్యం దుకాణాల్లో ప్రభుత్వం నేరుగా విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ.5 కోట్లతో మంగినపూడిబీచ్ అభివృద్ధి పనులు, రూ. 3 కోట్లతో గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ వద్ద రిసార్ట్స్ ఏర్పాటు చేసి బోటు షికార్ ఏర్పాటు చేస్తామన్నారు. రూ.25 లక్షలతో చిలకలపూడి పాండురంగస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, టీడీపీ నాయకులు నారగాని ఆంజనేయప్రసాద్, కుంచే దుర్గాప్రసాద్ (నాని)  పాల్గొన్నారు.
     

Advertisement
Advertisement