ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చేశారు.. ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

‘అబ్‌ కీ పార్‌ చార్‌ సౌ పార్‌’ అని తెలంగాణ నినదిస్తోంది: ప్రధాని

Published Sat, Mar 16 2024 12:58 PM

Pm modi speech at nagar karnool vijaysankalpa yatra - Sakshi

సాక్షి,నాగర్‌కర్నూల్‌: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించకముందే దేశ ప్రజలు తీర్పు ఇచ్చేశారని, మూడోసారి మోదీయే ప్రధాని అని నిర్ణయించారని ప్రధాని అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌ బీజేపీ విజయసంకల్ప సభలో మోదీ ప్రసంగించారు. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అని  మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ ప్రజలు కూడా ఈసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో  చార్‌సౌ పార్‌( నాలుగు వందలు దాటి) అని నినదిస్తున్నారన్నారు. 

సభలో మోదీ మాట్లాడుతూ ‘ నిన్న(మార్చ్‌15) మల్కాజ్‌గిరి రోడ్‌ షోలో నిన్న జన ప్రవాహాన్ని చూశాను. యువకులు, మహిళలు, వృద్ధులు చాలా మంది రోడ్ల మీద నిల్చొని బీజేపీకి మద్దతు తెలిపారు. మల్కాజ్‌గిరిలో అద్భుతం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలపుడు బీఆర్‌ఎస్‌ మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో చూశాను. మోదీని మూడోసారి ప్రధాని చేయడానికి ఇప్పుడు అంతే ఉత్సాహంతో  వేచి చూస్తున్నారు.

గత పదేళ్లలో కేంద్ర పథాకాలు తెలంగాణ ప్రజలకు చేరకుండా అవినీతి, అబద్ధాల కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అడ్డుకున్నాయి. ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్‌ అంబేద్కర్‌ను ఓడించింది. గిరిజన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఓడించాలని చూశారు. కాంగ్రెస్‌ తెలంగాణలో ఎస్సీ వర్గానికి చెందిన ప్రస్తుత డిప్యూటీ సీఎంను కూడా ఇప్పుడు అవమానిస్తోంది. కాంగ్రెస్‌ నేతలు పైన కూర్చుంటారు. ఎస్సీ వర్గానికి చెందిన డిప్యూటీ సీఎంను కింద కూర్చోబెడతారు. బీఆర్‌ఎస్‌ కూడా కాంగ్రెస్‌ బాటలో వెళ్లే పార్టీనే.

తెలంగాణను గేట్‌ వే ఆఫ్‌ సౌత్‌ అని పిలుస్తారు. గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధి మోదీ ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉంది. కానీ పదేళ్లలో తెలంగాణ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య నలిగిపోయింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి తెలంగాణ ప్రజల కలలను చిన్నాభిన్నం చేశారు. ఇక్కడి నుంచి బీజేపీ ఎంపీలు గెలిస్తే రానున్న రోజుల్లో  కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆటలు సాగవు.

ఇందుకే ఇక్కడ బీజేపీ ఎంపీలు గెలవాల్సి ఉంది. తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఎంపీలుంటే నేను మీకు చాలా సేవ చేయడానికి వీలవుతుంది. ఎక్కువ మంది ఎంపీలు గెలిస్తే మీ ఆకాంక్ష ఢిల్లీలో నాకు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఓట్లు రెండింతలు చేశారు. ఈసారి బీజేపీకి రెండంకెల ఎంపీ సీట్లివ్వండి. నా ప్రసంగాలు ఎక్స్‌(ట్విటర్‌)లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సాయంతో తెలుగులో వినండి.

కేసీఆర్‌ రాజ్యాంగాన్ని  మార్చాలంటున్నాడు. అంబేద్కర్‌ను అవమానిస్తున్నాడు. దళితబంధుతో కేసీఆర్‌ దళితులను మోసం చేశాడు. బీఆర్‌ఎస్‌ దళితున్ని సీఎం చేస్తానని చేయలేదు. కుటుంబ పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ స్కాముల్లో భాగస్వాములు, కాంగ్రెస్‌ 2జీ కుంభకోణం చేస్తే బీఆర్‌ఎస్‌ నీటి పారుదల ప్రాజెక్టులో అవినీతి చేసింది. రాష్ట్రం బయటికి వెళ్లి అవినీతి పార్టీలతో కలిసి అవినీతి చేశారు. ఈ నిజాలు రోజు మన ముందు బయటపడుతూనే ఉన్నాయి.

మోదీ మీ దగ్గర ఓటు తీసుకుని కుటుంబ సభ్యులకు కుర్చీ ఇవ్వడు. వారి బ్యాంకు బ్యాలెన్సులు పెంచడు.140 కోట్ల మంది మోదీ కుటుంబ సభ్యులే. మోదీ కుర్చీలో కూర్చొని సుఖ పడడు. చాలా కాలం సీఎంగా, ఇప్పుడు పీఎంగా నాకు సేవ చేసే అవకాశమిచ్చారు. ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా నేను నా కోసం వాడుకోలేదు.

నేను ఏమైనా చేశానంటే, రాత్రి పగలు కష్టపడ్డానంటే 140 కోట్ల మంది ప్రజల కోసమే. ఇందుకే మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీ పూర్తి చేసే గ్యారెంటీ. ఆర్టికల్‌ 370 రద్దు చేస్తామంటే చేశాం. రాముడు సొంతింటికి  వస్తాడని చెప్పాం. వచ్చాడు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో అగ్రభాగంలో నిలిపాం. ఇది మోదీ గ్యారెంటీ . తెలంగాణలో పేదల కోసం ఒక కోటి బ్యాంకు ఖాతాలు తెరిచాం. తెలంగాణలో 1 కోటి 50 లక్షల మందికి బీమా చేశాం. తెలంగాణలో 67 లక్షల కంటే చిన్న వ్యాపారులకు ముద్ర రుణాలు వచ్చాయి. 80 లక్షల కంటే ఎక్కువ మందికి ఆయుష్మాన్‌ భారత్‌​ లబ్ధి చేకూరింది. 

తెలంగాణ ప్రజలకు నేను మాటిస్తున్నాను. ఒక్క అవినీతి పరున్ని వదలను. అవినీతిపై పోరాడేందుకు నాకు ఆశీర్వాదం ఇవ్వండి. నాగర్‌కర్నూల్‌, సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులను  గెలిపించండి’ అని మోదీ విజ్ఞప్తి చేశారు.  ఈ సభలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్‌ కిషన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement