'దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. అతడు ఉంటే కథ వేరేలా ఉండేది' | Sunil Gavaskar Feels India Missing Ajinkya Rahane After Early Collapse Against South Africa In Centurion 2023 - Sakshi
Sakshi News home page

IND Vs SA: 'దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. అతడు ఉంటే కథ వేరేలా ఉండేది'

Published Wed, Dec 27 2023 9:09 AM

Sunil Gavaskar feels India missing Ajinkya Rahane after early collapse against South Africa - Sakshi

సెంచూరియన్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు భారత బ్యాటర్లకు దక్షిణాఫ్రికా పేస్‌ దళం చుక్కలు చూపించారు. సఫారీ పేస్‌ దళం దెబ్బకు భారత టాపర్డర్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ మాత్రం బౌలర్లు నిప్పులు చేరుగుతున్న చోట.. తన బ్యాటింగ్‌ సత్తాతో ఎదురు నిలిచాడు.

కేఎల్‌ రాహుల్‌(70) క్రీజులో ఉన్నాడు. అతడి అద్భుత పోరాటం ఫలితంగా టీమిండియా తొలి రోజు ఆటముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌ 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబాడ ఐదు వికెట్లతో చెలరేగాడు.

తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మ(5), యశస్వీ జైశ్వాల్‌(17), శుబ్‌మన్‌ గిల్‌ తీవ్ర నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునీల్‌ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటువంటి కష్టతరమైన పరిస్థితులలో వెటరన్‌ ఆటగాడు అజింక్యా రహానే జట్టులో ఉంటే బాగుండేది అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

"ఈ జట్టులో అజింక్యా రహానే ఉండాల్సింది. విదేశీ పరిస్థితుల్లో రహానేకు చాలా అనుభవం ఉంది.  అతడు ఈ టెస్టులో కూడా ఉండి కథ పూర్తి భిన్నంగా ఉండేది. ఎందుకంటే ఐదేళ్ల క్రితం(2018-19) జోహన్నెస్‌బర్గ్ టెస్టులో పిచ్‌ గురించి పెద్దు ఎత్తున చర్చనడిచింది. అప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను.

దక్షిణాఫ్రికా బౌలర్లు నిప్పులు చేరిగారు. అటువంటి బౌన్సీ పిచ్‌లపై బ్యాటింగ్‌ చేయడం అంత ఈజీ కాదు. కానీ రహానే మాత్రం అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన రహానే.. మూడో టెస్టుకు జట్టులోకి వచ్చి కీలకమైన 48 పరుగులతో టీమిండియాను గెలిపించాడని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నాడు.

కాగా రహానే చివరగా భారత తరుపున ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఆడాడు. ఈ సిరీస్‌లో  రహానే తీవ్ర నిరాశపరిచాడు. రెండు టెస్టులు కలిపి కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సౌతాఫ్రికా సిరీస్‌కు రహానేను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు.

Advertisement
Advertisement