రుణాలు ఎగ్గొట్టి మా వద్దకా? | Sakshi
Sakshi News home page

రుణాలు ఎగ్గొట్టి మా వద్దకా?

Published Thu, Feb 8 2024 4:55 AM

Telangana High Court comments strongly on MP Raghurama - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  దాదాపు రూ.వెయ్యి కోట్లు రుణాలను తీసుకుని ఎగ్గొట్టిన కేసులో ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజుకు తెలంగాణ హైకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఈసీ) తనను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా ప్రకటించటాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామకృష్ణంరాజునుద్దేశించి ఘాటు వ్యాఖ్య­లు చేసింది.

తమ విచక్షణాధికారాలను ఇలాంటి రుణ ఎగవేతదారులకోసం వినియోగించడానికి సిద్ధంగా లేమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిపై మూడు వారాల్లో రివ్యూ కమిటీని ఆశ్రయించాలని, చట్టానికి అనుగుణంగా కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. సింగిల్‌ జడ్జి ఇ చ్చి న ఆదేశాల్లో తాము జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని పేర్కొంది.
 
రూ.500 కోట్లు దారి మళ్లింపు 
తమిళనాడులోని టుటికోరిన్‌ జిల్లా సత్తాంకుళం తాలూకా సత్తావినల్లూరు, పల్లక్కురిచి గ్రామాల్లో 660 మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు కోసం ఇందు భారత్‌ పవర్‌కు రూ.2,655 కోట్ల రుణాన్ని ఆర్‌ఈసీ మంజూరు చేసింది. పనులు పరిశీలిస్తూ దశల వారీగా ఈ మొత్తాన్ని ఇస్తామని పేర్కొంది. 2014లో ఈమేరకు రూ.947.71 కోట్ల రుణాన్ని అందచేసింది. ఆ సమయంలో రఘురామకృష్ణంరాజు, ఆయన సతీమణి రమాదేవి ఇందు భారత్‌ డైరెక్టర్లుగా ఉన్నారు.

అయితే ఇందులో దాదాపు రూ.500 కోట్లను ఇందు భారత్‌ ఇతర కంపెనీల్లోకి మళ్లించినట్లు ఆర్‌ఈసీ గుర్తించింది. దీంతో తదుపరి విడుదల కావాల్సిన రుణాన్ని నిలిపివేసి ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా ప్రకటించింది. 2015 ఆర్బీఐ మాస్టర్‌ సర్క్యులర్‌ ప్రకారం ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల బ్యాంక్‌ ఖాతాలను సీజ్‌ చేసింది. ఈ సర్క్యులర్‌ జారీ చేస్తే ఇతర ఏ బ్యాంకులూ రుణ ఎగవేతదారులకు ఎలాంటి రుణాలు ఇచ్చే అవకాశం ఉండదు.   

అన్ని అవకాశాలు ఇచ్చాకే పిటిషనర్లకు సర్క్యులర్‌ 
తమను రుణ ఎగవేతదారులుగా గుర్తించి 2022 జూన్‌ 16న సర్క్యులర్‌ జారీ చేయడాన్ని, క్రిమినల్‌ కేసు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ రఘురామకృష్ణంరాజు, రమాదేవి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి అన్ని అవకాశాలు ఇ చ్చి న తర్వాతే ఆర్‌ఈసీ కమిటీ పిటిషనర్లకు సర్క్యులర్‌ జారీ చేసిందని స్పష్టం చేశారు. చట్టప్రకారమే ఆర్‌ఈసీ వ్యవహరించిందని, ఆ సర్యు్కలర్‌లో జోక్యం చేసుకునేందుకు తమకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేస్తూ రఘురామకృష్ణంరాజు, రమాదేవి పిటిషన్లను కొట్టి వేశారు.

ఆర్‌ఈసీ రుణం మంజూరు చేసే నాటికి పిటిషనర్లు ఇద్దరూ డైరెక్టర్లుగా ఉన్నారన్న వాదనతో ఏకీభవించారు. సింగిల్‌ జడ్జి తీర్పుపై పిటిషనర్లు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు వెలువరించింది.

సింగిల్‌ జడ్జి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తీర్పునిచ్చారని, అందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. రివ్యూ కమిటీని ఆశ్రయించకుండా తమ వద్దకు రావడాన్ని న్యాయ­స్థానం తప్పుబట్టింది. రివ్యూ కమిటీ చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేస్తూ రఘురామకృష్ణంరాజు, రమాదేవి, డి.మధుసూదన్‌రెడ్డి అప్పీళ్లలో వాదనలను ముగించింది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement