Sakshi News home page

దక్షిణాదిలో ఇంజనీరింగ్‌  దర్జా..

Published Thu, Aug 17 2023 1:58 AM

After the degree students are in the craze for foreign education - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్‌ విద్యకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందులోనూ సాఫ్ట్‌వేర్‌ రంగాన్నే ఎంచుకుంటున్నారు. విదేశీ విద్య, అక్కడే స్థిరపడాలన్న ఆకాంక్ష దక్షిణాది రాష్ట్రాల విద్యార్థుల్లోనే ఎక్కువగా కన్పిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులు మాత్రం వివిధ కోర్సులతో కూడిన కాంబినేషన్‌ డిగ్రీలు, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులను ఎంచుకుంటున్నారు.

ప్రతి విభాగంలోనూ పాలనాపరమైన ఉద్యోగాల్లో స్థిరపడాలన్న ఆకాంక్ష వెలిబుచ్చుతున్నారు. సాంకేతిక విద్య వైపు ఎక్కువగా మొగ్గు చూపకపోవడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ కాలేజీలు, సీట్లు తగ్గుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఈ మేరకు కోర్సుల్లో మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వానికి ఏఐసీటీఈ సూచించింది.

సగానికిపైగా ఇక్కడే..
దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్‌ సీట్లు (2022 గణాంకాలు) అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6,74,697 సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్‌మెంట్‌ కోర్సులకు సంబంధించిన సీట్లు దేశవ్యాప్తంగా 3,39,405 ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. 2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్‌ సీట్లు ఉంటే, కేవలం ఆరేళ్ళలో అవి 5.3 శాతం పెరిగాయని మండలి గుర్తించింది.

దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్‌ తర్వాత తక్షణ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ లేదా ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఉండే ఇంజనీరింగ్‌ సీట్లలో 54 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో విద్యార్థులు ఒకే విధమైన కోర్సుల్లో చేరుతున్నారు.

ముఖ్యంగా బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బీటెక్‌)ని, ఎంబీఏ, ఎంసీఏను ఎంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్‌ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు మాత్రం ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. ఆ తర్వాత పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే సివిల్స్‌ వంటి పోటీ పరీక్షకు ఉత్తరాదిలోనే ఎక్కువగా శిక్షణ కేంద్రాలు ఉంటున్నాయని తేలింది.  

విదేశాలు లేదా సాఫ్ట్‌వేర్‌.. 
బీటెక్‌ పూర్తయిన వెంటనే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు స్వదేశంలో ఎంటెక్‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎక్కువ మంది విదేశాలకు వెళ్తున్నారు. బీటెక్‌లో బ్రాంచీ ఏదైనా విదేశాల్లో మాత్రం సాఫ్ట్‌వేర్‌ అనుబంధ బ్రాంచీల్లోనే ఎంఎస్‌ పూర్తి చేస్తున్నారు. గత ఐదేళ్ళుగా సగటున 4 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, దక్షిణాది రాష్ట్రాల నుంచి 2.8 లక్షల మంది ఉన్నారని, ఇందులో బీటెక్‌ నేపథ్యం ఉన్న వాళ్ళు 1.50 లక్షల మంది ఉన్నారని ఏఐసీటీఈ పరిశీలనలో తేలింది ఎంఎస్‌ చేసేటప్పుడే పార్ట్‌ టైం ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నారు.

ఎంఎస్‌ పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్‌లో స్థిరపడుతున్న వారిలో దక్షిణాది విద్యార్థులదే ముందంజ అని మార్కెట్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా కాలేజీల్లో సంప్రదాయ కోర్సుల సీట్లు మిగిలిపోతున్నాయి. ఏదేమైనా ఉత్తర, దక్షిణ రాష్ట్రాల్లో నెలకొన్న వ్యత్యాసంపై మరింత అధ్యయనం అవసరమని ఏఐసీటీఈ భావిస్తోంది. 

Advertisement

What’s your opinion

Advertisement