డిసెంబర్‌ 7న అసెంబ్లీ ఎన్నికలు! | Telangana Assembly Elections On December 7, Ceo Provisional Election Schedule Viral - Sakshi
Sakshi News home page

Telangana Assembly Elections: డిసెంబర్‌ 7న అసెంబ్లీ ఎన్నికలు!

Published Mon, Sep 25 2023 4:03 AM

Assembly elections on December 7 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ‘అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌ 7న జరుగుతాయి. దీనికి సంబంధించి నవంబర్‌ 12న ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించి 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత నవంబర్‌ 22న తుది అభ్యర్థుల జాబితా(ఫారం–7ఏ) ప్రకటిస్తారు. డిసెంబర్‌ 11న ఓట్లు లెక్కించి ఫలితాల ప్రకటిస్తారు’..

రాష్ట్ర శాసనసభ ఎన్నికల కసరత్తులో భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయం రూపొందించుకున్న ఓ తాత్కాలిక ఎన్నికల షెడ్యూల్‌ మాత్రమే ఇది. దీనిని అనుసరించే ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ కార్యక్రమాలకు గడువు కూడా నిర్దేశించారు. దీనికి సంబంధించిన ఫ్లెక్సీని ముద్రించి కార్యాలయ ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచారు. రాష్ట్ర శాసనసభకు 2018లో జరిగిన సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ సైతం ఇదే కావడం గమనార్హం. అయితే కొన్నిరోజులు అటుఇటుగా ఇదే షెడ్యూల్‌తో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.

వాస్తవానికి తెలంగాణతోసహా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నిర్వహణకు అక్టోబర్‌ తొలివారం లేదా ఆ తర్వాత ఎప్పుడైనా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశముంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను పరిశీలించడానికి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలో ఎలక్షన్‌ కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌తో కూడిన కేంద్ర ఎన్నికలసంఘం ఫుల్‌ బెంచ్‌ అక్టోబర్‌ 3 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఆ తర్వాత వాస్తవ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తారు.  

ఇదీ ఎన్నికల సంఘం వర్క్‌ కేలండర్‌  
నిర్దిష్ట తేదీలు/గడువులతో వచ్చే అక్టోబర్‌ టు డిసెంబర్‌ వరకు రోజువారీగా చేయాల్సిన కార్యాక్రమాలతో ఎన్నికల సంఘం ఓ కేలండర్‌ రూపొందించింది.  

అక్టోబర్‌లోగా ఈ పనులు పూర్తవ్వాలి  
ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాట్‌లకు ప్రథమస్థాయి తనిఖీలు పూర్తయ్యాయి. ఎన్నికల సామగ్రి సమీకరణ, బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు ప్రింటింగ్‌ ప్రెస్‌ ఎంపిక, స్ట్రాంగ్‌ రూమ్స్, కౌంటింగ్‌ కేంద్రాల పరిశీలన/నిర్థారణ, దర్యాప్తు సంస్థల నోడల్‌ అధికారులు/సహాయ వ్యయ పరిశీలకులు/ వ్యయ పర్యవేక్షణ బృందాలు/ రిటర్నింగ్‌ అధికారులు/సెక్టార్‌ అధికారులకు వేర్వేరుగా శిక్షణ, జిల్లాలకు నిధుల కేటాయింపు, అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించిన ధరల ఖరారు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌/స్టాటిక్‌ సర్వేలియన్స్‌ టీమ్స్‌/వీడియో సర్వేలియన్స్‌ టీమ్‌ల ఏర్పాటు తదితర పనులన్నీ వచ్చే అక్టోబర్‌నెలలోగా పూర్తి చేయాలని సీఈఓ కార్యాలయం నిర్దేశించుకుంది.     

నవంబర్‌లో..  
నవంబర్‌లో వివిధ స్థాయిల్లోని పోలీసు అధికారులకు శిక్షణ, పోలింగ్‌ సిబ్బందికి నియామక ఆదేశాల జారీ, సోషల్‌ మీడియాపై పర్యవేక్షణ, ఈవీఎంల తొలి ర్యాండమైజేషన్, వ్యయ పరిశీలకులకు శిక్షణ, పోలింగ్‌ కేంద్రాల ప్రకటన, వికలాంగులు/80 ఏళ్లకు పైబడిన వయో వృద్ధులైన ఓటర్లకు ఇంటి నుంచే ఓటు హక్కు కల్పించడానికి ఫారం 12డీ దరఖాస్తుల స్వీకరణ, సీ–విజిల్‌ ద్వారా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన ఫిర్యాదుల స్వీకరణ, పెయిడ్‌ వార్తలపై సమీక్ష, ఎన్నికల్లో వినియోగించేందుకు సమీకృత ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్‌/కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకం, బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ, ఈవీఎంలకు రెండో ర్యాండమైజేషన్‌ నిర్వహణ, పోస్టల్‌ బ్యాలెట్ల పంపిణీ/స్వీకరణ తదితరాలన్నీ పూర్తి చేయాలి.  

డిసెంబర్‌లో..  
డిసెంబర్‌ నెలలో పోలింగ్‌ సిబ్బందికి తుదిశిక్షణ, పోలింగ్‌ కేంద్రాలకు రవాణా సదుపాయ కల్పన, పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం అమ్మకాలపై నిషేధం, పోలింగ్, కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలి.  

Advertisement
Advertisement