ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ స్పేస్ పోలీసింగ్ | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ స్పేస్ పోలీసింగ్

Published Thu, Jul 30 2015 7:06 PM

Cyberspace Policing in Andhra Pradesh

హైదరాబాద్ : గస్తీ, తనిఖీలు, సోదాలు, పికెట్లు... ఇవన్నీ మన కంటికి కనిపించే సాధారణ పోలీసింగ్‌లో భాగం. వీటితో పాటు సమకాలీన అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా అధికారులు ఆధునిక పోలీసింగ్ చేపడుతున్నారు. ఇందులో భాగమైన సైబర్‌ స్పేస్ పోలీసింగ్ను యాకూబ్ మెమన్ ఉరి శిక్ష అమలు నేపథ్యంలో గురువారం నిర్వహించారు. దీన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని భావిస్తున్నారు. యాకూబ్ ఉరిని దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుతో పాటు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది.

దీంతో రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎలాంటి అపశృతులకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సందర్భాల్లో బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై జరిగే ప్రదర్శనలు, నిరసనలకన్నా సైబర్‌ స్పేస్ ద్వారా చోటు చేసుకునేవే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, విస్తరించిన సోషల్‌ మీడియా తదిరాలు సమాచార మార్పిడిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటిద్వారా ఎలాంటి సమాచారమైనా క్షణాల్లో వందలు, వేల మందికి చేరిపోతోంది. యాకూబ్ ఉరి శిక్ష అమలు నేపథ్యంలో అసాంఘిక శక్తులు ఉద్దేశపూర్వకంగా, కొన్ని వర్గాలు, ప్రాంతాలకు చెందిన వారు యాదృచ్ఛికంగా సోషల్‌ మీడియాలో చేసే వ్యాఖ్యలు తదితరాలు తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం పొంచి ఉంటుంది.

దీన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసు విభాగం సైబర్‌ స్పేస్ పోలీసింగ్‌ను చేపట్టింది. ఇంటర్‌నెట్‌తో పాటు సోషల్ మీడియా పైనా టెక్నికల్ నిఘా ఉంచారు. ఫోన్ కాల్స్, ఎస్‌ఎమ్మెస్‌లతో పాటు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ అయిన ఆర్కుట్, ఫేస్‌బుక్‌లపైనా సాంకేతికంగా కన్నేశారు. వీటిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలు, ఫొటోలు తదితరాల పోస్టింగ్ ఉంటున్నాయా? తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ విధానాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని యోచిస్తున్నారు. సైబర్ క్రైమ్ విభాగం పోలీసుల దీన్ని పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
Advertisement