Sakshi News home page

ఎయిర్‌పోర్టుపై గాలి వార్తలు

Published Tue, Oct 31 2023 1:06 AM

- - Sakshi

కడప సిటీ : ఎల్లో మీడియా కడప ఎయిర్‌పోర్టుపై తప్పుడు రాతలు రాసుకుంటూ.. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నంలో ముందు వరుసలో ఉంది. ఉన్న వాస్తవాలను వక్రీకరించి విమాన ప్రయాణికులను ఆందోళనకు గురిచేసే విధంగా వార్తలను ప్రచురిస్తున్నారు. విమానయాన సంస్థ ఇండిగో ఆదివారం నుంచి కడప–హైదరాబాదు విమాన సర్వీసులను నిలిపి వేసిందని, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల వల్లనే నిలిచిపోయాయని చెప్పుకొచ్చారు.

వాస్తవ పరిస్థితి చూస్తే.. నెట్‌వర్క్‌ ప్లానింగ్‌లో భాగంగా విమాన రాకపోకల షెడ్యూల్‌ మారుతుంటుందని ఇండిగో సంస్థ ప్రతినిధి ‘సాక్షి’కి తెలిపారు. మార్చి 31వ తేది నుంచి యథావిధిగా ఈ సర్వీసు ఉంటుందని తెలియజేశారు. అంతవరకు కనెక్టింగ్‌ ఫైట్ల ద్వారా కడప నుంచి హైదరాబాదుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు. సర్వసాధారణంగా ప్రతి ఫ్‌లైట్‌ సర్వీసు మార్చే క్రమంలో ఇలాంటి పరిస్థితి ఉంటుందని వివరించారు.

వక్రీకరించి...
పరిస్థితి ఇలా ఉంటే అందుకు భిన్నంగా ఎల్లో మీడియా వక్రీకరించి విషయాన్ని తప్పుదోవ పట్టించి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. ఉన్న విషయాన్ని ప్రయాణికులకు చెప్పకుండా ఎయిర్‌పోర్టు ఉంటుందో? లేదోనన్న అపోహాను కలిగించే విధంగా ప్రయత్నం చేశారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని, అందువల్లనే ఈ సర్వీసు రద్దు చేశారని రాసుకొచ్చారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంటే మొత్తం అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తారు గానీ.. కేవలం ఒకే ఒక సర్వీసును ఎలా రద్దు చేస్తారని పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

గతంలో కూడా ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని సెప్టెంబరు 15 వరకు విమానాలు నడుస్తాయని, ఆ తర్వాత బుకింగ్‌ ఉండదని రాశారు. కలెక్టర్‌ జోక్యంతో సెప్టెంబరు చివరి వరకు రాకపోకలు కొనసాగిస్తారని, అందులో వారే చెప్పారు. కానీ విమానాల రాకపోకలు ఆగిపోయింది లేదు.. ప్రయాణికులు ఇబ్బంది పడింది లేదు. నిరంతరాయంగా బుకింగ్‌ చేసుకుంటున్నారు. విమాన సర్వీసులు కొనసాగుతూనే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే కేవలం ప్రభుత్వంపై చెడ్డపేరు తీసుకొచ్చి ప్రజల్లో ఒక విధమైన భావన కలిగించేలా చేసే ప్రయత్నమేనని పలువురు మండిపడుతున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement