నేతల పనితీరుపై ఆరా.. కారెలా నడుస్తోంది? | Sakshi
Sakshi News home page

నేతల పనితీరుపై ఆరా.. కారెలా నడుస్తోంది?

Published Tue, Jul 18 2023 3:19 AM

CM KCR focus on BRS situation at field level - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై భారత్‌ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. తన కేబినెట్‌ సహచరులతో వరుస భేటీలు జరుపుతున్నారు. ప్రగతి భవన్‌ వేదికగా ఉమ్మడి జిల్లాల వారీగా జరుపుతున్న సమావేశాల్లో నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై లోతుగా చర్చిస్తున్నారు. ఇప్పటివరకు నల్లగొండ, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్‌ జిల్లాలకు సంబంధించిన సమీక్షలు పూర్తయినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వివిధ సర్వే సంస్థలు, నిఘావర్గాల ద్వారా అందిన నివేదికలు, ఏప్రిల్, మే నెలల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనాలపై పార్టీ ఇన్‌చార్జిలు ఇచ్చిన రిపోర్టుల్లోని అంశాలు ఈ భేటీల్లో ప్రస్తావనకు వస్తున్నాయి.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ఇతర కీలక నేతల పనితీరు, నియోజకవర్గ స్థాయిలో వారి నడుమ సమన్వయ లోపం వంటి అంశాలపై మంత్రుల అభిప్రాయాలను సీఎం తెలుసుకుంటున్నారు. మంత్రులు కూడా తమ దృష్టికి వచ్చిన అంశాలను తెలియజేయడంతో పాటు ఎమ్మెల్యేల పనితీరుపై తమ మనోగతాన్ని వెల్లడిస్తున్నారు. ఎమ్మెల్యేల ఏకపక్ష ధోరణి కారణంగా చాలాచోట్ల పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోందనే అభిప్రాయం ఈ భేటీల్లో వ్యక్తమవుతోంది.

కొన్నిచోట్ల పార్టీ నేతలు గ్రూపులను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యేలకు ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారని కేసీఆర్‌కు మంత్రులు తెలిపారు. కాగా పార్టీకి నష్టం చేస్తున్న నేతల వివరాలను సేకరిస్తున్న ముఖ్యమంత్రి, వారి విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై దిశా నిర్దేశం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నియోజకవర్గాల వారీగా విపక్ష పార్టీల బలాలు, బలహీనతలపై కూడా ఈ భేటీల్లో చర్చిస్తున్నట్లు తెలిసింది.  

అవసరమైన చోట చేరికలకు గ్రీన్‌ సిగ్నల్‌ 
సర్వే సంస్థల నివేదికలు, వివిధ నిఘా సంస్థల రిపోర్టుల ఆధారంగా, నియోజకవర్గాల వారీగా బీఆర్‌ఎస్, విపక్షాల బలాలు, బలహీనతలపై కేసీఆర్‌ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల ద్వారా ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించాల్సిందిగా మంత్రులను ఆదేశించినట్లు తెలిసింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు విఫలమైన చోట ఇతరులకు టికెట్‌ కేటాయించే అంశంపై మాత్రం ఈ భేటీల్లో సీఎం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిసింది.

పార్టీకి ఉపయోగపడతారని భావించే అసంతృప్త నేతలతో మాట్లాడి వారు పార్టీలోనే ఉండేట్టుగా చూడటంతో పాటు ఇతర పార్టీల్లో ప్రజాదరణ కలిగిన నేతలతో సంప్రదింపులు జరపాలనే సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. కేవలం క్షేత్ర స్థాయి పరిస్థితులకే పరిమితం కాకుండా ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పార్టీ మేనిఫెస్టో, ప్రచార వ్యూహం ఖరారు వంటి అంశాలపై కూడా కేసీఆర్‌ దృష్టి సారించారు.

మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై మంత్రుల నుంచి సీఎం అభిప్రాయాలు కోరుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, వాటి ప్రభావం, చేపట్టాల్సిన మార్పులు చేర్పులు తదితర అంశాలపై తన అభిప్రాయాలను కూడా ఈ భేటీల్లో కేసీఆర్‌ వెల్లడిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఎమ్మెల్యేలు, కీలక నేతలకు కేటీఆర్‌ క్లాస్‌ 
సీఎం కేసీఆర్‌ ఇలా మంత్రులతో వరుస భేటీలు జరుపుతుండగా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు.. పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలతో సమావేశమవుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు అందుతుండటం, టికెట్‌ను ఆశిస్తున్న నేతల నడుమ ఆధిపత్య పోరుపై ఆయన దృష్టి సారించారు. వివాదాస్పద ప్రకటనలు, పనులతో తరచూ వార్తలకెక్కుతున్న ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు కేటీఆర్‌ తరఫున ఫోన్లు వెళ్తున్నాయి. ఈ మేరకు ప్రగతిభవన్‌కు వస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు కేటీఆర్‌ సీరియస్‌గా క్లాస్‌ తీసుకుంటున్నారు.

ఎమ్మెల్యేలు రాజయ్య, శంకర్‌ నాయక్, రెడ్యా నాయక్, రోహిత్‌రెడ్డి, చెన్నమనేని రమేశ్‌ తదితరులు ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. టికెట్ల కేటాయింపు అంశం అధినేత కేసీఆర్‌ చూసుకుంటారని, వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండాలని కేటీఆర్‌ స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 20 నుంచి జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించే వ్యూహంపై చర్చించేందుకు కేసీఆర్‌ మంగళవారం లేదా బుధవారం పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement