ఇసుకే బంగారమాయే | Sakshi
Sakshi News home page

ఇసుకే బంగారమాయే

Published Wed, Feb 10 2016 2:29 AM

ఇసుకే బంగారమాయే

* ఈనెల నుంచి కొత్తపాలసీ అమల్లోకి..
* డ్వాక్రా మహిళల నుంచి భూగర్భ, గనుల శాఖకు రీచ్‌లు అప్పగింత
* కోర్టు స్టే విధించడంతో ఆగిపోయిన కొత్త విధానం

 అనంతపురం సెంట్రల్: జిల్లాలో బంగారు అయినా వెంటనే దొరుకుతుందేమో కానీ ఇసుక దొరకడం గగనంగా తయారైంది. పదిరోజుల నుంచి పరిస్థితి మరీ ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. వివరాలు.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక విక్రయాలను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న విషయం తెలిసిందే.

రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాల పేరుతో జిల్లాలో 41 ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసి క్రయ విక్రయాలు జరిపారు. శింగనమల మండలంలోని ఉల్లికల్లు, పెద్దపప్పూరు మండలం దేవునిఉప్పలపాడు, తాడిమర్రి మండలం చిన్న చిగుళ్ళరేవు, కణేకల్లు మండలం రచ్చుమర్రి, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బుడిమేపల్లి ఇసుకరీచ్‌ల ద్వారా నాణ్యమైన ఇసుక విక్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాల ముసుగులో అధికారపార్టీ నేతలు ఇసుక దందాకు తెరలేపారు.

జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ దందాలపై వార్తాపత్రికల్లో వరుస కథనాలు వచ్చాయి. ఉల్లికల్లు రీచ్‌లో జరిగిన అక్రమాలు నిగ్గుతేలడంతో పలువురు వెలుగు అధికారులపై వేటు పడింది. ఇలాంటి పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉండడంతో ఇసుక విధానంలో ప్రభుత్వం కొత్తపాలసీని తీసుకొచ్చింది. ఇసుక విక్రయాలను డ్వాక్రా సంఘాలకు తప్పించి వేలం పద్ధతిలో రీచ్‌లు అప్పగించాలని నిర్ణయించారు.

వీటిపై పర్యవేక్షణాధికారాలను భూగర్భ, గనుల శాఖకు అప్పగించారు. కొత్తపాలసీ విధానం ఈనెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అయితే వేలం ద్వారా ఇసుక విక్రయాలు జరిపితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం స్టే విధించడంతో కొత్తపాలసీ విధానం అమలు కాలేదు.
 
అధికారులు విఫలం
ఇసుక విక్రయాల బాధ్యత నుంచి జనవరి 31తో డ్వాక్రా మహిళలు తప్పుకున్నారు. ఆరోజు నుంచి ఇసుక క్రయవిక్రయాలు నిలుపుదల చేశారు. దీంతో ఇసుక కావాలనే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇసుక కోసం వినియోగదారులు మీసేవా కేంద్రాలకు వెళ్తే డీడీలు కట్టించుకోకపోవడంతో ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. డిమాండ్ దృష్ట్యా అధికార పార్టీ నేతలు ట్రాక్టర్ ఇసుక రూ. 3వేలకు పైగా విక్రయిస్తున్నారు. సామాన్యులకు ఇసుక ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపో వడంతో బంగారంలా తయారైంది.
 
31లోపు వాటికి అందిస్తున్నాం
ఈనెల 1వ తేదీ నుంచి కొత్త పాలసీ వచ్చింది. జనవరి 31 వరకూ వచ్చిన డీడీలకు క్లియరెన్స్ చేస్తున్నాం. ఆతర్వాత డీడీలు కట్టించుకోవడం లేదు. ఇసుక విక్రయాల బాధ్యతలు భూగర్భ గనులశాఖకు అప్పగించడంతో వారే టెండర్లు ఖరారు చేసి విక్రయించే అవకాశముంది.
- వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జ్ ప్రాజెక్టు డెరైక్టర్, డీఆర్‌డీఏ-వెలుగు ప్రాజెక్టు .

Advertisement
Advertisement