నీరు-చెట్టు సరే.... ప్రాజెక్టులకు కేటాయింపులేవీ | Sakshi
Sakshi News home page

నీరు-చెట్టు సరే.... ప్రాజెక్టులకు కేటాయింపులేవీ

Published Sat, Apr 25 2015 4:39 AM

నీరు-చెట్టు సరే.... ప్రాజెక్టులకు కేటాయింపులేవీ - Sakshi

అమలులోకి రాని బాబు హామీలు
నేడు సీఎం చంద్రబాబు పర్యటన

 
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒకపక్క కరువు విలయతాండవం చేస్తోంది, మరోవైపు అకాల వర్షాలకు పండిన కొద్దిపాటి పంటలను కూడా దెబ్బతీశాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘నీరు- చెట్టు, ప్రాజెక్టుల సందర్శన’ పేరుతో శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత ఆయన గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించి అక్కడ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి ముండ్లమూరు మండలం పోలవరం గ్రామానికి వెళ్లి అక్కడ చెరువు పూడికతీత పనులతోపాటు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అసలు ప్రాజెక్టులు పూర్తి చేయకుండా చెరువుల్లో పూడికతీత పనుల వల్ల ఉపయోగం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

► ఈ ఏడాది కూడా బడ్జెట్లో జిల్లాలో జలయజ్ఞానికి రూ.710 కోట్లు కావాలని నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదించగా బడ్జెట్‌లో అరకొర కేటాయింపులే దిక్కయ్యాయి.
► జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేయడానికి రూ.505 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపంగా రూ.153 కోట్లు కేటాయించింది. కాంట్రాక్టర్లకు బకాయి ఉన్న రూ.40 కోట్లు చెల్లిస్తే మిగిలిన మొత్తం సిబ్బంది జీత భత్యాలకు సరిపోతుంది. గుండ్లకమ్మకు రూ.51 కోట్లు అవసరమని అధికారులు  ప్రతిపాదించగా దానికి కేవలం రూ.5.85 కోట్లు మాత్రమే కేటాయించారు.
► యర్రంచినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ. 55 కోట్లు ప్రతిపాదించగా రూ.6.39 కోట్లు కేటాయించారు. గత ఏడాది రూ. ఏడు కోట్లు కేటాయించగా ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు.
► పాలేరు రిజర్వాయరు నిర్మాణానికి రూ.34 కోట్లు, పోతురాజు కాలువ ఆధునికీకరణకు సంబంధించి రూ.20 కోట్లు కావాలని కోరగా వాటికి సంబంధించిన కేటాయింపులు బడ్జెట్‌లో చోటుచేసుకోలేదు.
► చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత   రామాయపట్నం పోర్టు అభివృద్ధి,  దొనకొండ, కనిగిరిలను పారిశ్రామికవాడల ఏర్పాటు, కనిగిరిలో సోలార్ విద్యుత్ తయారు చేసే ప్లాంట్ ఏర్పాటు, ఒంగోలులో విమానాశ్రయం, ఒంగోలులో వెటర్నరీ యూనివర్శిటీ,  మినరల్
► యూనివర్శిటీ, మూలపాడు, మర్రిపాడు రిజర్వాయర్‌కు రూ.20 కోట్లు మంజూరు, టంగుటూరు నుంచి పొదిలికి, కొండపి నుంచి కమ్మపాలెం వరకూ రెండులైన్ల రోడ్డు,  ఏడాదిలోగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అంటూ పలు హామీలు గుప్పించారు. ఇంతవరకూ ఇందులో ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చలేదు.
► ఈ ఏడాది బడ్జెట్‌లో రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేస్తామంటూ తెలుగుదేశం నాయకులు చేసిన ప్రకటనలను ఎద్దేవా చేస్తూ అక్కడ ఏపీటీడీసీ ఆధ్వర్యంలో తీరప్రాంత విహారాన్ని (బీచ్)ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దొనకొండలో నోఫ్రిల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి పరచనున్నట్లు తెలిపారు.

► గత ఏడాది ఒంగోలులో నాన్ మెట్రో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినా ఈ ఏడాది వీటి కోసం నిధులు కేటాయించ లేదు. మరోవైపు రైతన్న చక్రబంధంలో చిక్కుకున్నాడు. వర్షాలు లేకపోవడం, సాగర్ నుంచి నీరు సక్రమంగా రాకపోవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వచ్చిన కొద్దిపాటి పంటలు కూడా అకాల వర్షాలకు దెబ్బతిన్నాయి. ఒకవైపు రుణమాఫీ రాక, మరోవైపు బ్యాంకులు అప్పులు ఇవ్వక, ఇంకోవైపు వర్షాభావ పరిస్థితుల్లో పంటలు చేతికి రాక రైతన్న కుదేలవుతున్నాడు. దీంతో అప్పులపాలైన రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వకుండా కేవలం ప్రచార కార్యక్రమాలతోనే సరిపెడుతున్నారు. ఇటీవల వరకూ స్మార్ట్ గ్రామాల పేరుతో సమావేశాలు పెట్టి హడావిడి చేశారు. ఇప్పుడు ‘నీరు - చెట్టు’ తో కేంద్రప్రభుత్వ నిధులతో  చెరువుల పూడికతీత పనులు, మొక్కలు నాటే పనులకు పరిమితం అవుతున్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వాటిని పూర్తి చేయాలని జిల్లా ప్రజానీకం కోరుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement