మేయర్‌ ఫోన్‌ చేస్తే మాట్లాడవా? నా చాంబర్‌ ఎదుట30 నిమిషాలు నిల్చో! | Sakshi
Sakshi News home page

మేయర్‌ ఫోన్‌ చేస్తే మాట్లాడవా? నా చాంబర్‌ ఎదుట30 నిమిషాలు నిల్చో!

Published Thu, Jan 4 2024 4:43 AM

MGM superintendent punishes PG medical student - Sakshi

ఎంజీఎం: ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ తన తండ్రి వృత్తిని కించపరుస్తూ తనను డీఎంఓ వచ్చే వరకు 30 నిమిషాలు ఆయన చాంబర్‌ ఎదుట నిల్చోబెట్టాడని కాకతీయ మెడికల్‌ కాలేజీలో జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న డాక్టర్‌ వీర ప్రసాద్‌ ఆరోపించడం కలకలం రేపింది. మనస్తాపానికి గురైన ప్రసాద్‌ తన పీజీ సీటు వదిలేస్తానని లేఖ రాసి.. తనకు అవమానం జరిగిందంటూ జూడా ప్రతినిధు లకు ఫిర్యాదు చేశాడు.

ఆ ఫిర్యాదు విషయం బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సదరు లేఖ, ఫిర్యాదులోని వివరాల ప్రకారం..’’ ఈ నెల రెండో తేదీన వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో డ్యూటీలో ఉండగా ఓ రోగి ఛాతీనొప్పితో రావడంతో పరీక్షిస్తున్నాను. సరిగ్గా అదే సమయంలో అటెండర్‌ ఫోన్‌ తీసుకువచ్చి మేయర్‌ మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పగా.. రోగికి వైద్యం అందించగానే మాట్లాడతానని చెప్పాను.

వెంటనే ఫోన్‌ తీసుకోలేదన్న కారణంగా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌.. నన్ను చాంబర్‌ దగ్గరికి పిలిపించాడు. నా తండ్రి వృత్తిని పేర్కొంటూ వ్యక్తిగతంగా కించపరిచాడు.  డీఎంఓ వచ్చే వరకు 30 నిమిషాలు తన చాంబర్‌ ఎదుట నిలుచోబెట్టి తీవ్రంగా అవమాపరిచాడు’ అని ఆ లేఖ, ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ చదవడంకంటే పీజీ సీటు వదిలేసుకోవడం ఉత్తమమని పేర్కొన్నాడు.

ప్రజాప్రతినిధుల ఫోన్‌లకు స్పందించాలని చెప్పారంతే: ఆర్‌ఎంఓ శ్రీనివాస్‌
ఆర్‌ఎంఓ డాక్టర్‌ శ్రీనివాస్‌ ఈ ఘటనపై స్పందించారు. సదరు పీజీ వైద్యుడితో సూపరింటెండెంట్‌ దురుసుగా ప్రవర్తించలేదని, సాధారణంగా  పీజీ విద్యార్థి ఏ స్థాయి నుంచి వచ్చారో అనే కోణంలో ప్రశ్నించారని తెలిపారు. చాంబర్‌ ముందు 30 నిమిషాలు ఉండమన్నందుకు సదరు విద్యార్థి మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి కాబట్టి ప్రజాప్రతినిధుల ఫోన్‌లకు స్పందించాలని చెప్పారే తప్ప వ్యక్తిగతంగా దూషించలేదని వివరణ ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement