టీడీపీ నేతలకు ఈసీ వార్నింగ్‌! | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలకు ఈసీ వార్నింగ్‌!

Published Mon, Aug 21 2017 3:20 AM

టీడీపీ నేతలకు ఈసీ వార్నింగ్‌! - Sakshi

- అక్రమాలకు పాల్పడితే ఎంతటివారిపైనైనా చర్యలు తప్పవు
టీడీపీ ఎంపీలకు స్పష్టం చేసిన భన్వర్‌లాల్‌
 
సాక్షి, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీకి ఎన్నికల సంఘం ఝలక్‌ ఇచ్చింది. ఎన్నికల సంఘంపైనే ఆరోపణలకు దిగిన అధికారపక్షానికి ఈసీ వద్ద గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఏస్థాయి వారిపైనైనా కఠిన చర్యలు తప్పవని టీడీపీ నేతలకు ఈసీ వార్నింగ్‌ ఇచ్చింది. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని, అనవసరంగా తమపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికింది. సర్వేలు, ఒపీనియన్‌ పోల్స్‌పై నిషేధం ఎత్తివేయాలన్న టీడీపీ డిమాండ్‌ను తోసిపుచ్చింది.

తెలుగుదేశం పార్టీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని ఆదివారం ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిశారు. వైఎస్సార్‌ సీపీ నిబంధనలను అతిక్రమిస్తోందని, ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలని కోరారు. డబ్బులు తరలిస్తున్నారంటూ వైఎస్సార్‌ సీపీ చేసిన ఫిర్యాదుపై గంటలోనే స్పందించారని, అందులో నిజం లేదని తేలినా ఆపార్టీపై చర్యలు తీసుకోలేదని, ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఈ వ్యాఖ్యలపై భన్వర్‌లాల్‌ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల సంఘం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఏ ఆధారంతో ఆరోపిస్తున్నారని టీడీపీ ఎంపీలను భన్వర్‌లాల్‌ నిలదీసినట్టు తెలిసింది. 
 
సర్వేలపై దర్యాప్తునకు ఆదేశం: నంద్యాల ఉప ఎన్నికల్లో సర్వేలు, ఒపీనియన్‌ పోల్స్‌పై నిషేధం కొనసాగుతుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందే ఎవరికి ఓటు వేస్తారని ఓటర్లను అడగడం చట్టవిరుద్ధమని ఈసీ చెప్పినట్లు తెలిసింది. సర్వే పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, భయపెట్టడం లాంటి చర్యలకు దిగుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందటంతోనే సర్వేలు, ఒపీనియన్‌ పోల్స్‌ నిషేధించామని టీడీపీ నేతలకు భన్వర్‌లాల్‌ వివరించారు. ఇప్పటివరకూ జరిగిన ఇలాంటి వాటిపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ఆయన స్పష్టం చేశారు. నంద్యాల ఉప ఎన్నిక జరిగే ఈ నెల 23వ తేదీ సాయంత్రం వరకూ ఎలాంటి సర్వేలు, ఒపీనియన్‌ పోల్స్‌ నిర్వహించవద్దని, వాటిని ఏ చానల్‌ ప్రసారం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Advertisement
Advertisement