హార్దిక్‌ తిరిగొచ్చినా వరల్డ్‌కప్‌లో ఆడేది అతడే: టీమిండియా దిగ్గజం | Sakshi
Sakshi News home page

అతడు ఎవరినీ కాపీ కొట్టడం లేదు.. హార్దిక్‌ తిరిగొస్తే తలనొప్పి: టీమిండియా దిగ్గజం

Published Tue, Jan 16 2024 6:37 PM

Shivam Dube Making Sure He Is In T20 WC Squad Even If Hardik Fit: Gavaskar - Sakshi

T20 WC 2024: టీమిండియా ఆల్‌రౌండర్‌ శివం దూబేపై భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ప్రశంసలు కురిపించాడు. అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న ఈ ముంబై బ్యాటర్‌... టీ20 ప్రపంచకప్‌-2024 జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అంచనా వేశాడు. ఇలాగే ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగితే సెలక్టర్లు అతడిని పక్కనపెట్టే సాహసం చేయలేరని పేర్కొన్నాడు.

కాగా 2019లో బంగ్లాదేశ్‌ టూర్‌ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు పేస్‌ ఆల్‌రౌండర్‌ శివం దూబే. ఢిల్లీ వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అదే విధంగా ఒక్క వికెట్‌​ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత అడపాదడపా వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

పాండ్యా గాయం.. దూబే పాలిట వరం!
దీంతో బీసీసీఐ సెలక్టర్లు శివం దూబేను పక్కనపెట్టారు. అయితే, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున గతేడాది సత్తా చాటిన దూబేను.. హార్దిక్‌ పాండ్యా గాయం రూపంలో అదృష్టం వరించింది. ప్రపంచకప్‌-2024కు ముందు స్వదేశంలో టీమిండియా అఫ్గనిస్తాన్‌తో ఆడుతున్న టీ20 సిరీస్‌కు పాండ్యా దూరమయ్యాడు.

చీలమండ నొప్పి కారణంగా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యా స్థానంలో పేస్‌ ఆల్‌రౌండర్‌గా శివం దూబేకు అవకాశం వచ్చింది. అయితే, పునరాగమనంలో దూబే తప్పులను పునరావృతం చేయలేదు.

వరుస హాఫ్‌ సెంచరీలు
మొహాలీ వేదికగా తొలి టీ20లో ఒక వికెట్‌ తీయడంతో పాటు.. లక్ష్య ఛేదనలో దంచికొట్టాడు. కేవలం 40 బంతుల్లోనే 60 పరుగులు రాబట్టి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇక రెండో టీ20లోనూ ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన శివం దూబే.. ఒక వికెట్‌ పడగొట్టడంతో పాటు.. 32 బంతుల్లోనే 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోసారి జట్టును గెలిపించాడు. తద్వారా టీమిండియా 2-0తో సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

సెలక్టర్లకు తలనొప్పి
ఇక బుధవారం నాటి మూడో టీ20లోనూ సత్తా చాటి.. ఆపై ఐపీఎల్‌-2024లోనూ అద్భుతాలు చేస్తే దూబేకు తిరుగు ఉండదు. ఈ నేపథ్యంలో సునిల్‌ గావస్కర్‌ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ హార్దిక్‌ పాండ్యా ఫిట్‌గా లేకపోతే టీమిండియా పరిస్థితి ఏంటి? అని మనమంతా ఆందోళనకు గురయ్యాం.

కానీ.. ఇప్పుడు హార్దిక్‌ పూర్తి ఫిట్‌గా ఉన్నా శివం దూబే అమెరికా ఫ్లైట్‌ ఎక్కడం ఖాయం. ఇలాగే తన ప్రదర్శనను కొనసాగిస్తే... అతడిని జట్టు నుంచి తప్పించాలన్న ఆలోచనే రాదు. 

హార్దిక్‌ తిరిగి వస్తే సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. గత రెండు మ్యాచ్‌లతో దూబే తన స్థాయిని పెంచుకున్నాడు. తనదైన శైలిలో ఆడుతూ విజయవంతమవుతున్నాడు. ఎవరినీ అనుకరించే ప్రయత్నం చేయడం లేదు. ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోవడానికి తానేం చేయాలో అంతా చేస్తున్నాడు’’ అని పేర్కొన్నాడు. కాగా జూన్‌ 4 నుంచి అమెరికా-వెస్టిండీస్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌-2024 ఆరంభం కానుంది.

చదవండి: లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి..

Advertisement
Advertisement