ప్రధాని లేఖకు స్పందించని బాబు | Sakshi
Sakshi News home page

ప్రధాని లేఖకు స్పందించని బాబు

Published Thu, Nov 27 2014 4:15 AM

Chandrababu Naidu not responded to PM narendra modi's letter

సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత నారా చంద్రబాబు మాటలకూ చేతలకూ పొంతన ఉండదని మరోసారి రుజువైంది. ప్రతి దానికీ ప్రధానమంత్రిది, తనదీ ఒకే ఆలోచన అని చెప్పుకుంటున్న సీఎం... కేంద్రం చేస్తున్నట్టే మీరూ చేయండని స్వయంగా నరేంద్రమోదీ లేఖరాస్తే మాత్రం పట్టించుకోకుండా పక్కనపెట్టేశారు. వివరాల్లోకి వెళితే... సన్‌సద్ ఆదర్శ గ్రామ యోజన పథకంలో ప్రతి లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడు తమ నియోజకవర్గంలో ఏటా కనీసం ఒక గ్రామం దత్తత తీసుకొని దానిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే తరహాలోనే రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దత్తత తీసుకునే ఏర్పాటు చేయాలంటూ ప్రధాని అక్టోబరు 29వ తేదీన సీఎంకు లేఖ రాశారు.
 
 మోదీ లేఖ రాసి నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం ఈ విషయంలో ఏమాత్రం సానుకూలం వ్యక్తం చేయడంలేదు. మరోవైపు కేంద్రం ప్రతి ఒక్క లోక్‌సభ, రాజ్యసభ సభ్యునికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఏటా రూ.ఐదు కోట్లను కేటాయిస్తుండగా, బాబు సర్కారు వచ్చాక ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల రూపే ణా పైసా కూడా ఇవ్వడంలేదు. గత ఏడాది వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కోటి రూపాయలు చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించేది.

Advertisement
Advertisement