చంద్రబాబు దళిత ద్రోహి
► ఉచితంగా భూములిస్తామని దళితులు, గిరిజనులకు మొండిచేయి
► వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
కొడవలూరు: సీఎం చంద్రబాబు నాయుడు దళిత ద్రోహని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం జరిగిన పార్టీ గ్రామ కమిటీ సమావేశంలో మాట్లాడారు. భూమి లేని షెడ్యూల్ కులాల వారికి భూమి కొనుగోలు పథకం ద్వారాభూములు ఇస్తానని ఎన్నికల మెనిఫెస్టోలో చెప్పారని, ఎన్నికల్లో గట్టెక్కాక ఆ భూమి ధర రూ.5 లక్షలకు మించకూడదని కొర్రీ పెట్టారన్నారు. ప్రస్తుతం భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, రూ.ఐదు లక్షలకు ఎకరా భూమి ఎక్కడా రాదన్నారు. డబ్బుతో ముడిపెట్టకుండా భూమిలేని దళితులకు కొనుగోలు చేసి ఎకరా వంతున ఇవ్వాలని డిమాండ్ చేశారు.
యువత పరిశ్రమలు పెట్టుకునేందుకు రూ.5 కోట్ల వడ్డీ లేని రుణమిస్తానన్న బాబు ఈ రెండేళ్లలో ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సాధారణంగా మంజూరు చేసే రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ దళిత యువకులు కార్పొరేషన్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదన్నారు. ఇది దళిత యువతను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.38 వేల మందికి రూ.171 కోట్ల రుణం ఇవ్వాల్సి ఉండగా, ఈ ఫిబ్రవరి 17 నాటికి కేవలం 2,717 మందికి రూ.16 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. క్రైస్తవ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 2,400 మందికి రూ.12 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 360 మందికి రూ.2.72 కోట్లు ఇచ్చారన్నారు.
గిరిజనులకూ ద్రోహం:
గిరిజనులకు సైతం ద్రోహం చేశారన్నారు. భూమిలేని గిరిజన కుటుంబాలకు ట్రైకార్ సంస్థ రెండెకరాల భూమిని కొనుగోలు చేయించి ఇస్తానని చెప్పారని, ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ఎంత మందికి ఇచ్చారో చెప్పాలన్నారు. గిరిజన యువతులకు వివాహం కుదిరితే రూ.50 వేలు ఇస్తానని చెప్పిన హామీ అమలు కాలేదన్నారు. ప్రతి జిల్లాలో గిరిజన భవన్, గిరిజన యువతకు రూ.5 లక్షల పూచీకత్తు లేని రుణం, రాష్ట్రంలో ప్రత్యేక గిరిజన యూనివర్శిటీ, గిరిజన పిల్లలకు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య, ఆలయాల పూజారులకు రూ.5 వేల గౌరవ వేతనం హామీలు గాల్లో కలిసాయన్నారు.
ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లక్షా 41 వేల మందికి రూ.206 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 2,670 మందికి రూ.24 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, జిల్లా కార్యదర్శి నాపా వెంకటేశ్వర్లునాయుడు, మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, సర్పంచ్ నాగిరెడ్డి రమేష్ పాల్గొన్నారు.