IPL 2024 CSK Vs RCB : చెన్నైలో ఐపీఎల్‌ ఫీవర్‌.. ఉచిత ప్రయాణం | IPL 2024 Opener: Chennai Super Kings Vs Royal Challengers Bangalore Match At Chepauk Stadium- Sakshi
Sakshi News home page

IPL 2024 CSK Vs RCB : చెన్నైలో ఐపీఎల్‌ ఫీవర్‌

Published Fri, Mar 22 2024 9:45 AM

తొలిమ్యాచ్‌కు సిద్ధమైన చిదంబరం స్టేడియం  - Sakshi

చేపాక్‌ స్టేడియంలో తొలి మ్యాచ్‌

బెంగళూరును ఢీ కొట్టనున్న ఆతిథ్యజట్టు

కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌

చెన్నై బస్సులలో ఉచితం

అర్ధరాత్రి వరకు రైలు సేవలు

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు శుక్రవారం తెరలేవనుంది. చిదంబరం స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చైన్నె సూపర్‌కింగ్స్‌తో రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఈ మ్యాచ్‌కు అతిథ్యం ఇస్తున్న చైన్నె నగరంలో క్రికెట్‌ ఫీవర్‌ తారస్థాయికి చేరింది.

సాక్షి, చైన్నె: ఐపీఎల్‌ –17వ సీజన్‌కు వేళైంది. చేపాక్కం చిదంబరం స్టేడియంలో మ్యాచ్‌ల వీక్షణకు అభిమానులు సిద్ధమయ్యారు. శుక్రవారం సాయంత్రం నుంచే సంబరాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి తొలి మ్యాచ్‌లో చైన్నె సూపర్‌ కింగ్స్‌ను ఢీ కొట్టేందుకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సిద్ధమైంది. వివరాలు.. తమిళనాట క్రికెట్‌ అభిమానులకు కొదవ లేదు. జాతీయ స్థాయి పోటీలతో పాటు ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించేందుకు స్టేడియానికి అభిమానులు వేలాదిగా ఎగబడుతారు.

ఇక చైన్నె సూపర్‌కింగ్స్‌ జట్టు తమదే అన్నట్లు అభిమానులు భావిస్తుంటారు. ప్రస్తుత 17వ ఐపీఎల్‌ సీజన్‌లో విడుదలైన జాబితా మేరకు చైన్నెలో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో తొలి మ్యాచ్‌ శుక్రవారం రాత్రి నిర్వహిస్తారు. ఇందులో 16వ సీజన్‌ ఛాంపియన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ నేతృత్వంలో చైన్నె సూపర్‌ కింగ్స్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఢీకొట్టనుంది. ఈ సీజన్‌కు కూడా ఎంఎస్‌ ధోనీ కెప్టెన్‌గా ఉంటారని భావించిన అభిమానులకు చైన్నె యాజమాన్యం గురువారం సాయంత్రం షాక్‌ ఇచ్చింది.

సంబరాలతో తొలి మ్యాచ్‌

చేపాక్కం స్టేడియంలో 50 వేల మంది మ్యాచ్‌ను తిలకించేందుకు అవకాశం ఉంది. గత సీజన్‌లో టికెట్లు బ్లాక్‌ మార్కెట్లో ప్రత్యక్షం కావడంతో వివాదం ఏర్పడింది. దీంతో ఈసారి టికెట్ల విక్రయాలన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహించారు. ఇందులోనూ పెద్దఎత్తున గోల్‌మాల్‌ జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. నకిలీ వెబ్‌సైట్ల ద్వారా టికెట్ల విక్రయాలు సాగించినట్లు విమర్శలు వచ్చాయి. అయితే వీటన్నింటినీ పక్కనబెడితే టికెట్ల పొందిన అభిమానులు మాత్రం స్టేడియంలో సందడి చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే స్టేడియంలో పరుగుల వరద కురిపించేందుకు క్రికెటర్లు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇరు జట్ల సభ్యులు చైన్నెకు చేరుకుని కఠోర సాధన చేశాయి. శుక్రవారం జరిగే మ్యాచ్‌ కారణంగా చేపాక్కం పరిసరాలలో ఇప్పటికే ట్రాఫిక్‌ మార్పులు చేశారు. అభిమానులు సాయంత్రం ఐదు గంటలలోపు స్టేడియానికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ముందుగా స్టేడియంలో సంబరాలు మిన్నంటనున్నాయి. సంగీత మాంత్రీకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీత విభావరితో పాటు అక్షయ కుమార్‌ సహా ఇతర బాలీవుడ్‌ స్టార్స్‌ సందడి చేయనున్నారు. తొలి మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ దృష్ట్యా, అభిమానుల కోసం చైన్నె ఫ్రాంచేజీ వర్గాలు ఎంటీసీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో చేపాక్కం వైపుగా వెళ్లే అభిమాను లు మ్యాచ్‌ టికెట్టును చూపించి చైన్నె నగర రవాణా సంస్థ బస్సులలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. అలాగే అభిమానుల కోసం అర్ధరాత్రి వరకు మెట్రో, ఈఎంయూ రైళ్ల సేవలకు ఏర్పాట్లు చేశారు. కాగా ఈనెల 26వ తేదీన జరిగే మ్యాచ్‌లో చైన్నె సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు పోటీ పడనున్నాయి.

అనూహ్యంగా..

ఎంఎస్‌ ధోనీకి బదులుగా కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ను ప్రకటించారు. ఇక 15వ సీజన్‌లో కెప్టెన్‌గా జడేజా కొన్ని మ్యాచ్‌లకు వ్యవహరించాడు. అయితే ఆ సమయంలో వరుస ఓటములు ఎదురు కావడంతో మళ్లీ కెప్టన్‌గా బాధ్యతలు ఎంఎస్‌ స్వీకరించాడు. ఈ పరిస్థితులలో తాజాగా మళ్లీ కెప్టెన్‌ మారడంతో.. చైన్నె సూపర్‌ కింగ్స్‌లో ధోనికి ఇదే చివరి సీజన్‌ అనే ప్రచారం ఊపందుకుంది. దీంతో తమ అభిమాన క్రికెటర్‌ ధోనీ కోసం వేలాది మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. అలాగే ఆర్‌సీబీ తరపున విరాట్‌ కోహ్లి ఆడుతుండడంతో ఆయన అభిమానులు స్టేడియంలో సందడి చేయడానికి రెడీ అయ్యారు.

Advertisement
Advertisement